ఏదైనా గొప్ప పెయింటింగ్ కనిపిస్తే చాలు.. దానిని రవివర్మ పెయింటింగ్ తో పోలుస్తూ ఉంటారు. అద్భుతంగా ఉందంటూ పొగడ్తలతో ముంచేస్తుంటారు. అలాంటిది ఏకంగా రవివర్మ స్వయంగా వేసిన పెయింటింగ్ ని చూస్తే.. ఏక కళాభిమానులకు అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. ప్రపంచవ్యాప్తంగా రవివర్మ పెయింటింగ్స్ కి అభిమానులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఆయన కళామథనం నుంచి జారిపడిన ఎన్నో అద్భుత కళాఖండాలు నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియాలలో ఉన్నాయి. తాజాగా ఒక వేలం సంస్థ ఆయన పెయింట్ ను వేలానికి పెడితే, సంస్థ ఊహించిన దానికంటే అధికమొత్తంలో అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

రవివర్మ గీసిన తిలోత్తమ పెయింటింగ్ ను సోతెబై అనే వేలం కంపెనీ వేలానికి ఉంచింది. పేరు చెప్పని ఒక వ్యక్తి ఈ పెయింటింగ్ ను రూ. 5 కోట్లకు సొంతం చేసుకున్నాడు. దేవలోకపు నాట్యగత్తె అయిన తిలోత్తమ స్వర్గం నుంచి భూమికి వస్తున్న సమయంలో ఆమె చీర ఎగిరిన సందర్భాన్ని అత్యంత కళాత్మకంగా చిత్రీకరించాడు రవివర్మ. పెయింటింగ్ కు ఒక మూల రవివర్మ సంతకం వేసి ఉంది.  1836లో ఈ పెయింటింగ్ ను చిత్రీకరించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.