Asianet News TeluguAsianet News Telugu

2019 ఎన్నికల్లో దుమ్ము రేపనున్న ఆర్ఎస్ఎస్ సినిమా: స్క్రిప్ట్ బాహుబలి రైటర్

ఆర్ఎస్ఎస్ చరిత్రను, విజయాలను ప్రతిఫలిస్తూ రూ.180 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా రాబోతోంది. ఈ సినిమాను హిందీలోనే కాకుండా తెలుగులోనూ తీస్తున్నారు.

RS 180 crore film on RSS scrpted by Vijendra Prasad

హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ చరిత్రను, విజయాలను ప్రతిఫలిస్తూ రూ.180 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా రాబోతోంది. ఈ సినిమాను హిందీలోనే కాకుండా తెలుగులోనూ తీస్తున్నారు. ఈ సినిమాకు బాహుబలి దర్శకుడు రాజమౌళి తండ్రి, రచయిత విజేంద్ర ప్రసాద్ స్క్రిప్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

బిజెపి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ అదినేత మోహన్ భగవత్ సినిమా స్క్రిప్టునకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ సినిమా నిర్మాణం పూర్తయి, ప్రజల ముందుకు వస్తుందని అంటున్నారు. అయితే, ఎన్నికలతో సినిమాకు సంబంధం లేదని ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్న వారంటున్నారు. 

మోహన్ భగవత్ తోనూ సంఘ్ సిద్ధాంతకర్త గురుమూర్తితోనూ చర్చించి విజేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బాహుబలి -2 సినిమా చూసిన తర్వాత ఆర్ఎస్ఎస్ చరిత్రపై సినిమాకు రూపకల్పన జరిగింది.

బాహుబలి 2 సినిమా విజయం తర్వాత ఆర్ఎస్ఎస్ పై సినిమా తీయాలనే ఆలోచనతో కన్న సినీ ఆడియో టైకూన్ లహరి వేలు తులసి నాయుడు ముందుకు వచ్చినట్లు ది ప్రింట్ రాసింది. వేలు బిజెపికి సన్నిహితులు. 

బాహుబలి 2 విడుదల తర్వాత చెన్నై నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తుండగా తనకు ఆలోచన వచ్చిందని, వెంటనే తన మేనేజర్ ను పిలిచి రెండు టైటిల్స్ రిజిష్టర్ చేయాలని చెప్పానని సినిమా నిర్మాతల్లో ఒక్కరైన వేలు అన్నారు 

విజేంద్ర ప్రసాద్, వేలు గురుమూర్తిని కలిసి స్క్కిప్ట్ పై దృష్టి పెట్టారు. ఆ ఇద్దరు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ను కూడా కలిశారు. స్క్రిప్టులో తప్పులు దొర్లకుండా, పరిశోధనను ప్రాతిపదికగా చేసుకుని తయారు చేయడానికి మోహన్ భగవత్ కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చారు.

విజేంద్ర ప్రసాద్ తన 27 మంది జట్టు సభ్యులతో స్క్రిప్ట్ పై పనిచేశారు. సినిమాకు దర్శకుడిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అలాగే నటీనటులను కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వేలు, విజేంద్ర ప్రసాద్ మోహన్ భగవత్ ను మూడు సార్లు కలిసి స్క్రిప్టును వివరించారు. రెండు నెలల క్రితం స్క్రిప్ట్ కు తుదిరూపం లభించింది. 

సినిమా ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ సహాయం కోసం సినిమా జట్టు జీ గ్రూప్ నకు చెందిన రాజ్యసభ సభ్యుడు సుభాష్ చంద్రను,  మోషన్ పిక్చర్స్ కు చెందిన రాజ్ సింగ్ ను కలిశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios