శార్వరి నామ సంవత్సర చైత్ర పూర్ణిమ  తేదీ 7 ఏప్రిల్ 2020 మంగళవారం ఆకాశంలో చంద్రుడు కన్యారాశి హస్త నక్షత్రంలో పూర్ణ చంద్రుడిగా పెద్ద పరిమాణంలో 'మహాజాబిలి' గా కనువిందు చేస్తూ దర్శనమిస్తాడు. వాస్తవానికి సూర్యమాన ప్రకారం చూస్తే 8 బుధవారం రోజు పౌర్ణమి ఘడియలు సూర్యోదయంతో ప్రారంభం అయినవి, కానీ పౌర్ణమి ఘడియలు ఉదయం 8:50 వరకు మాత్రమే ఉన్నందున ఆకాశంలో చంద్రుని ప్రత్యేక కాంతి అనేది ఈ రోజు సాయంత్రం సమయానికి పౌర్ణమి ఘడియలు ఉన్నందున ఆ ప్రత్యేకత కనబడుతుంది.   

ఈ సమయానికి రాశి చక్రం గమనిస్తే అత్యంత అరుదైన స్థితులలో చైత్ర పూర్ణిమ చంద్రుడు మాహా జాబిలిగా మారబోతున్నాడు. అంతేకాదు ఇతర గ్రహ సంచారాలను  కుడా పరిశీలిస్తే ఈ పూర్ణ చంద్రుడు కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు చూపనున్నాడు. ఈ రోజు రాత్రి మహా జాబిలిని దర్శించుకుని ద్వాదశ రాశుల వారు జాతక లోపాల దృష్ట్యా పరిహారార్ధం దైవ స్మరణ చేస్తూ లలితా సహస్ర నామం, విష్ణు సహస్ర నామం చదుకున్న వారికి శుభం కలుగుతుంది.

చంద్రునికి ఉత్తర బిందువైన రాహువు, దక్షిణ బిందువైన కేతువుల మధ్యలో దర్శనం ఇవ్వడం కాల సర్ప ' యోగం' దోషం క్రింద ఏర్పడుతుంది. ఈ శార్వరి నామ సంవత్సరంలో ఇదే కాకుండా ఆరు సార్లు ఆరు విడతల వారిగా కాలసర్పయోగం జరగనున్నది. ప్రారంభ పూర్ణిమ నాటి గ్రహస్థితి గమనిస్తే మంత్రి చంద్రుడు కావడం, చైత్ర పూర్ణిమ రాహువు 'స్వ' నక్షత్రమైన ఆరుద్రలో ఉండడం, కేతువునకు తన స్వంత నక్షతమైన మూల నక్షత్రంలో ఉండడం ఈ రాహు, కేతువుల మధ్యలో చంద్రుడు తనుకూడా తన స్వంత నక్షత్రమైన హస్త నక్షత్రంలో ఉండడం గమనార్హం.

ఈ ఆరు విడుతల కాలసర్పయోగంలో కూడా చంద్రుడు తనకు అత్యంత ఇష్టమైన నక్షత్రం రోహిణి నక్షత్రంలో ఉచ్చస్థితి కలిగి ఉండడం జరుగుతున్నది. ఈ సంవత్సరం పాప గ్రహ సంఘర్షణలు అధికంగా ఉన్నాయి. గతంలో 2019 డిసెంబర్ 26 తేదీ నాడు ఏర్పడిన షష్ఠ గ్రహ కూటమిలో గురు ,శని ,కేతు ,బుధ , రవి ,చంద్ర గ్రహాలు ధనస్సురాశిలో కలిసిన నాటి నుండి  మొదలై ప్రస్తుత ఈ స్థితి వలన అరిష్టయోగం ఏర్పడినది. ఈ ప్రభావ ఫలితంగా ఈ శార్వరి నామ సంవత్సరాన్ని కుదిపి వేస్తుంది.

ఇలాంటి పరిస్థితులు ఈ సంవత్సరం చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఇలాంటి తరుణంలో మేషాది మీనరాశులు అనగా ద్వాదశ ' పన్నెండు' రాశుల వారు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటూ, వ్యతిరేక ఆలోచనలు చేయకుండా సన్మార్గంలో నడుస్తూ, దైవ చింతన చేస్తూ, పెద్దల, ప్రభుత్వాల మాటలను, సూచనలను గౌరవిస్తూ సాటి వారి కొరకు మానవీయ విలువలను దృష్టిలో పెట్టుకుని 'పరోపకారార్ధంమిదం' అన్న నీతి వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని నీకు తోచిన సహాయ సాహకారం చేస్తే నీలో అంతర్ముఖంగా దాగిఉన్న పరమాత్మ సంతృప్తి చెంది ఆత్మారాముడు విశ్వ వ్యాప్తం చెందినవాడు కాబట్టి తత్ ఫలితంగా నీకు నీ కుటుంబానికి తప్పక మేలు చేస్తాడు.    

ప్రస్తుత కాలంలో యావత్ ప్రపంచాన్ని 'కరోనా వైరస్' మహమ్మారి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, మానవజాతిని గడగడలాడింస్తుంది. ఈ ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారతదేశానికి ఓ ప్రత్యేకత ఉంది. మన దేశం కర్మభూమి ,వేదభూమి, ఎందరో మహనీయులు నడయాడిన సనాతన భూమి మన దేశం కాబట్టి మనం అంతగా భయపడ నవసరంలేదు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడిగారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కే.సి.ఆర్ గారు వీరు అందరిలా సాధారణ  'నాయకులు' కారు సంస్కృతీ సాంప్రదాయాలతో పాటు మంచి విచక్షణ కలిగిన రాజకీయ చతురులు, ఎంతటి సమస్యనైన అలవోకగా ఎదుర్కునే దురంధరులు. ఇంటికి తండ్రి పెద్దదిక్కుగా ఉన్నప్పుడు పిల్లలకు ఏ చీకు చింత ఉండదు, అలాగే అన్ని విషయాలలో సంపూర్ణ అవగాహాన కలిగిన నాయకులు మనకు ఉన్నందుకు గర్వ పడాలి, ధైర్యంగా ఉండాలి. 

ప్రస్తుత పరిస్థితులలో మనం చేయవలసింది ఒక్కటే ప్రభుత్వ సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ మనవంతుగా స్వయం గృహ నిర్భంధం అవుదాం, హాయిగా  కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉంటూ ఆత్మీయతలను పంచుకుందాం, శుచి శుభ్రతలు పాటిస్తూ ఒళ్ళు, ఇల్లే కాదు మన పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకుందాం. అవసరాలకు మించి పోకుండా విలాస వంతమైన జీవితానికి స్వస్తి చెప్పి అన్నింట్లో పొదుపు పద్దతులను అవలంభిద్దాం. మనతో పాటు ఈ లోకంలో ఎన్నో జీవులు ఉన్నాయి మనవంతుగా వాటికి మన శక్తి సామర్ధ్యాలకు తగ్గట్టుగా చేతనైన సహాయం చేద్దాం. 

ప్రభుత్వ సూచనలు గౌరవిస్తూ వ్యక్తీ గతంగా మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని, మన ఊరు, రాష్ట్రం, దేశాన్ని  కాపాడుకుందాం. సనాతన ధర్మాన్ని కాపాడుతూ జీవహింస లేకుండా, ప్రకృతి హాని చేయకుండ కర్తవ్యంగా ఒక సైనికుడిలా దేశ ప్రగతిలో భాగస్వాములమౌదాం. సంఘ సంస్కర్తలు ఎందరో పుట్టిన మన దేశంలో మనం ఆ స్థాయికి ఎందుకు ఎదగకూడదు .... అనుకుంటే సరిపోదు ఆచరిస్తే సాధ్యం కానిది అంటూ ఏదిలేదు  జై శ్రీమన్నారాయణ.