అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని రాజకీయం ముదిరి పాకాన పడింది. నిన్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో వైసీపీకి ఎదురు లేకపోవడంతో సునాయాసంగా అక్కడ పాస్ అయిపోయింది. బిల్లు చట్టంగా మారాలంటే మండలిలో కూడా అది పాస్ కావలిసి ఉంటుంది. 

ఇక్కడే జగన్ కి చిక్కువచ్చి పడింది. మండలిలో జగన్ కి బలం లేదు. మండలిలో జగన్ కి రెండంకెల మంది సభ్యులు కూడా లేరు. మండలిపైన పూర్థిస్థాయిపట్టు అంతా వైసీపీదే. ఏ స్థాయిలో అంటే.. మండలి చైర్మన్ ఇప్పటికి టీడీపీ నుంచి ఎన్నికైన సభ్యుడే కొనసాగుతుండడం దీనికి నిదర్శనం. 

మండలిలో ఈ రోజు టీడీపీ రూల్ 71 కింద బిల్లును అసలు చర్చకే రానివ్వకుండా అడ్డుతగిలింది. అలా ఒక్కసారిగా టీడీపీ రూల్ 71 ను తీసుకురావడంతో వైసీపీ ఇంకో సత్వర ఆలోచనకు పూనుకొని ఆర్డినెన్సు రూపంలోనయినా దీనికి చట్టబద్దత కల్పించాలని వైసీపీ భావిస్తోంది. 

Also read: వైఎస్ జగన్ మొండిఘటం: పవన్ కల్యాణ్ ధీటు రాగలరా?

ఆర్డినెన్సు రూపంలో ప్రవేశపెట్టినప్పటికీ 6 నెలల్లోపు దానికి అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి. మరోపక్క చూసుకుంటేనేమో కనీసం ఇంకో రెండు సంవత్సరాలవరకైనా వైసీపీకి మండలిలో మెజార్టీలు వచ్చే ఛాన్స్ లేదు. 

దీనితో ఆర్డినెన్సును జారీచేసి, ఆ తరువాత మండలిని రద్దుచేయాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరొపక్కనేమో టీడీపీవారు మండలిని రద్దు చేయడం అంత తేలికైన పని కాదు అంటున్నారు. 

ఈ అన్ని చర్చల నేపథ్యంలో అసలు మండలిని రద్దు చేయాలంటే ఎటువంటి పద్ధతిని అనుసరించాలి, రాష్ట్రప్రభుత్వానికి ఆ అధికారం ఉందా లేదా అనేది తెలుసుకుందాం. 

శాసనమండలి ఏర్పాటు చేయాలన్న, తొలగించాలన్న అది భారత పార్లమెంటు చేతుల్లో ఉంటుంది. అలా అని కేంద్రప్రభుత్వం తన ఇష్టానుసారంగా అలా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేయాలంటే.. ఆ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక మెజారిటీతో అందుకు సంబంధించిన ఒక తీర్మానం చేసి పంపవలిసి ఉంటుంది. 

ఆ తరువాత అందుకు సంబంధించిన ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపవలిసి ఉంటుంది. ఇలా 2/3వ వంతు మెజారిటీతో పాస్ అయిన బిల్లును కేంద్రం ఆర్టికల్ 169 కింద పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. 

Also read: బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు : చంద్రబాబును వెనక్కి నెట్టి తాను ముందుకు వచ్చేందుకే...

ఆ తరువాత ఆ బిల్లు చట్టం అవడానికి రాష్ట్రపతి ఆమోదానికి పంపవలిసి ఉంటుంది. అలా రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డ తరువాత గెజిట్ లో ప్రచురితమవుతుంది. రాజ్యాంగంలో కూడా ఇందుకు సంబంధించిన మార్పులు చేయవలిసి ఉంటుంది. (రాజ్యాంగాన్ని మార్చినప్పటికీ...దీన్ని రాజ్యాంగ సవరణ బిల్లుగా పరిగణించరు) 

ఇలా ఒక రకంగా కేంద్రప్రభుత్వం కావాలనుకున్నట్టు బిల్లును వేగంగా పాస్ చేయొచ్చు లేదా...అలా పెండింగులో కూడా పెట్టొచ్చు. ఇక్కడ అందరికి ఒక అనుమానమా రావొచ్చు, రాజశేఖర్ రెడ్డి 2004లో అంత సునాయాసంగా ఎలా ఏర్పాటు చేయగలిగారని అనిపించొచ్చు. అప్పుడు అక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. 

కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండడంతోపాటు రాజశేఖర్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్య సంబంధాల వల్ల అది సాధ్యపడింది. అలా అయితే, అస్సాం, రాజస్థాన్ రాష్ట్రాల డిమాండులు ఇంకా పార్లమెంటులో పెండింగులోనే ఉన్నాయి. 

ఈ అన్ని పరిస్థితులను గనుక పరిగణలోకి తీసుకుంటే... శాసనమండలిని రద్దు చేయడం అంత తేలికైన పని కాదనే విషయం మాత్రం అర్థమవుతుంది.