అగ్రరాజ్యంలో మరోసారి భారతీయులు తమ సత్తా చాటారు. అమెరికాలోని డెమొక్రటిక్‌ పార్టీకి భారత సంతతికి చెందిన మహిళ సీమా నందా సీఈఓగా ఎంపికయ్యారు. అమెరికాలో ఇంతటి గొప్ప పదవికి ఎన్నికైన తొలి ఇండియన్‌ అమెరికన్‌గా సీమా నందా చరిత్ర సృష్టించారు. ఈ పార్టీకి సంబంధించిన డెమొక్రటిక్‌ నేషనల్‌ కమిటీకి సీమాను ఆపరేషనల్ హెడ్‌గా నియమిస్తున్నట్లు డీఎన్‌సీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఈ సందర్భంగా సీమా నందా మాట్లాడుతూ.. తనకు ఈ పదవి రావడం తన జీవితకాలంలో వచ్చిన ఓ అద్భుతమైన అవకాశం అని అన్నారు. సీమా నియామకంపై కమిటీ చైర్మన్‌ టామ్‌ పెరేజ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇమిగ్రేషన్‌, పౌరహక్కులపై ఆమెకు అపార అనుభవం ఉందని ఆయన అన్నారు. జులై నెల నుంచి సీమా నియామకం అమలులోకి రానుంది.

ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న మేరీ బెత్ కేహిల్ స్థానాన్ని భర్తీ చేయటం కోసం దాదాపు ఐదు నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చివరకు ఈ పదవి సీమా నందాను వరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు బాధ పడతున్నారని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు డెమోక్రాట్లు సానుకూల ప్రయత్నాలు చేస్తారని భావిస్తున్నామని సీమా అన్నారు.