హైదరాబాద్: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జెడిఎస్ తరఫున ఎన్నికల ప్రచారం చేయాలని కోరుతూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. అయితే, ఆయన కర్ణాటక పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదు.  తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. 

కోరితే జెడిఎస్ తరఫున ప్రచారం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దేవెగౌడతో భేటీ సమయంలో చెప్పారు. కానీ ఇప్పటి వరకు జెడిఎస్ నుంచి ఆయనకు ఏ విధమైన ఆహ్వానం అందలేదు. 

తమ పార్టీ తరఫున ప్రచారం చేయాలని జెడిఎస్ చేసిన విజ్ఞప్తికి పవన్ కల్యాణ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని కొద్ది రోజుల క్రితం జెడిఎస్ అధికార ప్రతినిధి రమేష్ బాబు ధ్రువీకరించారు కూడా. 

కాంగ్రెసు తరఫున మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా తమ పార్టీ తరఫున ప్రచారం చేసే నాయకుల పేర్లలో ఎఐసిసి చిరంజీవి పేరును కూడా చేర్చింది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెసు కోసం ప్రచారం చేసారు. అయితే, చిరంజీవి పర్యటన ఇంకా ఖరారు కాలేదని, ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటారని అంటున్నారు. 

కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెబుతూ వచ్చింది. కానీ ఆ దిశగా తెలుగుదేశం పార్టీ ఏ విధమైన చర్యలూ తీసుకోవడం లేదు. బిజెపితో తెగదెంపులు చేసుకున్న సమయంలో కర్ణాటకలో తమ సత్తా ఏమిటో బిజెపికి రుచి చూపిస్తామని కొంత మంది తెలుగుదేశం నాయకులు అన్నారు .