డెట్రాయిట్: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ 13 లక్షల కార్లను రీకాల్ చేస్తోంది. ప్రముఖంగా అమెరికా, కెనడా దేశాల్లోని ఈ సంస్థ కార్లలో బ్యాకప్ కెమెరా డిస్ ప్లే లో సమస్యలు వచ్చినట్లు సంస్థ యాజమాన్యం ద్రుష్టికి వచ్చింది.

2018, 2019ల్లో నిస్సాన్ విపణిలోకి ఆవిష్కరించిన నిస్సాన్ ఆల్టిమా, ఫ్రంటైర్, కిక్స్, లీఫ్, మాక్సిమా, మురానో, ఎన్వీ, ఎన్వీ 200, పాథ్ ఫైండర్, రోగ్, రోగ్ స్పోర్ట్, సెంట్రా, టైటాన్, వెర్సా నోట్, వెర్సా సెడాన్ వేరియంట్ కార్లను రీకాల్ చేస్తుంది.

వీటితోపాటు ఇనిఫినిటి క్యూఎక్స్ 50, క్యూఎక్స్ 60, క్యూ70, క్యూ 70 ఎల్ మోడల్ కార్లను కూడా నిస్సాన్ రీకాల్ చేస్తోంది. 2019 మోడల్ కార్లు జీటీ-ఆర్, టాక్సీ కార్లను రీకాల్ చేస్తున్నది. ఇజ్రాయెల్, కొరియా, సైఫాన్ దేశాల్లోని వాహనాలనూ రీ కాల్ చేస్తోంది.

మంగళవారం ప్రభుత్వానికి డాక్యుమెంట్లు సమర్పించిన ఓనర్లు తమ బ్యాకప్ కెమెరా డిస్ ప్లే ద్రుశ్యాలు సరిగ్గా కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. బ్యాకప్ కెమెరా డిస్ ప్లే సరిగ్గా కనిపించక పోవడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది.

కనుక కార్ల యజమానులు తమ డీలర్ల వద్ద ఎటువంటి ఖర్చు లేకుండా కెమెరా సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవచ్చునని నిస్సాన్ తెలిపింది. వచ్చేనెల 21వ తేదీ నుంచి డీలర్లు తమ వద్దకు వచ్చే కార్ల బ్యాకప్ కెమెరాల సాఫ్ట్ వేర్‌ను అప్ డేట్ చేయడం ప్రారంభిస్తాయి. కేవలం అర్ధగంటలోపు సాఫ్ట్ వేర్ అప్ డేట్ అవుతుంది.