భువనేశ్వర్: పరువుప్రతిష్టలు దెబ్బ తిన్నాయని మనస్తాపానికి గురైన అత్యాచార బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఒడిశాలోి నయాగడ్ జిల్లా నౌగావ్ లో ఈ సంఘటన జరిగింది. విషం సేవించి ఆమె ఆత్మహత్య చేసుకుంది. 

తాను పనికి వెళ్లానని, తిరిగి వచ్చి చూసేసరికి చనిపోయిందని, పక్కన విషం సీసా పడి ఉందని ఆమె సోదరుడు చెప్పాడు. ఆరు నెలల క్రితం దేవరాజ్ బారిక్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు.

అమ్మాయి గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. 

జనవరి ప్రారంభంలో కుర్ద జిల్లాలో అత్యాచారానికి గురైన ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె బలవన్మరణానికి గురైంది. దానికి ముందు కుందులి గ్యాంగ్ రేప్ బాధితురాలు కూడా ఆత్మహత్య చేసుకుంది.