Asianet News TeluguAsianet News Telugu

డా. కోలవెంటి సుధాకర్: ‘కులము’ – ‘మీడియా’ వొక లోచూపు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ వ్యవహారం వివాదంగా మారింది. ఈ వివాదంలో కులం ప్రధానాంశంగా చర్చకు వస్తోంది. దీనిపై జాన్ సన్ చోరగుడి ప్రత్యేక విశ్లేషణ.

Johnson Choragudi opinion on dr Sudhakar issue in Andhra Pradesh
Author
Vijayawada, First Published May 23, 2020, 4:31 PM IST

- జాన్ సన్ చోరగుడి

 
ఏదో ఒక కాల హద్దు వద్ద నిలబడి ఎప్పుడో వొకప్పుడు మాట్లాడక తప్పని విషయమిది. ఇప్పుడు కూడా ఇది ‘ప్రిమెచ్యూర్’ అని కనుక అనిపిస్తే, అందుకు కారణం – ‘కోవిడ్-19’. ప్రతి వందేళ్ళకు వొక ‘ఎపిడమిక్’ ప్రపంచాన్ని కుదుపుతూ ఉందని 1918-19 లో వచ్చిన ‘స్పానిష్ ఫ్లూ’ గురించి చెబుతున్నారు. అయితే దాని తర్వాత ఈ దేశానికి  స్వాత్యంత్ర్యం వచ్చింది, గడచిన డెబ్బై ఏళ్ళుగా మనం దాన్ని అనుభవిస్తున్నాము. కనుక దేన్ని అయినా సింహావలోకనం చేసుకోవడానికి వొక ప్రాతిపదిక ఉండాలనే నియమం ఏమీ లేదు. ఎందుకంటే ఈ ‘కోవిడ్-19’ మన తరానికి తెలియని కొత్త అనుభవం. అందుకని దాని ‘విండో’ లో నుంచి వెనక్కి చూడడంలోనూ, దాటి వచ్చాము అని మనం చెప్పుకొంటున్న మైలు రాళ్ళను మదింపు చేసుకోవడంలోనూ; అ దారిలో ‘స్పీడ్ బ్రేకర్’ అనిపించిన వాటి గురించి క్షుణ్ణంగా మాట్లాడానికి మనకు ఆక్షేపణ ఏమీ ఉండనక్కరలేదు. 

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయి వేరే రాష్ట్రం అయింది. – మనం ఇప్పుడు ‘కోవిడ్-19’ కాలం మధ్యలో ఉన్నాం. ఇక మనం ఇందుకు చేస్తున్నది - రాష్ట్ర ఆర్ధిక సామాజిక సాంస్కృతిక పరిణామాల వర్తమాన స్థితి సమీక్ష. అయితే ఇందుకు మనల్ని ‘ఇగ్నేట్’ చేసింది – విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ కోలవెంటి సుధాకర్ ఉదంతం. మనకు చిరాకు అనిపించినవి ‘కార్పెట్’ క్రిందికి కాలితో నెట్టేసి అంతా బాగుంది అనుకోవడం సుళువే, కానీ ఇవి - ఏదో ఒక కాల హద్దు వద్ద నిలబడి ఎప్పుడో వొకప్పుడు మాట్లాడక తప్పనివి. లేకుంటే ఏదో వొక పక్కనుంచి ఎలుక చచ్చిన వాసన వస్తూనే ఉంటుంది. వ్యాస పరిచయం పరిధి విస్తృతంగా ఉన్నట్టుగా అనిపించినా రెండు అంశాలే ప్రస్తుత చర్చ. 

 

Johnson Choragudi opinion on dr Sudhakar issue in Andhra Pradesh

 

 మెదటిది - మన దేశంలో - ‘అస్థిత్వ ఉద్యమం’ ఉదృతి కారణంగా భారత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి మరీ ఎస్సీ, ఎస్టీల కోసం చేసినవి. లేదా మేము చేయించుకున్నవి ఇవీ, అని ‘క్లెయిం’ చేసేటంతగా విజయాలు మనకు ఏమైనా వున్నవా? ఇది మొదటి అంశం.  

రెండవది - ఇండియా వంటి మూడవ ప్రపంచ దేశాల్లో కూడా ‘టెక్నాలజీ’ అందరికీ వొక ‘లెవెల్ ప్లే గ్రవుండ్’ ను సృష్టించడం వొక వాస్తవం. మునుపు ఉన్న వివక్షకు ఇప్పుడు తావు లేకుండా ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ అందరికీ అందుబాటులోకి రావడం నిజం. అయినప్పటికీ దాని వినియోగం భిన్నంగా ఉంది. అంటే - అందుబాటులో ఉన్నవి  వినియోగించు కోవడంలో ఎదుర్కొంటున్న వెనుకబాటుతనం, ఇది రెండవ అంశం.

ఈ రెండింటి చర్చకు కాలిక సరిహద్దు (“టైం ఫ్రేం’) – ‘ఆర్ధిక సంస్కరణల’ 1991-2016 పాతికేళ్ళ కాలం. వీటిలో మొదటి అంశం ‘రాజ్యం’ నుంచి ఈ వర్గాలు పొందవల్సినది. రెండవదైన ‘టెక్నాలజీ’  ‘రాజ్యం’ అనుమతితో ‘ప్రైవేట్ కార్పోరేట్ పవర్ ప్లేయర్స్’ వినియోగదారులు కోసం అందుబాటులోకి తెచ్చినవి. రెండు కూడా భిన్నమైన పరిధులు వున్న అంశాలు కనుక, చర్చ కోసం కూడా వీటిని వేర్వేరుగానే చూద్దాం...

 మొదటి అంశం

ఈ కాలంలో వొక కెరటంలా ప్రభావ వంతంగా తన ఉనికిని ప్రకటించుకున్నదళిత అస్థిత్వ ఉద్యమ ‘స్ఫూర్తి’ వొక కార్యాచరణ కొరకు దుర్భేద్యమైన ఈ దేశ చట్టసభల చట్రంలోకి ప్రవేశించి తన ‘ఎజెండా’ అమలుకు అది రాజ్యాంగాన్ని తాకలేకపోయింది. కారణం దానికున్నసహజ “ఇమ్యూనిటీ” చుట్టూ కంటికి కనిపించకుండా ఉన్న చట్రం దాని వేర్వేరు వలయాలు అంత శక్తివంతమైనవి కావడం. అయితే, ఈ శ్రేణుల కొరకు ‘రాజ్యం’ ఉద్దేశ్యించిన చట్టపరమైన భద్రత, దామాషా మేరకు ఈ వర్గాల కోసం కేటాయించిన సంక్షేమ పధకాలు వాటి పటిష్టమైన అమలుకు ఏవో కొన్ని ‘ఎగ్జిక్యూటివ్’ ఆర్డర్లు సాధించడం వంటివి ఈ దిశలో కొంత మేర ఊరట.

 

Johnson Choragudi opinion on dr Sudhakar issue in Andhra Pradesh

 

ఏదో మేము కూడా మా కోసం కొంత చేసుకున్నాము, అని తమ స్వంత ఖాతాలో వేసుకోవడానికో లేదా చూపించుకోవడానికో అవి పనికిరావచ్చునేమో గాని, జరిగినవి ఏవీ కూడా రెండున్నర దశాబ్దాల కాలక్రమంలో ప్రభుత్వాల్లో ‘రొటీన్’ లో జరగకుండా ఆగేవి అయితే కాదు. ఎందుకంటే, ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం ప్రతి దశలోనూ అర్హులకు అందే ప్రయోజనాలకు అడ్డొచ్చి దారి మళ్ళించే ‘ఫిల్పరేజ్’ ని తగ్గించడానికే చూస్తుంది. గ్రామీణ అభివృద్ధి, సంక్షేమం కోసం మనకు నిధులు ఇచ్చే ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు పారదర్శకతకు ‘టెక్నాలజీ’ జోడించడం షరతుగా పెడుతున్నాయి. యు. పి.ఎ. ప్రభుత్వం పదేళ్ళ కాలంలో వచ్చిన - సమాచారం, ఆహరం, విద్య, వంటి పలు హక్కుల చట్టాలు అటువంటివే. 

 

Johnson Choragudi opinion on dr Sudhakar issue in Andhra Pradesh

 

అయితే మరి లోపం ఉన్నదెక్కడ? కీలకమైన వైఫల్యం చట్ట సభల్లో ఈ వర్గాల నుంచి ఎన్నికయిన ప్రజా ప్రతినిధులకు ఉన్న ‘ఆపరేషనల్’ పరిమితుల వద్ద ఉంది. ఇందుకు ఒక్క ఉదాహరణ చెప్పుకుంటే చాలు. అది - ఈ వ్యాసం కొరకు ముందుగా ఎంచుకున్న కాలపరిమితి (1991-2016) లోని చివరి ఏడాది అయిన 2016 జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన దళిత విద్యార్ధి వేముల రోహిత్ ‘క్యాంపస్’ వివక్షకు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం. గత పాతికేళ్ళ సంస్కరణల కాలంలో వెల్లువెత్తిన ‘అస్థిత్వ’ ఉద్యమాల వోటమికి రోహిత్ మరణం వొక ప్రతీకాత్మక జ్ఞాపిక.

ఇదే కాలంలో, తాము కూడా ప్రజా ప్రతినిధులం కావాలని రిజర్వుడు నియోజకవర్గాల మీద దృష్టి పెట్టిన వ్యక్తులను వారి నేపధ్యాన్ని పరిశీలించినప్పుడు, రాబోయే మరో పాతికేళ్లలో కూడా వేముల రోహిత్ ఆత్మకు సైతం ఇక్కడ శాంతి లభించదు! మరి అటువంటప్పుడు ‘మెయిన్ స్ట్రీమ్’ పార్టీ అయిన కాంగ్రెస్ లో మొదటినుంచి ఉన్న ‘హరిజనాభ్యుదయం’ నుంచి చీలి బయటకొచ్చి; రాజ్యాధికారం లక్ష్యం అంటున్న ‘దళిత’ అస్తిత్వ ఉద్యమ తాత్వికత వల్ల వీరు అదనంగా సాధించిన ప్రయోజనాలు ఏమిటి? పోనీ అవి ఏమైనా ఉంటే, అవి వ్యక్తిగతమా లేక వ్యవస్థాగతమా? ఈ ప్రశ్న విధిగా మనల్ని ‘అస్తిత్వ’ ఉద్యమ మూలాలు వద్దకు తీసుకుని  వెళుతున్నది.

 ఒక నాటి వామపక్ష విద్యార్ధి ఉద్యమాలు, దళిత విద్యార్ధి ఉద్యమాలుగా రూపాంతరం చెందడం వెనుక ఉన్న తాత్విక నేపధ్యం కొరకు ముందుగా చూద్దాం. అలా చూసినప్పుడు - “ఆర్థికసంబంధాలు పునాదిగా రాజకీయ సామాజిక మత సాంస్కృతిక సంబంధాలు నిర్మితమౌతాయనే... రెండంచెల మార్క్సిస్ట్ దృక్పథంలో ‘పౌరసమాజం’ అనే మధ్య అంచె ఉండడాన్ని గుర్తించినవాడు అంటోని గ్రాంసీ” అంటారు ప్రముఖ చరిత్ర అధ్యాపకుడు, సాహితీవేత్త కొప్పర్తి వెంకట రమణమూర్తి. “ గ్రాంసీ ప్రయోగించిన వాటిల్లో ప్రపంచం మీద, భారత దేశం మీద విస్తారమైన ప్రభావం చూపిన పదం,  ఆయనే మొదటిసారి ఉపయోగించిన పదం (సబాల్టర్న్ గ్రూప్స్) ‘ఉపశ్రేణులు.’ కార్మిక కర్షక వర్గంలో అధికంగా ఉన్నది దళిత బహుజనులైతే, దాదాపు దళిత బహుజనులంతా శ్రామికవర్గమే. కులం, వర్గం అనేవి రెండు వేర్వేరు సమస్యలైనా ఎదుర్కొంటున్న శ్రేణి ఒక్కటేనని గుర్తించడంలో గ్రాంసీ ‘రిలవెన్స్’ ఉంది” అంటారు కొప్పర్తి.

 

Johnson Choragudi opinion on dr Sudhakar issue in Andhra Pradesh

 

అంటోనీ గ్రాంసీ రచనలు డెబ్బై దశకంలో ఇంగ్లీష్ లోకి తర్జుమా అయిన తర్వాత గాని వాటి వ్యాప్తి మొదలై అవి మన వద్దకు చేరలేదు. ఈ సరికొత్త సామాజిక ఆవిష్కరణను మార్క్సిస్ట్ దృక్పధానికి కొనసాగింపుగా తీసుకోవడానికి గానీ, దాని కార్యాచరణకు గానీ తొలుత వామపక్షాలు నిరాకరించినప్పటికీ, అప్పటికే బీటలువారిన సోవియట్ యూనియన్ పరిణామాలు వారి మునుపటి ఆధిపత్య స్వరాన్ని నిశబ్ద పరిచాయి. అప్పటికి అలా ఏర్పడిన ‘క్యాంపస్’ పాలిటిక్స్ జాగాలోకి ‘అంబేద్కర్’ రెండవసారి ప్రవేశించారు.

బొంబాయి నార్త్ లోక్ సభ నియోజకవర్గానికి 1952 లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఒక అనామకుడి చేతిలో డా. బి.ఆర్. అంబేద్కర్ ఘోరమైన వోటమి పాలయ్యారు. ఆ తర్వాతి కాలంలో ‘అంబేడ్కరిస్టులు’ అన్ని రాజకీయ పార్టీల నుంచి ‘రిజర్వుడు’ నియోజకవర్గాల్లో ఎన్నిక అవుతూనే వున్నారు. బొంబాయి టెక్స్ టైల్  మిల్లుల్లో అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్లో సభ్యులుగా ఉన్న కార్మికులు అక్కడి నూలుమిల్లులు మూతపడుతున్న క్రమంలో 90’ దశకం నాటికీ శివసేన ట్రేడ్ యూనియన్లలో చేరారు. క్షేత్ర స్థాయి వాస్తవాలు ఇలా ఉండగా; కాలిక స్పృహ, గమనం లేకుండా కేవలం ‘అస్థిత్వ ఉద్యమాలు’ అంటూ యూనివర్సిటీ ‘క్యాంపస్’ ల్లోకి ప్రవేశించిన ‘అంబేద్కరిజం’ ‘రెండవ రాకడ’ ...’హార్డ్ వేర్’ సపోర్ట్ లేని ‘సాఫ్ట్ వేర్’ గా మిగిలింది. అందుకే అది... రోహిత్ హాస్టల్ గదిలో ఫ్యానుకు వేళ్లాడినప్పుడు అతని కాళ్ళ క్రింద నేల కాలేకపోయింది.

 

Johnson Choragudi opinion on dr Sudhakar issue in Andhra Pradesh

 

తాను కూడా అటువంటి వొక ‘అంబేడ్కరిస్టు’ కావాలని - 2019 ఎన్నికల నోటిఫికేషన్ రాగానే తన పై అధికారికి ప్రభుత్వ వైద్యుడు డా. కోలవెంటి సుధాకర్ రాజీనామా సమర్పించారు. ‘మీకు పార్టీ టికెట్ వచ్చాక రాజీనామా చేద్దురుగాని దీన్ని మీ వద్ద వుంచండి’ అని దాన్నిజిల్లా అధికారి వెనక్కి తిరిగి ఇవ్వడం వల్ల ఈ రోజున అయన ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నారు. ఆయనకు టికెట్ రాలేదు, కానీ ఆయన కొలీగ్ మరొక ప్రభుత్వ డాక్టర్ కు టికెట్ వచ్చింది. ఆయన వోడిపోయారు. ఉద్యోగం మానేసిన మరొక  జిల్లా అధికారి అక్కడ గెలిచారు. అలా అప్పుడు గండం తప్పడంతో ఈ సారి 2024 ఎన్నికల్లో అదే పార్టీ సీటు కొరకు మళ్ళీ డా. సుధాకర్ కనిపెడుతున్నారు, ఆ దిశలో తనని ప్రోత్సహిస్తున్న నాయకుల్ని ఆయన తరుచు కలుస్తూ వుంటారు అంటున్నారు.

స్థానికంగా ప్రజల మధ్య ఉంటూ పార్టీల కోసం ప్రజల కోసం పనిచేస్తున్న వారికి కాకుండా బరువైన ‘ప్రవాస’ అభ్యర్ధుల్ని ‘రిజర్వుడు’ నియోజకవర్గాల్లో పోటీకి పెట్టడం, ఇప్పుడు అన్ని పార్టీలు చేస్తున్నాయి. వీటికి కూడా పెరిగిన ‘డిమాండ్’ దృష్ట్యా బాగా సంపాదించిన ప్రభుత్వ ‘సర్వీసు’ల్లో ఉన్న అధికారుల కుటుంబాల నుంచి అభ్యర్ధులు ఇక్కడ పోటీకి దిగుతున్నారు. గెలిస్తే, వీరే మంత్రులు కూడా అవుతున్నారు. వీళ్ళు కాకుండా, ‘పాశ్వాన్’ మోడల్ అని కేంద్రంలో మరొకటి ఉంది. గెలిస్తే చాలు, కేంద్రంలో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా మనం మంత్రి కావచ్చు. ఈ మొత్తంలో ఉన్న సమస్య ఏమంటే – గతంలో హెచ్.సి.యూ. రోహిత్ కు ఇప్పుడు విశాఖ డా. సుధాకర్ కు కూడా అర్ధం కాని విషయం ఒకటుంది. అది సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇటువంటి ‘రిజర్వుడు’ నియోజకవర్గాల ‘అంబేడ్కరిస్టు’లు తమకు ఏమీ చేయలేరని గ్రహింపు కొరవడడం. పోనీ అది లేకపోతే పోనీ... ఏదో ఒకరోజు తామే అటువంటి ‘అంబేడ్కరిస్టు’లు కావాలని వీరు కూడా కలలు కనడం ఇప్పుడు నిర్వచనానికి దొరకని అంశం!

 దీని మీద వున్న ‘వెయిల్’ (ముసుగు) ను కాస్త సుతారంగా కాకుండా, నేరుగా పైకెత్తినవాడు ప్రొ. ఆశిష్ నంది. జైపూర్ లిటరరీ ఫెస్టివల్ లో 2013 జనవరిలో ఆయన మాట్లాడుతూ – “బహుశా ఇదేమంత గౌరవప్రదంగా అనిపించకపోవచ్చు, సభ్యత మరిచి చేస్తున్న ప్రకటన అనిపించవచ్చు కానీ ... వాస్తవమేమంటే, అవినీతిపరుల్లో ఎక్కువమంది – ఓబీసీ, ఎస్సీ, ఈ మధ్య కాలంలో వేగంగా ఎస్టీల నుంచి ఉంటున్నారు. అయితే ఈ పరిస్థితి ఇలా కొనసాగినంత కాలం భారత్ రిపబ్లిక్ వ్యవస్థ సుస్థిరంగా ఉంటుంది. పశ్చమ బెంగాల్లో అవినీతి తక్కువ, అయితే గడచిన వందేళ్ళలో బి.సి. ఎస్టి వర్గాల నుంచి అక్కడ అధికార పీఠాల వద్దకు ఒక్కరు కూడా చేరుకోలేక పోయారు. కానీ అది అవినీతి రహిత రాష్ట్రం.” సవర్ణ కులాలు వ్యవస్థీకృతం చేసిన అవినీతిలో నిమ్నకులాలకు వాటా ఇవ్వడం ద్వారా భారత్ రిపబ్లిక్ వ్యవస్థ సుస్థిరంగా ఉంటుంది అంటూ ప్రొ. ఆశిష్ నంది చేసిన ప్రకటన మీద ఇప్పటికీ జరగవలసినంత చర్చ ఇంకా జరగలేదు.   

రెండవ అంశం

‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ అందరికీ అందుబాటులోకి ఉన్నప్పటికీ దాన్ని వినియోగించు కోవడంలో వీళ్ళు ఎదుర్కొంటున్న వెనుకబాటుతనం రెండవ అంశం.

‘మీరు మమ్మల్ని జ్ఞానానికి దూరం చేసారు’ అనేది మొదటి నుంచి వీరి  ప్రధాన అభియోగంగా ఉండింది. పెద్దగా ఎవ్వరూ దృష్టి పెట్టడం లేదుగానీ, ఇప్పటి వివక్ష గతంలో కంటే సంక్లిష్టమైనది. ఆ ఎరుక వీరికి లేకపోవడమే నిజమైన సమస్య. అన్నిటికీ ‘గేట్లు’ మొత్తం వొక్కసారిగా ఎత్తేసి, ఇండియా వంటి మూడవ ప్రపంచ దేశాల్లో కూడా ‘టెక్నాలజీ’ విషయంగా వొక ‘లెవెల్ ప్లే గ్రవుండ్’ను సృష్టించడం నిజమే. అది ఎందుకు జరిగింది అనే ‘విపణి’ విషయం పక్కన పెడితే, దాని వల్ల జరిగిన మేలు వెలకట్టలేనిది. వొక్క ముక్కలో చెప్పాలంటే,  ఆ ‘టెక్నాలజీ’ వల్ల ‘రాజ్యం’ ఇప్పుడు అందరినీ నెంబర్ల తోనూ వేలుముద్రల తోను గుర్తు పడుతున్నది! అలాగని దాంతోనే అంతా అయిపోలేదు, అది వేరే విషయం.

కానీ ఈ మడతల మధ్య మర్మం వొకటుంది. ‘టెక్నాలజీ’ రాక ముందు గతంలో ‘మాన్యువల్ విజడం’ సమపార్జించుకున్న వర్గాలకు ఇప్పుడు వచ్చిన ‘డిజిటల్ టెక్నాలజీ’ అదనంగా మరొక ‘అడ్వాన్సడ్ వెర్షన్ అయింది’. ఎలాగంటే శ్రీ చాగంటి కోటేశ్వరరావు వొక సభలో మట్లాడతారు. ‘టెక్నాలజీ’ ద్వారా అది అందరి చేతులు మారుతూ ఉంటుంది. ఆ గమనం ఉన్నవారు దాన్ని పరిమితంగా వాడుతుంటే, అది లేనివారి విషయంలో అది కోతికి దొరికిన కొబ్బరికాయ అవుతున్నది.

 తను పనిచేసే హాస్పటల్లో ‘మాస్కు’లు కొరత గురించి డా. కె. సుధాకర్ ‘ఎలక్ట్రానిక్ మీడియా’ ముందు... “నా పోన్లో వీడియో కూడా తీసాను సార్” అంటున్నాడు! తను ప్రభుత్వ డాక్టర్ అని, తను పని చేస్తున్న చోట ఏవైనా శాఖాపరమైన లోపాలు (ఒకవేళ) ఉంటే వాటిని తాను అలా ‘వీడియో’ తీయడం ప్రభుత్వ ప్రయోజనాలకు వ్యతిరేకం అనే ఎరుక అతనికి కొరవడింది! టెక్నాలజీ ప్రయోజనాల కోణం పక్కన పెట్టి వొక విమర్శగా కనుక దీన్ని చూస్తే, మరోసారి వీళ్ళను - ‘జ్ఞానానికి దూరం చేయడం పార్టు 2’ అని కూడా అనొచ్చు! కానీ అది నిజం కాదు. కొద్దిపాటి విచక్షణతో ఈ వివక్షను మనం అధిగమించవచ్చు.

 

Johnson Choragudi opinion on dr Sudhakar issue in Andhra Pradesh

 

ఎల్.టి.ఎల్. (లార్జర్ ద్యాన్ లైఫ్) అను పదబంధాన్ని ఇక్కడ మన చర్చ కోసం - ‘ఉన్నదాన్ని ఎక్కువగా చూపించుకోవడం’ అనుకుందాం, మనకు శషబిషలు ఎందుకు నేరుగానే మాట్లాడుకుందాం. ప్రభుత్వాల్లో జీతం తీసుకుని పని చేస్తున్నప్పుడు ఎవరైనా మళ్ళీ నీ గురించి నీ పని గురించి ప్రత్యేకం నువ్వు చెప్పుకోవడం అక్కర్లేదు. మనం చేస్తున్న పని కూడా మన శాఖకు ప్రభుత్వం నిర్దేశించిన విస్త్రుత లక్ష్యంలో భాగమై ఉంటుంది. ఇటువంటి సోయ లేకుండా, కొందరు ఉన్నత స్థాయి పోస్టుల్లో వున్నవాళ్ళు కూడా ‘సంస్కరణల’ కాలంలో అచ్చంగా ‘ప్రచారం’ మీద బ్రతికేసారు.

 అయినా ‘నేను’ ‘నా’ అనే ఆసక్తి మనల్ని నియంత్రిస్తున్నపుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎక్కువసార్లు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే వొక ఎత్తుకు వెళ్ళాక అ ‘జోష్’ వేరు. గాలిపటం క్రింద తన కదలికలను అనుమతిస్తున్న దారం ఆసామి విషయం మర్చిపోతుంది, ఫలితం తెలిసిందే. ఈ మొత్తం ‘ఎపిసోడ్’ లో ఆత్రుత ప్రధాన సమస్య. ప్రధాన స్రవంతి సమూహల్లో కనిపించే ‘హారిజాంటల్’ దృష్టి వీరి కంటికి అట్టే ఆనదు. అలాగని ‘వెర్టికల్’ ను తమాయించుకునే రిస్క్ ను వీళ్ళు అస్సలు తట్టుకోలేరు.

 

Johnson Choragudi opinion on dr Sudhakar issue in Andhra Pradesh    

‘మీడియా’ కు 24X7 ఎప్పుడూ ఏదో ఒక విషయం  అవసరం. అందుకోసం దాని ‘కెమెరా’ ఎప్పుడైనా ఎవరి వైపు అయినా చూస్తుంది. దాన్ని చాకచక్యంగా తప్పించుకుని తిరగడానికే ఇప్పుడు జ్ఞానం అవసరం. అన్నాహజారే 2013 ప్రాంతంలో డిల్లీలో దీక్షలు చేస్తుంటే, ఆయనకు సంఘీభావంగా మాజీ ఐ.పి.ఎస్. అధికారి కిరణ్ బేడి వేదికపై ఆయనకు దగ్గరలో పక్కనే ఉండేవారు. దీన్ని ‘విజువల్ కమ్యునికేషన్స్’ దృష్టికోణంలో చూసినప్పుడు - ఆమె అన్నా హాజరేకి చెవిలో ఏదో చెబుతున్నప్పుడు చానళ్ళ కెమెరాలు పని చేసేవా, లేక అవి పనిచేస్తున్నప్పుడు ఆమె ఆయన చెవిలో చెప్పేదా వంటి ‘ పి.ఆర్. గ్రామర్’ మనకు ఎప్పటికీ అర్ధమయ్యే అవకాశం లేదు!

మరి ఇందులో ‘హైప్’ లేదా అంటే ఉంది. కానీ పక్కనున్నది వొక సాదాసీదా ‘ఖాదీ కార్యకర్త’ కనుక అది వేదిక మీదే ‘బ్యాలెన్స్’ అయిపోతుంది. పైగా ఇటువంటివి దృశ్య మాధ్యమాల భాషలో ‘స్లైస్ -ఆఫ్- లైఫ్’ దృశ్యాలు. మరో పదేళ్ళు తర్వాత న్యూస్ చానళ్లలో మనం అన్నాహజారే వీడియో విజువల్స్ చూడవలసి వచ్చినా, అందులో మనకు అవే  ‘రిపీట్’ అవుతాయి. చట్రం ఇలా ఉన్నప్పుడు, దానికి బయట ఉండి కొందరు ఊరికే తమ సీనియార్టీ గురించి తామే చెప్పుకుంటూ - ‘నన్ను గవర్నర్ చేస్తాను అని మాట ఇచ్చావుగా బాబు...’ అంటే ఏమిటి ప్రయోజనం? ‘తెహల్కా’ వీడియోలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ప్రత్యేకం కొందరు ‘మీడియా’ తో ఎంత సున్నితంగా ఉండాలో మర్చిపోవడం కష్టం. ఈ మధ్య కొందరు మన ‘మీడియా’ వ్యవస్థను మనమే పెట్టుకోవాలి అంటున్నారు. మంచిదే, కానీ అక్కడ కూడా చంద్రబాబు నిర్మించిన ‘పవిత్రసంగమం’ వద్ద వొకే ప్రవాహంలో కృష్ణా - గోదావరి నీళ్ళలా వేర్వేరుగా ఉంటే ఏమిటి ప్రయోజనం?

భారతీయత ‘ఇమ్యునిటీ’ చట్రాల్ని చేదించుకుని మరీ దాని లోపలికి ప్రవేశించాలని గడచిన వందేళ్ళలో అంటోనీ గ్రాంసీ కంటే ముందు ప్రయత్నిచినవారు ఉన్నారు. కానీ వారు భారతీయ వంటింటి ‘మెయిన్ డిష్’ మీద అలంకరణ కోసం చేసే ‘గార్నిష్’ గా మిగిలారు తప్ప, ప్రత్యామ్నాయం మాత్రం కాలేకపోయారు. ఏదో ఒక కాల హద్దు వద్ద నిలబడి ఎప్పుడో వొకప్పుడు మాట్లాడక తప్పని విషయమిది. ఇప్పుడు కూడా ఇది ‘ప్రిమెచ్యూర్’ అని కనుక ఎవరకైనా అనిపిస్తే, అందుకు కారణం – ‘కోవిడ్-19’.

ప్రేరణ మాత్రం నర్సీపట్నం డాక్టర్ కోలవెంటి సుధాకర్.

గమనిక: ఈ వ్యాసరచయిత వ్యక్తం చేసిన అబిప్రాయాలతో ఏషియానెట్ న్యూస్ కు ఏ విధమైన సంబంధం లేదు. అభిప్రాయాలన్నీ రచయితకే చెందుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios