టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనుంది. మార్చి 23న మమతను కలవనున్నట్లు హసీన్ మీడియాకు తలిపారు.  తన భర్త షమీపై చేసిన ఆరోపణలకు సంబంధించి ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలిసి వివరించాలనుకుంటున్నానని, ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ అపాయింట్‌మెంట్ కావాలని కోరినట్లు హసీన్ వెల్లడించిన విషయం తెలిసిందే. హసీన్ అభ్యర్థనను పరిశీలించిన సీఎం తనతో సమావేశానికి తాజాగా అనుమతిని ఇచ్చారు. షమీ తనను వేధిస్తున్నాడని, అతనికి అక్రమ సంబంధాలున్నాయని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని జహాన్ ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. షమీపై కోల్‌కతా పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆమె ఆరోపణలపై విచారణ కూడా చేపట్టారు. కాగా.. షమీ కారణంగా తాను పడిన బాధలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని హసీన్ భావిస్తోంది. ఇప్పటికే షమీ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుండగా..సీఎంతో హసీన్   సమావేశం అనంతరం ఈ కథ మరెన్నో మలుపులు తిరగనుందోనని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.