Asianet News TeluguAsianet News Telugu

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

కేసీఆర్ ఇమేజ్ ఫేడ్ అవుట్ కాలేదని చెప్పాలంటే హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం టీఆర్ఎస్ కు అవసరం. తామింకా ప్రతిపక్షమే అని నిరూపించుకోవాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అది సవాలే.

Huzurnagar bypoll: Victory is essential for Telangana CM KCR
Author
Huzur Nagar, First Published Sep 23, 2019, 5:05 PM IST

ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ సీట్ గెలిచినప్పటినుంచి మొదలైన ఒక చర్చ హుజూర్ నగర్ పరిస్థితేంటి? ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా వెలువడడంతో అన్ని రాజకీయ పార్టీలూ ఈ విషయంపై తమ దృష్టిని కేంద్రీకరించాయి. తెరాస అందరికంటే ముందుగా తమ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డిని ప్రకింటించేసిందికూడా. 

కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా పద్మావతి వైపే మొగ్గు చూపే ఆస్కారం ఉంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలి ఒకరిపై ఒకరు మాటల యుద్ధమే చేసుకుంటున్నారు. ఉత్తమ్ ఏకపక్షంగా ఎలా అభ్యర్థిని ప్రకటిస్తారని రేవంత్ రెడ్డి ఆ విషయమై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాడు. ఏకంగా తాను కూడా ఒక అభ్యర్థి పేరును ప్రకటించాడు. 

ఈ విషయాలు జరుగుతుండగానే నల్గొండ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ ని సపోర్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి పద్దతిని తప్పుబట్టారు. మొత్తానికి ఈ విషయమై పెద్ద రచ్చ మాత్రం కాంగ్రెస్ పార్టీలో నడిచింది. మరోమారు నాయకత్వ లేమి ప్రస్ఫుటంగా కనిపించింది.

బీజేపీ కూడా తెలంగాణపై పట్టుసాధించాలన్న దృఢ సంకల్పంతో ముందుకెళుతోంది. ఈ విషయమై బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా కర్ణాటక తరువాత దక్షిణ భారతదేశానికి గేట్ వే గా తెలంగాణను పరిగణిస్తుంది. 

సో, మొత్తంగా అర్థమయ్యేదేంటంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి అన్న విషయం. ఎందుకు ఇలా అన్ని పార్టీలు ఇంత తీవ్రంగా ఒక ఉప ఎన్నిక కోసం శ్రమిస్తున్నాయి? ఏ పార్టీకి  ఎలాంటి లాభనష్టాలున్నాయో తెలుసుకుందాం. 

మొదటగా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కి ఇది సిట్టింగ్ సీట్. గత పర్యాయం పూర్తి కెసిఆర్ హవాలోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. సిట్టింగ్ సీట్ కాబట్టి నిలబెట్టుకోవాలనుకుంటున్నారు అనేది సెకండరీ. దానికన్నా ముఖ్యంగా మరో రెండు విషయాలున్నాయి. 

మొదటిది రాష్ట్రంలో కాంగ్రెస్ బాస్ ఎవరు? రేవంత్ రెడ్డి మొన్నామధ్య ఢిల్లీ వెళ్లి తన ఫ్యామిలీతో సోనియా గాంధీ పక్కన నిలబడి ఫోటో దిగడంతో, రాష్ట్ర పీసీసీ పదవిని ఆయనకు కట్టబెడతారని వార్తలు కూడా వినిపించాయి. ఈ హుజూర్ నగర్ అభ్యర్థి ఎంపిక విషయంలో సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఏకమవ్వడం చూస్తుంటే, ఎలాగైనా ఈ సీటును నిలబెట్టుకొని రేవంత్ ఆశలకు గండి కొట్టాలని వారు భావిస్తున్నారు. 

రెండో విషయం పార్టీలో నూతన ఊపు తీసుకురావడం. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ కనీసం తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేకపోయింది. సబితా ఇంద్ర రెడ్డి తో సహా ఎందరో సీనియర్లు వెళ్లి తెరాస లో చేరారు. ఓడిన డీకే అరుణ లాంటివారు బీజేపీలో చేరిపోయారు. నాయకులు ఇలా వెళ్లిపోతుండడంతో, కార్యకర్తల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ సీటును గెలిచి కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపాలని కాంగ్రెస్ నాయకులు యోచిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం అని నిరూపించుకోవాలంటే ఈ సీటును వారు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఇక తెరాస పార్టీ. ప్రస్తుతానికి తెలంగాణాలో అధికారంలో ఉన్న పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న 17 సీట్లలో తాము 16, మిత్రపక్షం ఎంఐఎం 1 గెలిచి రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేయాలనీ భావించారు. ఇందుకోసం ఏకంగా 'సారూ కారు 16 ఢిల్లీ సర్కారు' అనే నినాదాన్ని కూడా ముందుకు తెచ్చారు. కాకపోతే వారి ఊహలను పటాపంచలు చేస్తూ బీజేపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచి షాకిచ్చాయి. 

ఈ నేపథ్యంలో తెలంగాణపై తెరాస పట్టుకోల్పోయిందని ప్రతిపక్షాలు భారీ ప్రచారాన్ని ప్రారంభించాయి. మొన్నటి గ్రామపంచాయతీ ఎన్నికల్లో తెరాస తన హవా ఏ మాత్రము తగ్గలేదని నిరూపించింది. కాకపోతే ఈ గ్రామపంచాయితీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహజంగానే వాటిని కైవసం చేసుకుంటుంది. 

ఇలా గనుక చూసుకుంటే పార్లమెంటు ఎన్నికల తరువాత తెరాస ఎదుర్కోబోతున్న పెద్ద సవాలు ఇదే అవుతుంది. తెలంగాణాలో ఇంకా కెసిఆర్ ఇమేజ్ ఫేడ్ అవుట్ అవ్వలేదు అనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా పంపాలంటే,ఈ ఎన్నికలో గెలవడం అవసరం. 

అంతేకాకుండా ఈ మధ్య వినిపిస్తున్న అసమ్మతి రాగాలను అణచాలన్నా కూడా ఈ విజయం అత్యవసరం. ఒక వేళా తెరాస ఈ ఎన్నికలో గనుక ఓటమి చెందితే, మరిన్ని అసమ్మతి గానాలు బయల్దేరుతాయి. బీజేపీ తెరాస నేతలకు గాలం వేసేందుకు పొంచి ఉన్న నేపథ్యంలో మరింతమంది అసమ్మతి గానలందుకోవడం తెరాస కు శుభసూచకం కాదు. 

పార్లమెంటు ఎన్నికలు ముగిసేవరకు బీజేపీ తెలంగాణాలో అంతపెద్ద శక్తి కాదు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 4 సీట్లు గెలవడంతో వారు నయా జోష్ కనబరుస్తున్నారు. దక్షిణాదిలో కర్ణాటక మినహా వేరే ఏ రాష్ట్రాల్లోనూ బీజేపీకి అంత పట్టు లేదు. కేరళలో అయ్యప్ప స్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశం  వివాదంలో తాము చేసిన పోరాటం కలిసివచ్చి ఒక రెండు సీట్లన్నా గెలవొచ్చు అని భావించారు. కానీ ఆ ప్లాన్ వర్క్ అవుట్ అవలేదు. 

పెద్దగా ఆశలు లేని తెలంగాణ నుంచి ఏకంగా 4 స్థానాలు కైవసం చేసుకొంది. కెసిఆర్ తోని మజ్లీస్ కు ఉన్న మైత్రిని ఆసరాగా చేసుకొని ఇక్కడ రాజకీయం నడిపించొచ్చని బీజేపీ ప్లాన్స్ వేస్తోంది. 

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపైన ప్రత్యేక దృష్టి సారించింది. కిషన్ రెడ్డి కి మంత్రి పదవిని కేటాయించడం నుంచి మొదలుకొని అమిత్ షా నెలవారీ పర్యటనల వరకు ప్రతి విషయం మనకు బీజేపీ తెలంగాణాలో జెండా పాతడానికి ఎంతలా కృషి చేస్తుందో నిరూపిస్తున్నాయి. తామే తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేషంగా ప్రయత్నిస్తున్నారు.  

మొన్నటి గ్రామపంచాయితీ ఎన్నికల్లో బీజేపీ కన్నా కాంగ్రెస్ బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. పార్లమెంటు ఎన్నికల్లో 4 సీట్లను గెలిచి రెండో స్థానంలో నిలిచినప్పటికీ, కాంగ్రెస్ పదే పదే చెప్పేమాటేమిటంటే పార్లమెంటు ఎన్నికల్లో మేము ఇంకో రెండు సీట్లను తృటిలో ఓడిపోయాము కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఏదో బీజేపీ ఎదిగినట్టు భ్రమపడొద్దని చెబుతున్నారు. 

సో, తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం అనిపించుకోవాలన్నా, కెసిఆర్ కు ప్రత్యామ్నాయం అనిపించుకోవాలన్నా ఈ ఉప ఎన్నిక విజయం వారికి కూడా అత్యవసరం. ఇలా గనుక ప్రత్యామ్నాయం అనుపించుకోగలిగితేనే తెరాస అసమ్మతి నేతలను తమవైపు లాక్కోవడం తేలికవుతుంది. 

పూర్తి కథ ద్వారా తెలియవచ్చేదేంటంటే, ఏ ఒక్క పార్టీకో కాదు అన్ని పార్టీలకూ ఈ ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారింది. 

హుజూర్ నగర్....ఈ సీట్ చాల హాట్ గురూ!

సంబంధిత వార్తలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 

Follow Us:
Download App:
  • android
  • ios