4 నెలల పాపపై రేప్: దోషికి మరణశిక్ష

First Published 13, May 2018, 7:47 AM IST
Man gets death sentence for raping and killing 4 month old girl
Highlights

నాలుగు నెలల పాపపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన కేసులో మధ్యప్రదేశ్ లోని స్థానిక కోర్టు దోషిగా మరణశిక్ష విధించింది.

భోపాల్: నాలుగు నెలల పాపపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన కేసులో మధ్యప్రదేశ్ లోని స్థానిక కోర్టు దోషిగా మరణశిక్ష విధించింది. ఇండోర్ లో ఏప్రిల్ 20వ తేదీన జరిగిన ఆ సంఘటనకు సంబంధించిన కేసును కోర్టు అత్యంత వేగంగా విచారించి తీర్పు వెలువరించింది.

నవీన్ గడ్కే (21) అనే నిందితుడికి మరణశిక్ష విధిస్తూ ఇండోర్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వర్ష శర్మ అతని చర్యను అమానవీయ చర్యగా అభివర్ణించారు. ఏడ్వడం తప్ప మరోటి తెలియని చిన్న పాప పట్ల అమానవీయంగా ప్రవర్తించాడని వ్యాఖ్యానించారు.

తీర్పు వెలువరించడానికి ముందు న్యాయమూర్తి దుర్మార్గమైన ఈ నేరానికి నువ్వు ఎటువంటి శిక్షకు అర్హుడవుతావని నిందితుడిని ప్రశ్నించారు. కోర్టు ఏది సరైంది అనుకుంటే ఆ శిక్ష వేయవచ్చునని చెప్పాడు.

జైలుకు పంపించే ముందు తన తల్లితోనూ సోదరితోనూ భేటీ ఏర్పాటు చేయాలని నిందితుడు కోరాడు. నేరం జరిగిన తర్వాత 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి కోర్టు తీర్పు వెలువరించింది.

నిందితుడికి మరణశిక్ష పడడం పట్ల మృతురాలి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల పక్కన పడుకున్న పాపను నిందితుడు తన భుజాల మీద ఎత్తుకుపోయి సమీపంలోని కమర్షియల్ కాంప్లెక్స్ బేస్ మెంట్ లో ఆమెపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశాడు.

loader