ముంబై : జావా మోటార్‌సైకిల్స్ సంస్థను స్థాపించి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత విపణిలోకి సంస్థ సరికొత్త 90వ యానివర్సరీ ఎడిషన్‌ను తీసుకువచ్చింది. ‘90 యానివర్సరీ ఎడిషన్’ పేరిట మార్కెట్లో ఆవిష్కరించింది జావా మోటార్ సైకిల్స్. దీని ధర రూ.1.72 లక్షల నుంచి మొదలవుతుంది.

అయితే ఈ ఎడిషన్ బైక్‌లు కేవలం 90 మాత్రమే తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై  ‘జావా 90వ వార్షికోత్సవ’ బ్యాడ్జి ఉంటుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌.. జావా డీలర్‌షిప్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉండనున్నది.

జావా 90 యానివర్సరీ బైక్‌ల కోసం అక్టోబర్ 22వ తేదీ అర్ధరాత్రి వరకు బుకింగ్స్ స్వీకరిస్తారు. బుక్ చేసుకున్న వారిలో అర్హులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని జావా మోటారు బైక్స్ తెలిపింది.

1929లో తొలి జావా మోటార్‌సైకిల్‌ను ఫ్రానిటిసెక్‌ జానెక్‌ చెకోస్లోవేకియాలో ఉత్పత్తి చేశారు. ఈ సంస్థను ఫ్రాంటిక్ జానెక్ అనే వ్యక్తి స్థాపించారు. 1996 వరకు జావా-యెజ్డీ పేరుతో విక్రయాలు సాగించారు. అప్పట్లో 150 దేశాలకు ఈ మోటారు సైకిళ్లను ఎగుమతి చేశారు

వివిధ కారణాలతో మూతపడ్డ ఈ కంపెనీని ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ‘క్లాసిక్ లెజెండ్’ పేరిట నిర్వహిస్తోంది. కాగా, 90 యానివర్సరీ ఎడిషన్ బైక్ ‘జావా ఛానెల్’ వేరియంట్’ను పోలి ఉంటుంది.

పాత తరం జావా ‘500 ఓహెచ్వీ’ స్ఫూర్తితో కొత్త ఎడిషన్‌కు సొబగులద్దారు. ఇందులో 293 సీసీ ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 27 బీహెచ్పీ శక్తిని 28 న్యూటన్ మీటర్ టార్చిని విడుదల చేస్తుంది. ఇందులో 6- స్పీడ్ గేర్ బాక్ ఉంది.