హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గచ్చబౌలి ట్రిపుల్ఐటీ క్యాంపస్ లో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోయినప్పటికి ఇతడు రాసిన రెండు సూసైడ్ లెటర్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒ క లెటర్ ని తన అభిమాన నటుడు మహేష్ బాబుకు రాయగా మరో లెటర్ ను తన తల్లిదండ్రులకు రాశాడు. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన పులి శ్రీనివాస్‌రెడ్డి, మయూరి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు పులి సునంద్‌కుమార్‌ రెడ్డి(21) గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీలో కంప్యూటర్‌సైన్స్‌ చదువుతున్నాడు. ఇతడు క్యాంపస్ లోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్ లోని ఓ గదిలో ఉంటున్నాడు. అయితే ఏమైందో ఏమో గాని గురువారం హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

సునంద్ మృతదేహాన్ని గమనించిన తోటి విద్యార్థులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.  దీంతో వెంటనే  గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతడి గదిలో తనిఖీ చేయగా రెండు సూసైడ్ లెటర్ లు లభించాయి. అందులో ఒకటి తల్లిదండ్రులకు రాయగా మరొకటి తన అభిమాన నటుడు మహేష్ బాబుకు రాశాడు.

హీరో మహూష్ బాబును తన డాక్టర్ గా పేర్కొన్నాడు సునంద్. తాను ఎప్పుడు డిప్రెషన్ లో వున్నా మహేష్ బాబు సినిమాలు చూసి రిప్రెష్ అయ్యేవాడినని, ఆయన తనకు ఎంతో స్పూర్తినిచ్చాడంటూ రాశాడు. ఇక తల్లిదండ్రులకు రాసిన లెటర్ లో  ‘అమ్మా.. నాన్న.. నేను ఈ లోకంనుంచి వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించండి’అంటూ రాశాడు. ఈ రెండు లెటర్ల లోను తన ఆత్మహత్యకు గల కారణాలను తెలియజేయలేదు.