దేవెగౌడ కింగ్ మేకర్: ఓపినియన్ పోల్ ఫలితం ఇదీ...

Karnataka assembly polls 2108: Opinion poll
Highlights

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బిజెపి బలం పుంజుకుంటుందని, అయితే, అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మెజారిటీ మాత్రం రాదని ఓపినియన్ పోల్ చెబుతోంది.

న్యూఢిల్లీ: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బిజెపి బలం పుంజుకుంటుందని, అయితే, అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మెజారిటీ మాత్రం రాదని ఓపినియన్ పోల్ చెబుతోంది. కాంగ్రెసు పార్టీని గద్దె దించడానికి వేరే పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పదని అభిప్రాయం వ్యక్తమైంది. 

2019 లోకసభ సాధారణ ఎన్నికలకు ముందు జరిగే మూడు రాష్ట్రాలకు జరిగే శాసనసభ ఎన్నికల్లో కర్ణాటక ఎన్నికలు మొదటివి. కర్ణాటక ఎన్నికల ఫలితాలను బట్టి మోడీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

శాసనసభలో బిజెపి బలం రెండింతలవుతుందని ఓపినియన్ పోల్ సర్వేలో తేలింది. కర్ణాటక శాసనసభలో మొత్తం 224 సీట్లు ఉండగా, బిజెపికి 89 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెసుకు బిజెపి కన్నా రెండు సీట్లు అధికంగా వస్తాయని తేల్చింది. అధికారం చేపట్టడానికి 113 సీట్లు కావాల్సి ఉంటుంది. 

టైమ్స్ నౌ, వోటర్స్ మూడ్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే ఫలితాలు సోమవారం సాయంత్రం వెల్లడయ్యాయి. దేవెగౌడ నాయకత్వంలో జెడి(ఎస్), మాయావతి నేతృత్వంలోని బిఎస్పీతో కలిసి పోటీ చేస్తోంది. ఈ కూటమికి 40 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది.  దీంతో ఈ కూటమి కింగ్ మేకర్ కానుంది.

బిజెపి, కాంగ్రెసు పార్టీలకు అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీ రాదని, దానివల్ల హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఇండియా టుడే కోసం నిర్వహించిన మరో ఓపినియన్ పోల్ అంచనా వేసింది. 

జెడి(ఎస్) బిజెపికి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, మాయావతి ఎలా వ్యవహరిస్తారనేది ప్రశ్నార్థకమే. అయితే తాము కాంగ్రెసును గానీ బిజెపిని గానీ బలపరచబోమని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జెడి(ఎస్) అధికార ప్రతినిధి రమేష్ బాబు అంటున్నారు.

బిజెపితో జెడి(ఎస్) రహస్య అవగాహనకు వచ్చిందని కాంగ్రెసు పార్టీ విమర్శిస్తోంది. అయితే దీనిపై మాట్లాడడానికి రమేష్ బాబు నిరాకరించారు. 

loader