అమరావతి...ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించకముందు, సాధారణ ప్రజానీకానికి అమరావతి అంటే గుర్తొచ్చేది రెండే రెండు. మొదటిది గుంటూరు జిల్లాలోని శైవారామం, బౌద్ధుల ఆధ్యాత్మికతకు చిహ్నంగా, శాతవాహనుల రాజధానిగా వెలుగొందిన అమరావతి. 

ఇంకా కొద్దిగ పురాణాలు, ఇతిహాసాల మీద పట్టున్నవారికి గుర్తొచ్చే మరో నగరం ఇంద్రుడి రాజధాని. స్వర్గలోకపు రాజైన ఇంద్రుడి నగరమే ఈ అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అమరావతి రాజధాని అని ప్రకటించగానే.. ఆ ఇంద్రలోకాన్ని మరోసారి భూమి మీద చూడబోతున్నామంటూ కొన్ని అప్పటి ప్రభుత్వ అనుకూల మీడియాలు రాశాయి కూడా. 

మొత్తానికి ఒక గ్రీన్ ఫీల్డ్ నగరంగా, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని మాత్రం మొదలుపెట్టారు. దేశంలోనే తొలిసారిగా ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ తో భూమిని సేకరించి నగర నిర్మాణం పూర్తయిన తరువాత అందులో భూములిచ్చిన ప్రజలను భాగస్వాములను చేసే ఉద్దేశంతో దాన్ని ప్రారంభించారు. 

అత్యంత సారవంతమైన జరీబును ఇలా తీసుకోవడం మంచిది కాదని అప్పట్లో రైతులతోసహా చాలా మంది పర్యావరణవేత్తలు చెప్పారు కూడా. అయినా సరే అప్పటి ప్రభుత్వం భూములను సేకరించింది నిర్మాణం ప్రారంభించింది. 

Also read: ఏపీ అసెంబ్లీ: నలుగురు నేతలు... నాలుగు ప్రాంతాలు, జగన్ సబ్ నేషనలిజం వ్యూహం ఇదీ...

అలా ఒక మహా నగర నిర్మాణం ప్రారంభించినప్పుడు స్వాతంత్రం తరువాత ఇలా పూర్తిగా నూతనంగా నిర్మితమవుతున్న రెండవ గ్రీన్ ఫీల్డ్ నగరంగా, ప్లాన్డ్ సిటీ గా అమరావతి రూపుదిద్దుకోబోతుందంటూ అంతా కీర్తించారు. అప్పటి ప్రతిపక్ష వైసీపీ ఇక్కడ ఈ నగరంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేసింది. 

అమరావతి నగర నిర్మాణం వల్ల ఒక నూతన రాష్ట్రంలో, అందునా తూర్పు తీరా ప్రాంతంలో ఒక మహానగర నిర్మాణం వల్ల తూర్పు తీరప్రాంతానికే తలమానికంగా తయారవుతుందని, మచిలీపట్నం, నిజాంపట్నం వంటి ఓడరేవుల అభివృద్ధి జరిగి ఈ ప్రాంతం ఒక కార్గో హబ్ గా కూడా అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశించారు. 

Also read; అమరావతికి వైఎస్ జగన్ టోకరా: అసలు వాస్తవం ఇదీ...

కానీ 5 యేండ్లు పూర్తయ్యేసరకు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకదానితర్వాత ఒకటి అంతర్జాతీయ సంస్థలైన వరల్డ్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంకు అమరావతి నిర్మాణం నుండి వెనక్కి వెళ్లిపోయాయి. బడ్జెట్ లో కేటాయింపులు నామమాత్రంగా చేసారు. ఇక అక్కడి నుండి మొదలు అమరావతిపై నీలినీడలు ఎక్కువయ్యాయి. 

ఇప్పుడు అమరావతి పరిస్థితిపై అందరికి ఒక క్లారిటీ వచ్చింది. విశాఖపట్నం ఇప్పుడు ప్రధాన నగరంగా అభివృద్ధవుతుందనేది తేటతెల్లం. అమరావతి ఒక నామమాత్రపు అసెంబ్లీ భవనం ఉంటుంది. ప్రస్తుతం కొంత కాలం అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరిగినా కొంత కాలం తరువాత ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న గ్యారంటీ లేదు. 

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం సచివాలయ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా విశాఖ నుండి అమరావతికి తరలిరావలిసిఉంటుంది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఈ ఆర్థికభారం వల్ల అన్ని కార్యకలాపాలు విశాఖపట్నంలోని కేంద్రీకృతమయినా ఆశ్చర్యపోనక్కరలేదు. 

సరే ఈ విషయాలను అటుపక్కకుంచితే... అమరావతి అనే ఒక ప్రయోగం విఫలమైన తరువాత ఇటు రాజకీయ పార్టీలకు అటు సామ్య ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఒక అద్భుతమైన మెసేజ్ ను మాత్రం ఇస్తున్నాయి. 

మొదటగా రాజకీయపార్టీలకు. అబ్దుల్ కలాం చెప్పాడు కదా అని పెద్ద పెద్ద కళలను మాత్రం కనకండి. ఆ కళలను భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తప్పు. భారత్ లాంటి థర్డ్ వరల్డ్ దేశాల్లో ఇలాంటి కళలను కనడం తప్పు. కంటే దాని పర్యవసానమెంతో వేరే చెప్పనవసరం లేదు. 

భారత్ వంటి దేశాల్లో రాజకీయపార్టీలు స్వతంత్రం వచ్చి 75 వసంతాలు కావొస్తున్నా ప్రజలకు ఇంకా ఉచితంగా ఏమేమి ఇస్తున్నావనే దానిపైన దృష్టి కేంద్రీకరిస్తే సరిపోతుంది. అప్పట్లో 1960వ దశకంలో ఇందిరాగాంధీ ఇచ్చినట్టు రోటి, కపడా, మకాన్ అన్నట్టుగా ఉచితంగా బియ్యం, బట్టలు, ఇల్లు ఇస్తే నేటికీ ఎన్నికలను అత్యంత ఈజీగా గెలవొచ్చు అనేది తథ్యంగా కనబడుతుంది. 

ప్రజలకు ఇప్పుడు వాటికి తోడు మరికొన్ని ఉచితంగా ఇస్తే సరిపోయే విధంగా కనబడుతుంది. ఏది ఏమైనా సంక్షేమపథకాలను నమ్ముకున్న ప్రభుత్వాలు ఓటమి చూసినట్టు చరిత్రలో లేదు. ఆర్ధిక ప్రగతి ఎలా ఉంది, కొత్త పెట్టుబడులు వస్తున్నాయా రావట్లేదా.. ఇవేమి ప్రజలకు అనవసరం. సంక్షేమ పథకాలు ఎంతమేర ఉన్నాయి. కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా గెలుపోటములను నిర్దేశించేది అవే!  

Also read: అమరావతిపై వివాదం: జగన్ కు ముందు నుయ్యి, వెనక గొయ్యి

రెండవ మెసేజ్ రైతులకు. పండించిన పంటకే గిట్టుబాటు ధర దక్కించుకోవడంలో విఫలమయి, రోడ్డెక్కే అన్నదాతలు ప్రభుత్వం తో వ్యాపార లావాదేవీలు చెయ్యొద్దు. కార్లు కూడా మీరు కొనుక్కోకూడదు, రైతు అంటే ఎప్పటికి పేదవాడుగానే మిగిలిపోవాల్సిందే... అలానే రైతులు బ్రతకాలి అని మనసులో బ్లైండ్ గా ఫిక్స్ అయినా సమాజంలో ఎంత ధైర్యం ఉంటె రైతులు బేరాలాడుతారు?

భూమిని నమ్ముకొని, దానిమీద ఆధారపడి జీవనం సాగిస్తూ, ఏదో తమ తరం తో పాటు తమ భవిష్యత్ తరాల జీవితం బాగుంటుంది, తమ పిల్లలను మంచి చదువులు చదివించుకోవొచ్చు అని కళలు కనేంత ధైర్యం ఈ రైతులకు ఎక్కడి నుండి వచ్చింది? రైతులు అంతటి భారీ కళలు కంటారా? కనే హక్కు ఉందా? 

రైతులు రోడ్డెక్కితే కేవలం రైతు సమస్యలకోసం తప్ప వేరే వాటికి ఎక్కరు. అలా ఎక్కకూడదు అని నమ్మే సమాజం. పోనీ వేరే విషయాలపైన రైతులు రోడ్డెక్కకూడదా? ఎక్కితే ఏమవుతుంది?

కడుపు మండి, ఆవేదన ఎక్కువయి, జీవితం బుగ్గిపాలవుతుందని, కళ్ళముందే తమ జీవనాధారాన్ని కోల్పోతున్నామని బాధపడే హక్కు రైతులకు లేదు. ఉండకూడదు. అలా చేస్తే సమాజం వారికి ఒక ముద్దు పేరు కూడా పెడుతుంది- "పెయిడ్ ఆర్టిస్టులు"