న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) బీఎస్‌-6 ఉద్గార ప్రమాణాలతో రూపొందించిన కొత్త యాక్టివా-125 వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 ఉద్గార ప్రమాణాలు కలిగిన వాహనాలను సుప్రీంకోర్టు తప్పనిసరి చేసిన నేపథ్యంలో హోండా సంస్థ ఈ కొత్త వాహనాన్ని మార్కెట్‌లోకి తెచ్చింది. 

ఈ కొత్త యాక్టివా 125 మోడల్‌ ప్రారంభ ధరను కంపెనీ రూ.67,490గా సంస్థ నిర్ణయించింది. యాక్టివా 125 అల్లాయ్ వీల్‌ మోడల్‌ ధర రూ.70,990 కాగా, యాక్టివా 125 డీలక్స్‌ ధర రూ.74,990గా కంపెనీ కంపెనీ నిర్ణయించింది.

యాక్టివా కొత్త ఇంజిన్‌ 6500 ఆర్‌పీఎం వద్ద 8.1 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుందని సంస్థ తెలిపింది. గత మోడల్స్‌లానే ఇందులో దీనిని కూడా హోండా ఎకో టెక్నాలజీతో (హెచ్‌ఈటీ) అందిస్తున్నారు. బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన ఈ వాహనంలో బీఎస్‌-4 ఇంధనాన్నీ ఉపయోగించుకోవచ్చు. 

యాక్టివా కొత్త మోడల్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఎల్‌ఈడీ పొజిషినింగ్‌ ల్యాంప్‌ను అమర్చారు. దీంతో పాటు ఇంధనాన్ని నింపే లిడ్‌ను ఈసారి వెనుకవైపు అమర్చారు. కొత్త యాక్టివాలో డిజిటల్‌ ప్యానెల్‌ను అమర్చారు. ఒక్క స్పీడ్‌ మినహా మిగతావన్నీ ఇందులో చూసుకోవచ్చు. ఈ నెల చివరి నాటికి కొత్త స్కూటర్లు రోడ్లపైకి రావడం ప్రారంభిస్తాయని, దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు హోండా తెలిపింది. 

హోండా యాక్టీవా 125 స్కూటర్ మొత్తం మూడు రంగుల్లో ఇది లభ్యమవుతుంది. బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన కొత్త యాక్టివా 125 పరిశ్రమలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో, తదుపరి విప్లవానికి లీడర్‌గా నిలుస్తుందని సంస్థ సీఎండీ మినోరు కటో ఆశాభావం వ్యక్తం చేశారు. మూడేళ్ల వారెంటీని కంపెనీ దీనిని అందిస్తోందన్నారు.