Asianet News TeluguAsianet News Telugu

శృంగారాన్ని మహిళలే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు..? ఈ పురాణగాథే సాక్ష్యం..!

నీటిలో నిండుగా మునిగి లేచాడో లేదో అతని రూపం మారిపోయింది. స్త్రీగా మారిపోయాడతను. నీటిలో నీడను చూసుకుని ఆశ్చర్యపోయాడు ముందు. తర్వాత అంగాంగం తడిమి చూసుకుని విలపించాడు. ఏం చెయ్యాలో అంతు చిక్కలేదు.

Sex is more important to a woman than a man! Listen to this story....
Author
Hyderabad, First Published May 12, 2021, 2:45 PM IST

శృంగారం విషయంలో ఆధిపత్యం ఎవరిది అనగానే ఎవరైనా ముందుగా పురుషులదే అనే  చెబుతారు. ఎక్కువ సుఖం కూడా వాళ్లకే దక్కుతుందని అనుకుంటారు. అయితే.. అందులో ఏ మాత్రం నిజం లేదట. శృంగారాన్ని మహిళలే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారట. దీనికి ఓ పురాణ కథే సాక్ష్యం అని పూర్వీకులు చెబుతున్నారు. మరి ఆ కథేంటో మనమూ తెలుసుకుందామా..?

పూర్వం భంగాస్వనుడు అని ఓ రాజుండే వాడు. అతనికి ఎక్కువ మంది బిడ్డలు కావాలి అనే కోరిక ఉండేది. ఆ  బిడ్డల కోసం అతను దేవేంద్రునికి ఇష్టం లేని ఓ యాగం చేశాడు. ఆ యాగం ఫలించింది.  ఫలితంగా అతనికి నూరుగురు పుత్రులు కలిగారు. కోరిక తీరడంతో భంగాస్వనుడి ఆనందానికి అంతులేకపోయింది. 

చాలా సంతోషంగా సంబరాలు  చేసుకునేవాడు. ఒకసారి వేటకి వెళ్ళాడా రాజు. అదే అదనుగా దేవేంద్రుడు అతనికి ఊహించని షాక్ ఇచ్చాడు. తోడుగా వచ్చిన పరివారానికి దూరంగా భంగాస్వనుడి గుర్రం పరుగుదీసింది. ఎక్కడా అగలేదది. అడవి లోలోపలికి ప్రవేశించింది. కాకులు దూరని కారడవిలా ఉందా ప్రాంతం. అక్కడాగింది గుర్రం. దాహం అనిపించింది రాజుకి. నీరు కోసం వెదుకుతూ గుర్రంతో పాటుగా ఓ సరోవరానికి చేరుకున్నాడతను. 

ఒడ్డున గుర్రాన్ని విడిచిపెట్టి, సరోవరంలోకి దిగాడు. దోసిళ్ళతో నీరు తాగాడు. కడుపు నిండింది. చల్లటి చెరువు నీటిలో స్నానం చేయాలనిపించింది. చేశాడు. నీటిలో నిండుగా మునిగి లేచాడో లేదో అతని రూపం మారిపోయింది. స్త్రీగా మారిపోయాడతను. నీటిలో నీడను చూసుకుని ఆశ్చర్యపోయాడు ముందు. తర్వాత అంగాంగం తడిమి చూసుకుని విలపించాడు. ఏం చెయ్యాలో అంతు చిక్కలేదు. 
ఒడ్డుకి చేరుకుని ఇలా అనుకున్నాడు.ఈ రూపంలో గుర్రం మీద కూర్చుని స్వారీ చేయగలనా? ఒకవేళ స్వారీ చేయగలిగి, అంతఃపురానికి చేరుకుంటే...రాణులు నన్ను ఏ విధంగా భావిస్తారో కదా! పిల్లలు ఏమనుకుంటారో కదా!వెళ్ళకుండా ఇక్కడ ఈ కారాడవిలో ఉండిపోతే! ఉండలేను. దిక్కెవరు? వెళ్ళిపోక తప్పదనుకున్నాడు భంగాస్వనుడు. ఏమయితే అది అయిందని, గుర్రాన్ని అధిరోహించి అంతఃపురానికి చేరుకున్నాడు. 

రాజుగారి గుర్రం మీద ఎవరో స్త్రీ వచ్చింది. రాజుగారు ఏమయ్యారు? గుసగుసలు పోయారంతా. పక్కకి తప్పుకున్నారు. భంగాస్వనుడు నేరుగా సభామంటపానికి చేరుకున్నాడు. మంత్రి సామంతులను పిలిచాడు. జరిగిందంతా చెప్పి, తక్షణ కర్తవ్యం తెలియజేయమన్నాడు. ఆలోచించారంతా. ఆఖరికి ఇలా నిర్ణయించారు. భంగాస్వనుడి పెద్ద కొడుక్కి రాజ్యాధికారాన్ని కలుగజేయాలన్నారు.

మిగిలిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించి, రాజ్య పాలన చేయడమే శ్రేయస్కరమన్నారు. అందుకు అంగీకరించాడు భంగాస్వనుడు. అలాగే చేశాడు. తానేమో అరణ్య ప్రవేశం చేసి, మునీశ్వరులని సంద ర్శించి, వారు చెప్పినట్లు చేయడం మొదలుపెట్టాడు.

కొద్దికాలం గడిచింది. ఓ మునికి, స్త్రీ రూపంలో ఉన్న భంగాస్వనుడి మీద ప్రేమ కలిగింది. దీంతో ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఆ ముని కారణంగా భంగాస్వరుడు నూరుగురు పుత్రుల్ని కన్నారు.ఈ నూరుగురినీ తీసుకుని భంగాస్వనుడు రాజధానికి చేరుకున్నాడు. అప్పటి తన పుత్రులను కలుసుకున్నాడు. ఇలా అన్నాడు.‘నాయనలారా! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కన్నాను. స్త్రీగా ఉండి,ఇప్పుడు ఈ నూరుమందినీ కన్నాను. మీరంతా అన్నదమ్ములే! ఈ రాజ్యాన్ని మీరంతా పంచుకుని, పరిపాలించండి.’ అని చెప్పాడు.

స్త్రీ రూపంలో ఉన్న తండ్రి మాటకు వారు ఎదురు చెప్పలేదు.  స్త్రీరూపంలో ఉన్న నాటి తండ్రి చెప్పినట్టుగానే రాజ్యాన్ని పంచుకుని పాలించసాగారు. శాత్రవ భయంకరులయ్యారు. ధర్మతత్పరులయ్యారు. న్యాయపరిరక్షణలో వారికి సాటి లేదనిపించారు. దేవేంద్రుడు అది గమనించాడు. తట్టుకోలేకపోయాడు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టుగా భంగాస్వనుడు లోకోత్తరుడు కావడాన్ని భరించలేకపోయాడు. రాజ్యాభివృద్ధితో భంగాస్వనుడు కలకలలాడడాన్ని చూడలేకపోయాడు. 

ఎలాగయినా అతని అభివృద్ధిని నిరోధించాలనుకున్నాడు. బ్రాహ్మణుని వేషంలో భంగాస్వనుడు పురుష రూపంలో ఉన్నప్పుడు కన్న పిల్లల్ని కలుసుకున్నాడు.‘మీ అభిమానానికీ ఆదరణకీ అర్థం ఉండాలయ్యా! ఎవరో మునికి పుట్టిన వారిని సహోదరులని ఎలా అనుకుంటున్నారు? స్త్రీ రూపం దాల్చిన వాడు, మీ తండ్రి ఎలా అవుతాడు? ఆలోచించండి. రాజ్యం మీ వందమందిదే! ఆ వందమందికీ ఇందులో హక్కులేదు. వెళ్ళగొట్టండి.’ చెప్పాడు దేవేంద్రుడు. 

వారు ఆలోచనలో పడడాన్ని గమనించి, సన ్నగా నవ్వుకున్నాడు. అక్కణ్ణుంచి నిష్క్రమించాడు. భంగాస్వనుడు స్త్రీరూపంలో కన్న పిల్లల్ని కలిశాడు.‘మీరు వారికి సహోదరులు కారట! మునికి పుట్టిన పిల్లలూ మేమూ ఒకటి ఎలా అవుతాం అంటున్నారు మీ తల్లిగారు పురుషరూపంలో ఉన్నప్పటి మీ అన్నలు. మిమ్మల్నీ రాజ్యం నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జాగ్రత్త’ చెప్పాడు దేవేంద్రుడు.
దాంతో అన్నదమ్ముల మధ్య అగాధాలు ఏర్పడ్డాయి. భేదాలు తలెత్తాయి. ఒకరంటే ఒకరికి విపరీతంగా ద్వేషం ఏర్పడింది. యుద్ధానికి పాల్పడ్డారు. యుద్ధంలో అటు సంతానంలో కాని, ఇటు సంతానంలోగాని ఒక్కరు కూడా మిగల్లేదు. అంతా వీరస్వర్గాన్ని అలంకరించారు.తల్లిగా భంగాస్వనుడు ఆ కడుపుకోతను భరించలేకపోయాడు. పిల్లల్ని తలచుకుని, తలచుకుని రోదించసాగాడు. అప్పుడక్కడికి వచ్చాడు దేవేంద్రుడు.

 అప్పుడు కూడా అతను బ్రాహ్మణుని వేషంలోనే ఉన్నాడు.‘ఏం జరిగింది? ఎందుకేడుస్తున్నావు?’ అడిగాడు దేవేంద్రుడు. జరిగిందంతా చెప్పుకొచ్చాడు భంగాస్వనుడు. పిల్లల మధ్య వైరాన్ని ఎవరు పురిగొల్పారో తెలీదని ఒక్కపెట్టుగా ఏడ్చాడు. జాలిపడ్డాడు దేవేంద్రుడు. నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు.‘దేవేంద్రా’ ఆశ్చర్యపోయి, చేతులు జోడించాడు భంగాస్వనుడు.‘నాకిష్టంలేని యాగం చేసి కష్టాలు తెచ్చుకున్నావు. నా కోపమే నీ వంశ వినాశనానికి కారణమయింది.’ చెప్పాడు దేవేంద్రుడు.

‘పిల్లలు కావాలన్న పట్టుదలతో తప్పు చేశాను. క్షమించు.’ అన్నాడు భంగాస్వనుడు. దేవేంద్రుని కాళ్ళు పట్టుకున్నాడు. కరిగిపోయాడు దేవేంద్రుడు. కరుణించాడు. ఇలా అన్నాడు భంగాస్వనునితో.‘చనిపోయిన నీ పిల్లల్లో కొందరిని మాత్రమే బతికించగలను. చెప్పు, ఎవరు కావాలి?’ఆలోచనలో పడ్డాడు భంగాస్వనుడు. ఆలోచించి ఆలోచించి, ఆఖరికి ఇలా అన్నాడు.‘ఇప్పుడు నేను తల్లిని. ఈ తల్లి బిడ్డల్నే బతికించు’ఆశ్చర్యపోయాడు దేవేంద్రుడు.

‘తండ్రిగా ఉన్నప్పటి బిడ్డలక్కర్లేదా?’ అడిగాడు.‘దేవేంద్రా! పిల్లలంటే తల్లికే ఎక్కువ ఇష్టం. ఈ సంగతి నీకు తెలియంది కాదు.’ఆ సమాధానానికి సంతోషించాడు దేవేంద్రుడు.‘నిజం చెప్పావు. ఇందుకు బహుమతిగా నీ పిల్లలందరినీ బతికిస్తున్నాను. తండ్రిగా నువ్వు కన్న పిల్లల్ని కూడా బతికిస్తున్నాను. తీసుకో! ఇంకో వరం కోరుకో’ అన్నాడు దేవేంద్రుడు.

‘అయితే నన్నిలా స్త్రీగానే ఎల్లకాలమూ ఉంచు’ అన్నాడు భంగాస్వనుడు. ఆశ్చర్యపోయాడు దేవేంద్రుడు.‘ఇదేం కోరిక?’ అడిగాడు. దానికి భంగేస్వరుడు.. శృంగారంలో పురుషుడికన్నా.. స్త్రీలకే ఎక్కువ సౌఖ్యం లభిస్తుంది.. అందుకే నన్ను స్త్రీగానే ఉంచు అని అడిగాడు. అందుకే దేవేంద్రుడు కూడా సరేనని చెప్పాడట. 

Follow Us:
Download App:
  • android
  • ios