జనసేన కార్యక్రమాలను, పవన్ పర్యటనలను హింసాత్మకంగా మార్చేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని జనసేన ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి తెలిపారు. నిఘా వర్గాల సమాచారంతో ఈ నెల 30న గుంటూరు జిల్లా బాపట్ల లో జరగాల్సిన పవన్ పర్యటనను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే ఈ నెల 21,22, 23 తేదీల్లో జరగాల్సిన పవన్ చిత్తూరు జిల్లా పర్యటనను వాయిదా వేసినట్లు తెలిపారు.


ప్రజలకోసం పోరాడుతూ, ప్రజల మద్యకు రావాలనుకున్న ఈ పర్యటనలను అదునుగా చూసుకుని హింస చేలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. గతంతో కాపుల ఉద్యమంలో జరిగిన తుని రైలు విధ్వంసం తరహా ఘటనలు జరుగుతాయని వారు హెచ్చరించట్లు మహేందర్ రెడ్డి తన ప్రకటనలో తెలియజేశారు. చిత్తూరు జిల్లా శెట్టిపల్లిలో భూ సేకరణ సమస్యలపై జరగాల్సిన పర్యటన అందుకోసమే వాయిదా పడింది. ఇక గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురం నివాసి, వెయిట్ లిప్టింగ్ క్రీడాకారుడు వెంకట్ రాహుల్ కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించినందుకు ఈ నెల 30 న పవన్ నేతృత్వంలో జరగాల్సిన ఊరేగింపు కూడా అందువల్లే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఇలా పార్టీని, పవన్ ని టార్గెట్ చేస్తూ హింసకు ప్రేరేపిస్తున్న వారికి భయపడేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించినట్లు మహేందర్ తెలిపారు. జనసేన ముఖ్య నేతలతో హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగన సమావేశం గురించి ఆయన వివరించారు. ప్రజల వద్దకు వెళ్లాలన్న తనను ఎవరూ ఆపలేరని ఈ సమావేశంలో పవన్ ఉద్ఘాటించారని తెలిపారు. 

తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రత్యేక హోదా సాధనే ద్యేయంగా జిల్లాల్లో త్వరలో పర్యటన ఉంటుందని, ఇందుకోసం వివిధ కమిటీలు ఏర్పాటు చేయాలని పవన్ సూచించారు. మూడు, నాలుగు వారాల్లో జిల్లాల పర్యటన ప్రారంభమవుతుందని, ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ ఆదేశించినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.