చికాగో సెక్స్ రాకెట్: తెనాలి యువకుడి అరెస్టు, వారిపై రెడ్ కార్నర్
చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారం పలువురిని చిక్కుల్లో పడేసింది. ఈ వ్యవహారాన్ని కొంత మంది వాడుకుని ఓ ఎన్నారైపై దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు: చికాగో సెక్స్ రాకెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధిగా చెప్పుకుంటూ సేవా కార్యక్రమాలు చేపట్టిన ఓ ఎన్నారైని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఆయనకు షికాగో సెక్స్ రాకెట్ తో సంబంధం ఉందని, తప్పుడు పనులు చేస్తూ అడ్డదారిలో సంపాదిస్తున్నాడని గత కొద్ది రోజులుగా ముమ్మరంగా ప్రచారం జరిగింది. వాట్సప్ ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై గుంటూరుకు చెందిన ఆయన బంధువు ఫిర్యాదు చేశారు. దీంతో నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఇటీవల కేసు నమోదైంది.
ఆ కుట్రలో అమెరికాలో ఉంటున్న తెనాలికి చెందిన వల్లేటి వెంకట మోహన్, తెనాలిలో ఉంటున్న వల్లభనేని భార్గవ్, అమెరికాలో ఉంటున్న పరుచూరి ఫణిధర్, పుట్టి శరత్, గోపాలకృష్ణ తదితరుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వారిలో భార్గవ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అర్బన్ అదనపు ఎస్పీ వైటీ నాయుడు అందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. తానా ప్రతినిధికి మంచి పేరు రావడం చూసి సహించలేక వెంకట మోహన్, ఫణిధర్, శరత్, గోపాలకృష్ణ తదితరులు ఆయనను అప్రతిష్ఠ పాల్జేసేందుకు పథకం రూపొందించారు.
తమ పథకంలో భాగంగా 20 రోజుల క్రితం వెంకట మోహన్ తెనాలిలో ఉంటున్న తన బంధువైన భార్గవ్‌కు ఫోన్ చేసి ఆంధ్రాలో తనకో సిమ్ నంబర్ కావాలని కోరాడు. భార్గవ్ తన తల్లి పావని సెల్ నంబర్‌ను మోహన్‌కు చెప్పాడు. మోహన్ అమెరికాలో ఉండి ఈ నంబర్‌తో ప్లేస్టోర్ నుంచి వాట్సప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఆ సమయంలో భార్గవ్ తల్లి సెల్‌కు ఓటీపీ నంబర్ రాగా మోహన్ నంబర్ అడిగి తెలుసుకుని ఆమె పేరుతో డౌన్‌లోడ్ అయిన వాట్సప్ ను అమెరికా నుంచి వాడసాగాడు.
మోహన్‌తోపాటు మిగిలిన ముగ్గురు కూడా అసభ్యకర, తప్పుడు మెసేజ్‌లు, ఓ మహిళ కంఠంతో అసభ్యకర పదజాలాలు రికార్డు చేసి దానిని అమెరికాలోనూ, ఆంధ్రాలోనూ తానా ప్రతినిధికి సంబంధించిన బంధువులకు, స్నేహితులకు పంపారు.
ఇటీవల తానా ప్రతినిధి గుంటూరులోని ఇన్నర్ రింగ్‌రోడ్డులో ఉన్న తన బంధువు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఆయన బంధువుకు కూడా అసభ్యకర మెసేజ్‌లు, వాయిస్ రికార్డులు వచ్చాయి. దీనితో ఆయన నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో భార్గవ్ ను అరెస్టు చేసిన పోలీసులు అమెరికాలో ఉంటున్న మిగిలిన నలుగురు నిందితులు వెంకటమోహన్, పరుచూరి ఫణిదర్, పుట్టి శరత్, గోపాలకృష్ణలకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు.