Asianet News TeluguAsianet News Telugu

పల్లెటూళ్ల బాటలో కార్ల సంస్థలు.. సేల్స్ పెంపు వ్యూహం

కార్ల విక్రయాలను పెంచుకొనేందుకు కంపెనీలు రకరకాల ప్రయత్నాలను ప్రారంభించాయి. ఆర్ధిక మాంద్యం ప్రభావం కారణంగా కార్ల కొనుగోళ్లు పడిపోవడంతో పల్లెల బాటను పట్టాయి కార్ల తయారీ సంస్థలు.

India automobile industry sees rural areas
Author
Mumbai, First Published Sep 13, 2019, 10:54 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: విక్రయాలు పడిపోయి... ఆపసోపాలు పడుతున్న వాహన కంపెనీలకు వరుణుడు కరుణ చూపాడు. ఈ ఏడాది వర్షాలు కాస్త లేటైనా దండిగానే కురవడంతో ఇప్పుడు ఆటోమొబైల్‌ దిగ్గజాలు ‘వర్షా’తిరేకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పల్లెకు పోదాం.. మందగమనాన్ని తట్టుకుందాం.. అమ్మకాలు పెంచుకుందాం అని పాట పాడుతున్నాయి. 

గ్రామీణులను ఆకర్షించడానికి గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. తక్కువ వడ్డీరేట్లకు వాహన రుణాలిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లను అందిస్తున్నాయి. సర్వీసింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. 

వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్‌పై మరింతగా దృష్టి సారించాయి. ఆర్థిక మందగమనం వల్ల డిమాండ్‌ తగ్గి అమ్మకాలు కుదేలవడంతో వాహన కంపెనీలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. 

వాహన విక్రయాలు గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారి పోయాయి. దీంతో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుండాయ్, మహీంద్రా, టయోటా తదితర వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. 

ఇక మొత్తం అమ్మకాల్లో గ్రామీణ అమ్మకాలు దాదాపు సగంగా ఉండే మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ 3,000కు పైగా తాలుకాల్లో సేల్స్, సర్వీసింగ్‌ ఔట్‌లెట్లను అందుబాటులోకి తెచ్చింది. అమ్మకాల పెంపునకు టీచర్లు, గ్రామాల్లో కుల వృత్తులు చేసే వ్యక్తులపై దృష్టి పెట్టింది.  

గ్రామీణ వినియోగదారులను ఆకర్షించడానికి వాహన కంపెనీలు గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆకర్షణీయమైన ఎక్సే్ఛంజ్‌ డీల్స్‌ను, తక్కువ వడ్డీరేట్ల ఫైనాన్స్‌ స్కీమ్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో వర్షాలు పుష్కలంగా కురియడంతో పంటలు సమృద్ధిగా పండి ఆర్థిక వ్యవస్థ త్వరితంగా రికవరీ కాగలదన్న అంచనాలు నెలకొన్నాయి. 

దీంతో వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్‌ బాట పడుతున్నాయి. ఖరీఫ్‌లో పంటలు బాగా పండుతాయనే అంచనాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి బడ్జెట్‌ ప్రోత్సాహాన్నివ్వడం తదితర అంశాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలకు డిమాండ్‌ పెరగగలదని కంపెనీలు భావిస్తున్నాయి.  

కాగా మందగమనం వల్ల వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్‌ బాట పట్టాయనడం పూర్తిగా సరైనది కాదని కొందరు నిపుణలంటున్నారు. పెద్ద నగరాల్లో కాకుండా ఇతర మార్కెట్లలో భవిష్యత్తులో అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలు కూడా దీనికి కారణమని వారంటున్నారు. భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదేనని రెనాల్ట్ ఇండియా ఎండీ మామిళ్లపల్లి వెంకట్రామ్‌ అన్నారు.

గ్రామీణ ప్రాంతాలే ముందుగా మందగమన పరిస్థితులను అధిగమిస్తాయని, ఆ తర్వాత పట్టణాలు పుంజుకుంటాయని రెనాల్ట్ ఇండియా ఎండీ మామిళ్లపల్లి వెంకట్రామ్‌ అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు రియల్టీ కుదేలైందని, ముందుగా గ్రామీణ ప్రాంతాల్లోనే రియల్టీకి డిమాండ్‌ పెరిగిందని, ఆ తర్వాత పట్టణాల్లో రియల్టీ రంగం పుంజుకుందని ఆయన ఉదహరించారు.  

ఇప్పటికే గ్రామీణ ప్రాంత వినియోగదారుల నుంచి ఎంక్వైరీలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఈడీ (మార్కెటింగ్,  సేల్స్‌) శశాంక్‌ శ్రీవాత్సవ సంతోషం వ్యక్తం చేశారు. పెట్రోల్‌ కార్ల విషయమై అధికంగా వివరాలు అడుగుతున్నారని, ఎంక్వైరీలు పెరగడం మార్కెట్‌ పునరుజ్జీవనం పొందుతుందనడానికి ఆరంభ సంకేతమని పేర్కొన్నారు. 

మొత్తం మారుతీ అమ్మకాల్లో గ్రామీణ ప్రాంత అమ్మకాలు 38 శాతంగా ఉంటాయి. మందగమనం కారణంగా మారుతీ సుజుకీ కంపెనీ పట్టణ అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్‌–జూలై కాలంలో భారీగా తగ్గగా,  గ్రామీణ ప్రాంత అమ్మకాలు 16 శాతం తగ్గాయి.

మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నా, పట్టణ ప్రాంతాల వ్యాపారంతో పోల్చితే గ్రామీణ వ్యాపారం ఒకింత మెరుగ్గా ఉందని హ్యుండాయ్‌ సేల్స్‌ హెడ్‌ వికాస్‌ జైన్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో ఈ కంపెనీ గ్రామీణ ప్రాంత అమ్మకాలు ఐదు శాతం మేర మాత్రమే తగ్గాయి. త్వరలోనే ఈ మార్కెట్లు పుంజుకుంటాయని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు సానుకూల వృద్ధిని సాధించగలవని ఈ కంపెనీ భావిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios