కరోనా కరాళ నృత్యానికి ప్రపంచం వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ వైరస్ విలయతాండవానికి భారతదేశం కూడా భారీ మూల్యం చెల్లించుకోకముందే... ముందు జాగ్రత్తగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని మోడీ. 

తొలుత జనతా కర్ఫ్యూ అని ప్రజలను సిద్ధం చేసిన ప్రధాని ఒకేసారి మూడు వారాలపాటు లాక్ డౌన్ ని ప్రకటించారు. ఇలా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చైన్ ని బ్రేక్ చేస్తే వైరస్ ఇక వ్యాపించకుండా చేయొచ్చనేది ప్రభుత్వ ఆలోచన. 

ఇలా లాక్ డౌన్ ప్రకటించారు బాగానే ఉంది. ప్రజలంతా ఇండ్లలోనే ఉంటున్నారు. కరోనా వ్యాప్తి చెందడం చాలా వరకు నిలపగలిగాము. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద సవాల్ ఉంది. జనాలను అయితే లాక్ డౌన్ చేసాము కానీ టెస్టింగ్ ఇంకా పూర్తిస్థాయిలో జరగడం లేదు. మనం ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారు, వారి తో టచ్ లో ఉన్నవారు వారికే టెస్టులు చేస్తున్నాము. అది సరైన పద్దతే. 

Also read:ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా పాజటివ్

కానీ ప్రతి చోటా పూర్తి సమాచారాన్ని సేకరించేంత కీలకమైన అధికార యంత్రంగం ఉండకపోవచ్చు. ఉదాహరణకు తెలంగాణను తీసుకోండి. తెలంగాణ ఇప్పటివరకు 24 వేల మంది విదేశాల నుంచి వచ్చారని గుర్తించింది. వారితోపాటుగా వారిపక్కనున్నవాళ్లను అందరిని క్వారంటైన్ లో ఉండమని ఆదేశాలు జారీ చేసింది. 

అంతే కాకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ ని సంపాదించగలిగారు. ప్రజలను ఎక్కడికక్కడ కట్టడి చేయగలుగుతున్నారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని పూర్తిగా మూసి ఉంచగలుగుతున్నారు. దక్షిణాదిలో ఇది సాధ్యపడుతుంది. 

మిగిలిన రాష్ట్రాల్లో ఈ స్థాయిలో అక్కడ వ్యవస్థ ఉందా అనేది మొదటి ప్రశ్న. ఆసుపత్రులు, డాక్టర్లు మొదలయినవి దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ. కానీ ఉత్తరాదిలో ఆ సదుపాయాలు చాలా తక్కువ. 

ఈ పరిస్థితుల్లో మన దేశం కరోనా కిట్లతో ఇంకా చాలా ఎక్కువగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. దక్షిణ కొరియా ఉదాహరణ మనకు ఇదే నేర్పుతుంది. 

సౌత్ కొరియా ఏం చేసింది...?

దక్షిణ కొరియా ఇలా వైరస్ విలయతాండవం చేస్తుందనగానే... దేశంలోకి అన్ని దారులను బంద్ చేసి ప్రజలందరినీ టెస్ట్ చేయడం ఆరంభించింది. విరివిగా టెస్ట్ చేయడం వల్ల అనుమానితులను, లక్షణాలున్నవారిని బయటకు తీసి వారిని మిగిలిన వారి నుండి సెపెరేట్ చేసింది. 

Also Read:కరోనా వైరస్ పై అమెరికా శాస్త్ర వేత్త షాకింగ్ కామెంట్స్

ఇలా చేయడం వల్ల కరోనా ను కంట్రోల్ చేయగలిగింది దక్షిణ కొరియా ప్రభుత్వం. వారు వాస్తవిక స్థితిని ఒప్పుకొని టెస్టింగులకు పూనుకొని, అనుమానితుల వెంటబడి వారిని ఐసొలేషన్ వార్డులకు తరలించారు. 

విరివిగా ఇలా టెస్టింగులు చేయడం వల్ల కరోనా లక్షణాలున్న వారందరిని త్వరగా గుర్తుపట్టి ఐసొలేషన్ కి తరలించే ఆస్కారం ఉంటుంది. అలా ఐసొలేషన్ వార్డులకు తరలించి గనుక ఉంచితే.... అది ఎవ్వరికి స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉండదు. 

అలా చేసినప్పుడు మాత్రమే... కరోనా వైరస్ బయట నుండి   రావటం ఆగిపోయినప్పటికీ.... లోపల స్ప్రెడ్ అవడం ఆగిపోతుంది. ఇలా చేయగలిగినప్పుడు మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలుగుతాము. 

లేదంటే వైరస్ దావానలంలా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అదే గనుక జరిగితే... దాన్ని తట్టుకునే స్థితిలో భారతదేశం లేదు. అలా గనుక తట్టుకొని నిలబడకపోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. 

ఈ లాక్ డౌన్ ఉండగానే సాధ్యమైనంత మందిని టెస్ట్ చేసి, అవసరమనుకుంటే స్వచ్చంధసంస్థల, ఎన్జీఓల సహాయ సహకారాలను తీసుకొని ప్రభుత్వం ఆ దిశగా ముందుకు పోవాలి. అలా గనుక చేయగలిగితే.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్టు 18 రోజుల్లోనే మహాభారత యుద్ధాన్ని గెలిచాము 21 రోజుల్లో కొరోనాను గెలవలేమా అన్నారు. 

ఇలా గనుక చేసినప్పుడే అది సాధ్యపడుతుంది. లేకుంటే...కొన్ని వర్గాల వారు వాదిస్తున్నట్టు కేసులు గనుక ఎక్కువగా నమోదయితుంటే మాత్రం లాక్ డౌన్ మరిన్ని రోజులు కొనసాగే ఆస్కారం కూడా లేకపోలేదు.