Asianet News TeluguAsianet News Telugu

జగన్ పై వివాదం: ‘జ్యోతి’ వెలిగించడం బైబిల్ విశ్వాసానికి విరుద్ధమా?

వై.ఎస్. జగన్ మోహనరెడ్డి అమెరికా పర్యటనలో ఒక ఆడిటోరియంలో జరిగిన సభలో జ్యోతి వెలిగించడం లేదా వెలిగించకపోవడం మన వద్ద వార్త అయింది, అది చర్చ కూడా అయింది.

Controversy on YS Jagan not lighting the lamp: Explained
Author
Amaravathi, First Published Aug 25, 2019, 9:32 AM IST

రచయిత: జాన్ సన్ చోరగుడి 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహనరెడ్డి అమెరికా పర్యటనలో ఒక ఆడిటోరియంలో జరిగిన సభలో జ్యోతి వెలిగించడం లేదా వెలిగించకపోవడం మన వద్ద వార్త అయింది, అది చర్చ కూడా అయింది. భారతీయ క్రైస్తవ కుటుంబం అయిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుటుంబం వారు విశ్వాసం ఉంచే వాక్యం అయిన ‘బైబిల్’ గ్రంధం అస్సలు జ్యోతి గురించి ఏమి చెబుతున్నది అనేది చూడ్డం సందర్భోచితంగా వుంటుంది.   

అయితే, ఇందుకు మనం చూడడానికి ఎంతమాత్రం ఇష్టపడని ఒక దృశ్యాన్ని మీకు చూపించవలసి వచ్చింది. మనకది, మన భారత దేశంలోనే కనిపిస్తుంది. అలాగని అది తరుచు మనం చూసేది కూడా కాదు ఎక్కడో అరుదుగా, నిజానికి అది ఈ రోజుల్లో ఇక్కడ కూడా చాలావరకు కనుమరుగు అయింది. అయితే దాని ఆదిమూలం మనకు బైబిల్ ఆదికాండం 15 వ అధ్యాయంలో కనిపిస్తుంది. 
బైబిల్ మరియు క్రైస్తవ్యం మన దేశానికి ఆంగ్లేయుల ద్వారా వచ్చింది అనేది ఎక్కువమందికి ఉన్న అభిప్రాయం. అయితే పైన మనం చూడబోతున్న దృశ్యం గురించి గాని లేదా దాన్నిఆచరిచడం గురించి గాని అంగ్లేయులది భిన్నమైన అభిప్రాయం.

దీని చదువరులం కొంచెం సేపు ఈ సన్నివేశంలో ‘వర్చువల్’ గా మనం ఉన్నట్టుగా వుహించుకోవాలి. ఆ రోజు...సమయం సాయంత్రం అయింది, అబ్రహం స్థానంలో ఉన్న ‘నీవు’ ఒంటరిగా ఉన్నావు. ఇంతలో జెహోవా నుంచి పిలుపు. ఆయన- “మూడేండ్ల పెయ్య దూడను, మూడేండ్ల మేకను, మూడేండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని ‘నీతో’ చెప్పాడు. అలా చెప్పి అయన వాటిని తనకు బలి ఇవ్వమన్నాడు. 
సరే, జంతువులను తీసుకుని వచ్చావు. ఒక్కొక్క జంతువును కత్తి తీసుకుని వాటిని నడుమకు ఖండించావు. అందుకు నీకు ఎంతో బలం అవసరమైంది, అవి లొంగక నీకు ఎదురు తిరిగాయి. ఒంటరిగా ఆ పని చేయడం నీకు ఎంతో శ్రమతో కూడుకున్న పని అయింది. చివరికి బలి ఇవ్వడం పూర్తి అయింది. ఇప్పుడు అక్కడ అంతా రక్తం, అది అన్ని వైపులా ప్రవహిస్తూ క్రమంగా గడ్డకడుతున్నది. అప్పటికే ‘నీ’ చేతులు దుస్తులు పూర్తిగా రక్తంతో చెమటతో తడిసిపోయాయి. 
మూడు జంతువులు ఒక్కక్కటి రెండు ముక్కలు అయింది. ముందుగా అయన చెప్పినట్టు వాటిని వేరువేరుగా వుంచావు. ఇదంతా జరుగుతున్నది బహిరంగ ప్రదేశం కావడంవల్ల ఇంతలో వాటి మీద గ్రద్దలు వాలాయి, వాటిని తోలివేసావు. అప్పటికే పొద్దు కుంకుతున్నది. ఒక్కసారిగా గాఢమైన అంధకారం కమ్ముకొచ్చింది. ఇంతలో ‘నీకు’ మొదలైన మగత కాస్తా ఒళ్లు తెలియని నిద్ర అయింది. 

ఆ సమీపంలో ఆ చీకటిలో రాజుకుంటున్న మంట కనిపించింది. అది ఎందుకు వెలిగిందో, ఎవరు వెలిగించారో తెలియదు. అప్పటివరకు కంటికి కనిపించకుండా కేవలం చెవులకు వినిపించిన అయన ‘వాక్కు’ ఒక్కసారి ‘జ్వాల’ గా మారి పై నుండి కిందికి దిగడం, అది ఇంగ్లీష్ అక్షరం ‘L’ (ఎల్) మాదిరిగా ఆ జంతుకళేబరాల ఖండాల మధ్య నుండి, ఒక మహా వెలుగుగా సర్రున దూసుకుని పోయింది! 

ఇప్పుడు ఇక ‘వర్చువల్’ పాత్ర నుంచి బయటకు వద్దాం. ఒక హర్రర్ సినిమాలోని గ్రాఫిక్ సీన్ మాదిరిగా కనిపిస్తున్న ఈ దృశ్యంలో- నేటి ఆధునిక చర్చిలో వుండే ఏ విశ్వాసి అయినా; జంతువులను బలి ఇచ్చే ఆ పాత్రలో తనను తాను కనీసం - జెస్ట్ ఫర్ ఇమేజిన్, అని అయినా ఉహించుకోగలడా?! బహశా అది చాలా కష్టం కావచ్చు. కానీ కీ.పూ.2166 నాటి అబ్రహం ఆ పని దేవుడైన జెహోవా చెప్పిన ప్రకారం చేసాడు. 

ఈ సంఘటన ఇప్పటి మిడిల్ఈస్ట్ గా పిలవబడుతున్న ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత కాలంలో మోషే దీన్ని బైబిల్ అదికాండంలో రికార్డు చేసాడు. అయితే చిత్రం ఏమంటే, ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని పరిచయం చేసింది మేమే అని చెప్పుకునే ప్రాశ్చాత్య ప్రపంచానికి దైవారాధనలో ఈ జంతుబలి గురించి తెలియదు. కానీ ఆసియా వాసులమైన మన భారతీయులకు ఇది బొత్తిగా తెలియని చూడని చదవని సన్నివేశం మాత్రం కాదు. 

కొన్ని ప్రత్యేక పండగలప్పుడు ఇప్పటికీ కొన్ని దేవాలయాల వద్ద జంతువులను, పక్షులను బలి ఇచ్చి వాటి మాంసంతో అక్కడే వండుకుని తినే ఆచారం (అందరూ కాదు) మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ వుంది. అయితే- దేవాలయ ప్రాంగణంలో జంతువును వధించినప్పుడు రక్తం, నీరు కలిసి బలి ప్రదేశం నుంచి బయటకు ప్రవహించడానికి మార్గం, బలి ఇచ్చిన జంతువు మాంసం వండుకుని తినడానికి అవసరమైన స్థలం ఏర్పాటు, అందుకు పాటించవలసిన నియమాలు వాటిని ప్రధాన దేవాలయానికి ఎటువైపున ఎలా ఏర్పాటుచేయాలో కూడా దేవాలయ నిర్మాణ వాస్తుపద్దతులు గురించి బైబిల్లో రాజులు గ్రంధంలో సవివరంగా రాయడం జరిగింది.  
అయితే ఇప్పుడు ఇక్కడ విషయం- బలి గురించి కాదు. పై సన్నివేశంలో బలి ఇచ్చిన తర్వాత, జరిగిన దాని గురించి. ఆ సంధ్య వేళల్లో చిక్కటి చీకటిలో దట్టమైన పొగల మధ్య నుంచి నారింజ రంగులో రాజుకున్న వెలుగు లేదా జ్యోతి ఆవిధంగా అక్కడ వెలగడం గురించి. అది కనిపించిన తర్వాత దేవునికి – మనిషికి మధ్య ఒక ప్రధానమైన ‘ఒడంబడిక’ జరిగింది. 

అబ్రహం మనిషి కనుక అయన తనకున్న సందేహాలను తాను వ్యక్తం చేయడం జరిగింది, వాటికి సమాధానాలు కూడా దేవుని నుంచి అక్కడే దొరికాయి. ఇదంతా జరిగాక సమీపంలో జ్యోతి వెలగడం అక్కడ పడివున్న ఖంఢాల మధ్య నుంచి ఒక జ్వాల సర్రున దూసుకుపోవడం జరిగింది. ఇదంతా జరగడానికి సమయం పగటి వెలుతురులో మొదలై, చిమ్మ చీకటిపడే వరకు అంటే కనీసం 3-4 గంటలు పట్టి ఉండవచ్చు. 

జరిగిన ఇదంతా అక్కడికి కొంచెం దూరంగా, ఎత్తు మీద నిలబడి ఈ దృశ్యాన్ని మనం కనుక చూస్తే- చీకటి పడుతున్నప్పుడు ఈ లోయలో ఒంటరిగా ఈ వృద్దుడు ఇంతటి శారీరక శ్రమతో చెమటలు కార్చుతూ... ఇక్కడ చేస్తున్నది ఏమిటి? అని మొదట మనకు ఆసక్తి మొదలై... ఆ దృశ్యం చివరిలో జరిగింది చూసి- భయమూ ఆందోళన కలుగుతాయి! ఒంటరిగా ‘బ్లూటూత్ ఫోన్లో’ మాట్లాడుకుంటూ తన పని తానుచేసుకునే వాడి మాదిరిగా,  అతనికేమో అక్కడ చేయవలసింది ‘వాక్కు’ గా నేరుగా దేవుని వద్ద నుంచి ‘డైరెక్షన్స్’ వస్తున్నాయి, ఆ ప్రకారం తను చేస్తున్నాడు. 

మనకేమో తను ఒంటరిగా ఒక్కడే ఆ లోయలో చీకటిలో తనకు తోచింది తను చేసుకుపోతున్నట్టుగా కనిపిస్తున్నాడు. సరిగ్గా ఈ క్షణాల్లో సమీపంలో వెలుగు రాజుకుంది! దాంతో అప్పటి వరకు ఆ లోయలో ఒక్కడే వున్న అబ్రహం మీద నుంచి, మన దృష్టిని మళ్లించిన రెండవ అంశం- అక్కడ వెలిగిన ఆ జ్యోతి. ఆ జ్యోతి వెలిగాక, అంతకు ముందు పై నుంచి దిగిన జ్వాల ఆ సన్నివేశంలో నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అక్కడ వున్నది, రెండే. అబ్రహాము – జ్యోతి. మూడవది అయిన జెహోవా వాక్కు జ్వాల రూపంగా  అక్కణ్ణించి అంతర్దానమయింది. ఇక మూడవది అయిన దేవునికి-మనిషికి మధ్య జరిగిన ఒడంబడిక, ఎటూ కంటికి కనిపించేది కాదు. కేవలం మనిషి దాన్నిఆచరణలో నిలబెట్టుకోవడమే.   
ప్రత్యేక సందర్భాల్లో జ్యోతి వెలిగించడం అనేది తూర్పు దేశాల్లో అత్యంత ప్రాచీనమైన ప్రాముఖ్యమైన ఆచారం. ఒక సభ ప్రారంభానికి సూచికగా ముందుగా జ్యోతి వెలిగిస్తారు. అక్కడ జరగబోయే కార్యక్రమం అంతా వెలుగులో అంటే సత్యంలో సత్యంగా జరగాలనేది దాని ప్రతీకాత్మక భావన. క్రీడల ఆరంభంలో జ్యోతి వెలిగిస్తారు. భారతీయ వివాహాల్లో పెళ్ళి క్రమం ప్రారంభానికి ముందు వేదిక మీద అగ్ని రాజేస్తారు. వధూవరులు అగ్నిచుట్టూ ప్రదక్షణలు చేస్తారు. వారిద్దరూ కలిసి జీవించే క్రమంలో ఇక ముందు మా జీవితాల్లో ఇటువంటి ప్రతికూల భావనలకు చోటు ఇవ్వమని, అందుకు ప్రతీకాత్మంగా ధాన్య రూపంలో వాటిని అగ్నిలో వేస్తూ ప్రమాణం చేస్తారు. ఇక ఆరాధనా స్థలాల్లో జ్యోతి వెలిగించడం అనేది, పద్దతులు భిన్నంగా ఉన్నప్పటికి ఒక్కొక్క మతంలో ఒక్కో తీరుగా వుంది. 

అది మన దేశంలోను అన్ని ఆసియా దేశాల్లోనూ కనిపిస్తుంది. ఆసియా నుంచి ఇతర ప్రపంచ దేశాలకు వెళ్ళిన ఈ విశ్వాసాలు ఉన్న అన్ని ప్రపంచదేశాల్లోనూ ఇప్పుడు ఇది కనిపిస్తున్నది. ఒక చోట అది నూనె పోసి వెలిగించే ప్రమిద అయితే, మరొకచోట అది కొవ్వొత్తి కావచ్చు, మరొక చోట ఎలక్ట్రానిక్ బల్బ్ కావచ్చు ఏదైనా ‘వెలుగు’ అక్కడ విషయం!  

మరొకసారి జ్యోతి వెలిగే ప్రాముఖ్యమైన సందర్భం బైబిల్లో ఒకటుంది. ప్రపంచం అంతటికి అది తెలుసు. మనిషితో జెహోవా చేసిన చివరి ఒడంబడిక అమలు జరిగిన సన్నివేశంలో దాన్ని మనం చూస్తాము. అది- మానవాళి వరుస వైఫల్యాల తర్వాత; ఒకనాటి కఠినతరమైన మోషే ధర్మశాస్త్రం ఆచరించడం ఇక మీ వల్ల కాదని, ఒకప్పుడు మన పట్ల ఉగ్రుడుగా వున్న జెహోవా దాన్ని సరళీకరించడానికి ఆయన ముందుగ చెప్పిన ప్రకారం- తన కుమారుడు జీసస్ బెత్లెహేములో సాధారణ మానవునిగా పుట్టినప్పుడు చూస్తాం. అప్పుడు ఆకాశంలో ఒక వెలుగు రేఖ నక్షత్రమై కనిపించింది. ప్రపంచం దాన్ని ‘క్రిస్మస్’ అని పండగగా చేస్తున్నది. కానీ ‘దీపం’ విషయం మర్చిపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios