భోపాల్: దేశంలో అత్యాచారాలు పెరుగుతుండడానికి పోర్నోగ్రాఫిక్ వెబ్ సైట్లు కారణమని మధ్య ప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. తమ మంత్రిత్వ శాఖ ఓ సర్వే నిర్వహించిందని, పోర్నోగ్రాఫిక్ కంటెంట్, పోర్న్ వైబ్ సైట్లు ఆ విధమైన నేరాలు పెరగడానికి కారణమని సర్వేలో తేలిందని ఆయన చెప్పారు. 

పోర్న్ సైట్లను నిషేధించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తాను లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఆ విధమైన వివరణ ఇచ్చారు. 

ఇండోర్ లో శుక్రవారంనాడు ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికను రేప్ చేసి హత్య చేశాడు. నిందితుడు బాధితురాలి సమీప బంధువు. సిసిటీవి కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని సునీల్ భీల్ గా గుర్తించారు. 

నేరం చేసిన తర్వాత అతను బాధితురాలి తల్లితో వాదనకు కూడా దిగాడు.దాదాపుగా 92 కేసుల్లో మైనర్ బాలికలపై సమీప బంధువులే అత్యాచారాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు.