దేశవ్యాప్తంగా పోర్న్ వెబ్ సైట్లపై నిషేధం విధించాలని కోరుతూ ఓ మహిళ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ముంబయికి చెందిన ఓ మహిళ.. కేవలం ఈ పోర్న్ వెబ్ సైట్ల కారణంగా తన జీవితం నరకప్రాయంగా మారిందని న్యాయస్థానంలో తన ఆవేదనను తెలియజేసింది. తన భర్త ఈ వెబ్‌సైట్లకు చిన్నప్పటినుంచే బానిసగా మారాడని ఆ మహిళ తెలిపింది.

ఈ వెబ్ సైట్లకు పూర్తిగా బానిసగా మారిపోయి ఉద్యోగం చేయడం కూడా మానేసాడని ... అస్తమానం ఇదే యావలో ఉంటూ, తనతో అసహజ, అనైతిక లైంగిక కార్యకలాపాలలో పాల్గొనాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నాడని వాపోయింది. దీంతో తన సంసారజీవితం పూర్తిగా చీకటిమయం అయిపోయిందని, ఇప్పుడు పరస్పర అంగీకారంపై విడాకుల కోసం తన భర్త  ఫ్యామిలీకోర్టుకు వెళ్లాడని మహిళ చెప్పింది . 2013లో కమలేశ్ వాస్వానీ అనే అడ్వకేట్ ఆన్‌లైన్ పోర్నోగ్రఫీని నిషేధించాలనే విషయంపై వేసిన కేసులో తనను కూడా పార్టీగా పరిగణించాలని కోర్టును కోరింది.

దేశంలో వెల్లువెత్తుతున్న ఈ అశ్లీల వెబ్‌సైట్ల వల్ల నవతరం పూర్తిగా వీటికి బానిసగా మారి, నైతిక-ఆధ్యాత్మిక విలువలను విస్మరిస్తున్నారనీ, తద్వారా దేశపురోగతి కుంటుపడుతుందని ఆమె అభిప్రాయపడింది. ఈ దశలో వీటిని అడ్డుకోకపోతే లైంగికనేరాలు, వైవాహిక విబేధాలు పెరిగే అవకాశం ఉందని తను ఆందోళన వ్యక్తం చేసింది. యువత తప్పుదోవ పట్టడానికి ఈ పోర్న్ వెబ్ సైట్లు కారణమంటూ ఆమె తన అభియోగ పత్రం లో పేర్కొంది.
కాగా, సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పింది. బహిరంగప్రదేశాలలో అశ్లీలచిత్రాలను చూడటాన్ని నిషేధించే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది.