Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో బిజెపికి "తెలుగు" గుబులు: 40 సీట్లలో ప్రభావం

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బిజెపికి తెలుగు గుబులు పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటక తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు.

Telugu poeple in Karnataka may vote against BJP

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బిజెపికి తెలుగు గుబులు పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటక తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. జెడిఎస్ కు మద్దతు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విజ్ఞప్తి చేశారు. 

కర్ణాటకలోని 40 శాసనసభా స్థానాల్లో తెలుగువారు జయాపజయాలను నిర్ణయిస్తారని అంటున్నారు. బళ్లారి, రాయచూరు, కొప్పళ, దావణగెరె, తముకూరు, కోలార్, చిక్కబళ్లాపురం, బెంగళూరు జిల్లాల్లో తెలుగువారి ప్రభావం ఉంటుంది. 

కర్ణాటకలో స్థిరపడిన దాదాపు కోటి మంది తెలుగువాళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు 8 శాతం మంది కాగా, తెలంగాణకు చెందినవారు 20 శాతం మంది ఉంటారని అంచనా. కర్ణాటక రాజకీయాల్లో తెలుగువారు కీలక పాత్రనే పోషిస్తున్నారు. కర్ణాటక తొలి ముఖ్యమంత్రి కెసి రెడ్డి ప్రవాసాంధ్ర కుటుంబానికి చెందినవారు. 

ప్రస్తుతం ఎన్నికల్లో ఢీకొంటున్న బిజెపి, కాంగ్రెసు, జెడిఎస్ ల్లో తెలుగువారు ఉన్నారు. కర్ణాటకలోని తెలుగువారి నాడి ఏమిటో తెలియడం లేదు. వారు బిజెపి ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నప్పటికీ బాహాటంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు. 

కాంగ్రెసు పార్టీ ఎపి, తెలంగాణ నాయకులను రంగంలోకి దించింది. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నాయకత్వంలోని బృందం ఇప్పటికే తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యటిస్తోంది. బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్ారు. ఐఎసిసి కార్యదర్శి, తెలంగాణ నేత మధు యాష్కీ గౌడ్ ఇప్పటికే కర్ణాటకలో మకాం పెట్టారు. 

బిజెపి కూడా ఎన్టీఆర్ కూతురు, సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరిని రంగంలోకి దింపింది. కొద్ది రోజులుగా ఆమె రాయచూరు, బళ్లారి, కొప్పళ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మరో నాయకుడు, సినీ నటుడు కృష్ణంరాజు కూడా ఈ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ స్థితిలో తెలుగువారి ఓట్లు తమకే పడుతాయని జెడిఎస్ నాయకులు ఆశతో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios