ముంబై: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ ఎట్టకేలకు భారత్‌లో తన సేల్స్ సోర్ట్స్ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధంచేసింది. తద్వారా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో చైనా కంపెనీలను ఎదుర్కొనేందుకు సంసిద్ధం అవుతోంది. 

ముంబైలో స్థలాలను ఎంపిక చేసిన ఆపిల్
ఇందుకు ముంబై కొన్ని ప్రదేశాల్లో స్థలాలను కూడా ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న భారత మార్కెట్లో పాగా వేసేందుకు ‘ఆపిల్’ ఐఫోన్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. 

ప్రఖ్యాత కేంద్రాల్లో ‘ఆపిల్’ స్టోర్లు
మరికొన్ని వారాల్లో తన తొలి స్టోర్‌ ఎక్కడ పెట్టాలనేది ఆపిల్ నిర్ణయించనున్నది. ఇప్పటికే ఐఫోన్‌ ప్రపంచంలోని ప్రఖ్యాత ప్రదేశాల్లో తన స్టోర్లను ఏర్పాటు చేసింది. వీటిల్లో న్యూయార్క్‌లోని ఫిఫ్త్‌ అవెన్యూ, లండన్‌ రెజెంట్‌ స్ట్రీట్‌ వంటి ప్రాంతాల్లో ఆపిల్ స్టోర్లు ఉన్నాయి. 

కొన్ని ఐఫోన్ మోడళ్లు ఉత్పత్తి చేయనున్న ఆపిల్
ఆపిల్‌ కంపెనీ కొన్ని ఆపిల్‌ ఫోన్ల మోడల్స్‌ను ఇప్పటికే భారత్‌లో తయారు చేస్తోంది. దీంతో కొత్త ప్రభుత్వం తమ రిటైల్‌ స్టోర్ల ప్రతిపాదనకు అనుమతిస్తుందని ఆపిల్‌ భావిస్తోంది. గత నిబంధనల ప్రకారం ఆపిల్‌ ఇక్కడ స్టోర్లను తెరిచే అవకాశం లేదు. కానీ సంస్థ యాజమాన్యం ఇటీవల నిబంధనల్లో మార్పులు తెచ్చింది. 

రిటైల్ చైన్ల విస్తరణకు ఆపిల్ ప్రణాళికలు
దీంతో ఉత్పత్తి కేంద్రాన్ని భారత్‌కు తరలించడంతో పాటు రిటైల్‌ చైన్‌లను కూడా విస్తరించాలని భావిస్తోంది. గత వారం జరిగిన ఒక సమావేశంలో ఆపిల్ సీఈఓ టిమ్‌ కుక్‌ మాట్లాడుతూ భారత్‌ చాలా కీలకమైన మార్కెట్‌ అని అన్నారు. 

సవాళ్లు నేర్చుకునేందుకు సిద్ధమన్న టిమ్ కుక్
భారత్‌లో సవాళ్లు ఉన్నా నేర్చుకోవడానికి చాలా ఉందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌ అన్నారు. ఆపిల్‌ ఆదాయంలో భారత్‌ వాటా ప్రస్తుతానికి చాలా స్వల్పంగా ఉంది. అమెరికా నుంచి 44శాతం, చైనా నుంచి 18శాతం వస్తున్నాయి. 

నాలుగేళ్ల క్రితమే రిటైల్ స్టోర్లను అనుమతించాలన్న ఆపిల్
నిజానికి భారత్‌లో తమ రిటైల్‌ స్టోర్లను అనుమతించాలని ఆపిల్‌ నాలుగేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే భారత్‌లో ఉత్పత్తి యూనిట్‌ పెడితేనే ఆ విషయం పరిశీలిస్తామని ప్రభుత్వం తెగేసి చెప్పింది. 

చైనాలో తగ్గిన ఆపిల్ ఫోన్ విక్రయాలు
మరోవైపు చైనాలో ఆపిల్‌ ఫోన్ల అమ్మకాలు ఇటీవల బాగా తగ్గాయి. ఇదే సమయంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఇందులో చైనా కంపెనీలదే అధిక వాటా. 

ఆపిల్ ఫోన్ల దిగుమతిపై 20 శాతం సుంకం అదనం
అమెరికా నుంచి ఆపిల్‌ ఫోన్లు దిగుమతి చేసుకుంటే 20 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆపిల్‌, చైనా కంపెనీలతో పోటీపడలేకపోతోంది. భారత్‌లోనే ఆపిల్‌ ఫోన్ల ఉత్పత్తి చేపడితే, చైనా కంపెనీలతో పోటీపడడంతో పాటు, భారత్‌లో తమ ప్రత్యేక రిటైల్‌ స్టోర్లు ఏర్పాటు చేసేందుకు వీలవుతుందని ఆపిల్‌ కంపెనీ భావిస్తోంది.

టాటా గ్లోబల్ డైరెక్టర్‌గా శిఖా శర్మ
యాక్సిస్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో శిఖా శర్మ, పిడిలైట్ ఇండస్ట్రీస్ ఎండీ భరత్ పూరిలను టాటా గ్లోబల్ బెవరేజెస్ డైరెక్టర్లుగా నియమించుకున్నది. ఈ నెల ఏడో తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ నియామకం వచ్చే ఐదేళ్ల వరకు కొనసాగనున్నది. ఇందుకోసం వాటాదారులు అనుమతించాలని సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 

2009 జూన్ నుంచి 2018 వరకు యాక్సిస్ బ్యాంక్ ఎండీగా శిఖాశర్మ
జూన్ 2009 నుంచి డిసెంబర్ 2018 వరకు యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఉన్న శర్మ .. 1980లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో కేరియర్‌ను ప్రారంభించారు. 2008లో పిడిలైట్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా చేరిన పూరి.. ఏప్రిల్ 2015లో కంపెనీ ఎండీగా నియమితులయ్యారు.