ట్యాంక్బండ్ మీద కుర్చీలో కూర్చుంది స్వప్న. ఆమెకు చాలా చిరాగ్గా వుంది. ఆమె అక్కడికి వచ్చి గంట పైనే అవుతోంది. ఇంతగా వెయిట్ చేయడం ఆమెకు నచ్చడం లేదు. వెళ్లిపోదామా అని చాలాసార్లు అనుకుంది. కానీ వస్తాడేమోననే ఆశ ఆమెను అలా కట్టిపడేస్తోంది. తాను వెళ్లిపోతే నరేంద్ర నిరాశ పడుతాడేమోనని ఆమె బాధ. తాను పడుతున్న తపన నరేంద్రకు అర్థమవుతుందా అని ప్రశ్నించుకుంది. నరేంద్ర ఎప్పుడూ ఇంతే అనుకుంది. చెప్పిన టైమ్కు రాడు. ఆలస్యానికి ఏవేవో కారణాలు చెప్తాడు. ఆ కారణాలు అసత్యంగా అనిపించవు. వచ్చిన తర్వాత కాలం ఎలా గుడుస్తుందో కూడా తెలియనంతగా ఆనందింపజేస్తాడు. అతని మాటల్లో ఏదో మంత్రం ఉంది అని ఆమె చాలాసార్లు అనుకుంది.

ఇక వెయిట్ చేయడం తనవల్ల కాదనిపించింది. లేచి వెళ్తామని అనుకుంటుండగా తన వెనక బైక్ చప్పుడు వినిపించింది. నరేంద్ర వచ్చాడని తెలిసిపోయింది. బైక్ చప్పుడును బట్టే ఆమె అతని రాకను గుర్తుపడుతుంది. అయినా, ఆమె వెనుదిరిగి చూడలేదు. అతని మీద యుద్ధం చేయాలనిపిస్తోంది. తనంటే ఖాతరు లేదని కయ్యానికి దిగాలని అనుకుంది.

నరేంద్ర బైక్ ఆపేసి వచ్చి “హాయ్! స్వప్నా! ఐయామ్ సారీ!!” అన్నాడు. ఆమె మాట్లాడలేదు.

పక్కనే కూర్చున్నాడు. ఆమె దూరం జరిగింది. “కోపమొచ్చిందా? ఏం చేయను చెప్పు. మా బాస్ క్యాబిన్ లో కూర్చోబెట్టి ఒకటే సుత్తి కొట్టాడు. చెప్పేసి వద్దామంటే వీలు కాలేదు. వాడు చెప్పేది వినకపోతే తోక కత్తిరిస్తాడు”- అని చెప్పాడు.

అయినా ఆమె మాట్లాడలేదు.

“మర్చేపోయా. నీకో మంచి గిఫ్ట్ తెచ్చా” అంటూ లేచి బైక్ దగ్గరకు వెళ్లి ఓ బాక్స్ తెచ్చాడు. బాక్స్ చూడ్డానికి చాలా అందంగా వుంది. బాక్స్ తీసి ఓపెన్ చేశాడు.

"ఇది నీ చేతిలో చాలా బాగుంటుంది. నువ్వు ఈ పెన్నుతోనే కథలు రాయాలని నా కోరిక. దీనితో రాస్తుంటే నా గుండెతో రాస్తున్నట్టు నాకు ఫీలింగ్. దీనికో ప్రత్యేకత ఉంది తెలుసా? దీని వల్ల వేళ్లు నొప్పి పుట్టవు. దీనికి కుషన్ వుంటుంది. దీని కాస్టెంతో తెలుసా? ఫైవ్ హండ్రెడ్ రూపీస్. నీకోసం నాకేం పెద్ద ఖర్చనిపించలేదు ఇది” అన్నాడు.

ఆ పెన్ను వైపు చూసింది స్వప్న. చాలా బాగుంది. నరేంద్ర సెలెక్షన్ ఎప్పుడూ బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్న చిన్న విషయాలను చాలా లోతుగా విశ్లేషించడం ఆమెకు చాలా నచ్చింది. ఏ విమర్శకుడు కూడా పట్టుకోలేని విషయాలను అతను పట్టుకునేవాడు. పైగా అతని వ్యాఖ్యానాలు తన హృదయ స్పందనలకు దగ్గరగా వుండసాగాయి. ఏదైనా కథ అచ్చయినప్పుడు అతని కామెంట్ కోసం వెయిట్ చేయడం అలవాటయింది. అతను ఫోన్ చేసి తన అభిప్రాయం చెప్పనప్పుడు ఆమెనే అతనికి ఫోన్ చేసి మాట్లాడసాగింది. ఇలా పెరిగిన పరిచయం క్రమంగా ఇద్దర్నీ దగ్గర చేసింది.

ఇప్పుడు కలిస్తే కథల గురించి మాట్లాడే వ్యవధి కూడా వారికి ఉండడం లేదు. అవి చాలా చిన్న విషయాలైపోయాయి. ఒకరి పట్ల ఒకరికి గల ఆసక్తి, ఒకరి పట్ల ఒకరికి గల అభిమానం , ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమ - ఇవే, అప్పుడప్పుడు మాత్రమే వారు కథల గురించి మాట్లాడుకుంటారు.

“నీకో సర్ ప్రయిజ్ ఇవ్వాళ" అన్నాడు నరేంద్ర. “నీ మాటలే సర్ ప్రయిజ్. ఇంక కొత్తగా సర్ ప్రయిజ్ ఏమిటి?” అంది
స్వప్న

“నా లేట్ నిన్ను చాలా బాధ పెట్టినట్లుంది. నువ్వు బాధపడడంలో అర్థం ఉంది. నేను నీలాగే బాధపడుతున్నాను. కానీ బాధపడుతూ కూర్చుంటే ఆనందపడే క్షణాలు తగ్గిపోతాయి” అన్నాడు.

“నిన్నో మాట అడగనా?" “అడుగు. సందేహం ఎందుకు?" “నిన్ను ఎప్పటికీ నావద్దే కట్టి పడేసుకోవాలని ఉంది" “కొత్తగా కట్టి పడేసుకునేదేముంది?” నవ్వుతూ అన్నాడు.

“పెళ్లి చేసుకుంటే ఏ టైమ్కైనా నా దగ్గరికి వస్తావనే నమ్మకం వుంటుంది “పెళ్లికి, ప్రేమకు కుదరదు. ప్రేమ పెళ్లితోనే ముగుస్తుంది” అన్నాడు 

"అలా ఎందుకనుకుంటావ్?” .

పెళ్లి చేసుకోవడమంటే రాజీ ఒప్పందం చేసుకోవడమనే అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది వుండదు.”

“భార్యాభర్తలు ఎంతమంది సంతోషంగా లేరు?!” అంది.

“భార్యాభర్తల మధ్య బాధ్యత మాత్రమే వుంటుంది. ప్రేమ అనేది నిరంతర తపనకు సంబంధించిన వ్యవహారం. పెళ్లి అనేది బాధ్యతను మోయడానికి కుదుర్చుకునే ఒప్పందం.”

“పెళ్లి చేసుకోకుంటే మన మధ్య ప్రేమ ఎప్పుడూ వుంటుందంటావా?”

“మనం దూరమైనా ఆ ప్రేమ అలాగే నిలిచి వుంటుందనేది నా నమ్మకం. ఒక తీపి జ్ఞాపకంగా వుండిపోతుంది” అన్నాడు.

“దూరమయ్యామనే వేదన వుండదా?”

“ఆ వేదన కూడా తీయటి అనుభూతినే ఇస్తుంది. పైగా నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలను కంటూ కథలు రాయడమనేది నేను ఊహించలేను” అన్నాడు.

“ఏం?”

“పెళ్లి చేసుకుంటే నీకు కథలు రాయడం కూడా ఒక వృత్తి అవుతుందనేది నా బాధ. నీ హృదయం అందులో వ్యక్తం కాదు. ఎంతమంది రైటర్స్ ను మనం ఇప్పుడు చూడడం లేదు. ఏ రైటర్ ను తీసుకున్నా వాళ్ల తొలి రచనలే బాగా ఉండడానికి కారణం ఏమిటి? తర్వాతి రచనల్లో హృదయం ప్రతిఫలించదు. సంసారచట్రంలో ఇరుక్కుపోయిన తర్వాత వారి హృదయం మొద్దుబారుతుంది. హృదయం మొద్దుబారిన తర్వాత రాసే రచనల్లో లాజిక్, కార్యకారణ సంబంధాలు గొప్పగా ఉండవచ్చు గానీ ఆ రచనలు ఫ్రెష్ గా వుండవు. అందుకే పాఠకుల హృదయాలకు అవి తాకవు. మెదడును కదిలిస్తాయి. హృదయానికి తాకి, మనసును కల్లోలపరిచే రచనలు గొప్ప రచనలవుతాయి” అని ఓ ఉపన్యాసమే ఇచ్చాడు నరేంద్ర.

నరేంద్ర వాదన ఆమెకు వింతగానూ, విచిత్రంగానూ అనిపించింది. అతని వాదనలో ఎంతో కొంత నిజముందని అనిపించింది.

"నేను ఈ సూటలు నిన్ను తప్పించుకోవడా! అనడం లేదు. నాకు సెట్టి మీద నమ్ముకం లేగంతో" అన్నాడు,

“నీ సిన్సింగూలీటీ గురించి నాకేం అపనమ్మకం లేదు. నిన్ను చూడకుండా, నీ నూటలు వినకుండా నేను ఉండగలనా అని ఆలోచిస్తున్నా"

"నా మీద నీకు ఎల్లకాలం ఇదే కాంక్ష ఉంటుందని కూడా నేను అనుకోవడం లేదు. అలా ఉండాలని కూడా నేను కోరుకోవడం లేదు. నాది ఎస్కేపిజం అయితే కావచ్చు కానీ నాకు పెళ్లి ఇష్టం లేదు” అన్నాడు.

ఆమె లేచింది. అతనూ లేచాడు. అతను బైక్ తీశాడు. ఆమె వెనక కూర్చుంది. ఇద్దరూ ఓ హోటల్ కు వెళ్లి డిన్నర్ చేశారు. అంతసేపు వారి మధ్య సంభాషణ సాగుతూనే ఉంది. పుస్తకాల గురించి, రైటర్స్ గురించి, పరస్పర ప్రేమల గురించి మాట్లాడుకున్నారు.

ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద దింపాడు. ఆమె బైక్ దిగి వెళ్లసాగింది. “మళ్లీ ఎప్పుడు?” అడిగాడు. “బహుశా ఇదే ఆఖరి సమావేశం” అంది.

బైక్ నిలబెట్టి ఆమెకు అడ్డంగా వెళ్లాడు. “ఇదేమిటి, స్వప్నా! ఇంత సడెన్ డెసిషన్?” అని అడిగాడు.

“నువ్వు చెప్పిన బాధ్యతే మన మధ్య ఎంటర్ అయినట్టుంది. దీనికి స్వస్తి చెప్తే మంచిది” అంది. ఆమె అతడ్ని సున్నితంగా పక్కకు తప్పించి వెళ్లిపోయింది.