వాహనాల అమ్మకాలు క్షీణిస్తుండటంతో వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించాలని ఆటోమొబైల్‌ పరిశ్రమ డిమాండ్‌ చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తే అమ్మకాలు పెరిగి ఆటో రంగానికి తాత్కాలికంగా ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.

కానీ ప్రభుత్వ రాబడికి మాత్రం గండిపడనుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ ఎంత మేరకు తగ్గాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని సమాచారం. 

ఈ నెల 20 గోవాలో జీఎస్టీ మండలి సమావేశం కాబోతోంది. ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పన్ను రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.

ఇదే జరిగితే కేంద్రానికేకాకుండా రాష్ర్టాలకు కూడా రాబడి తగ్గిపోతుందంటున్నారు. పరిశ్రమపై గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. ఇలాకాకుండా అన్ని విభాగాలకు 18 శాతం జీఎస్టీని విధించాలని పరిశ్రమ కోరుతోంది.

ఇదే జరిగితే ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా వచ్చే రాబడి కనీసం రూ.30,000 కోట్లు తగ్గుతుందని పన్ను అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అన్ని విభాగాలపైనా జీఎస్టీ 10 శాతం తగ్గిస్తే ప్రభుత్వం రూ.40,000 కోట్ల రాబడిని కోల్పోవాల్సి వస్తుందని ఇంతకు ముందు కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది.

విభాగాన్ని బట్టి కార్లు, బైకులపై గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. దీనిపై 1 శాతం నుంచి 22 శాతం వరకు సెస్‌ కూడా ఉంటుంది. జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల కలిగే చిక్కుల గురించి జీఎస్టీ ఫిట్‌మెంట్‌ కమిటీ పరిశీలిస్తోంది.

మరోవైపు రాష్ర్టాలు జీఎస్టీ తగ్గింపును వ్యతిరేకించే అవకాశం ఉండవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. జీఎస్టీని గరిష్ఠ పన్ను రేటు నుంచి 18 శాతానికి తగ్గిస్తే ఆటోమెటిగ్గా 10 శాతం మేరకు తగ్గించినట్టే అవుతుంది. దీని వల్ల సెస్‌ అన్నదే లేకుండా పోతుంది. 

అధిక పన్ను రేటుపైన విధించే సెస్‌ను మాత్రమే జీఎస్టీ పరిహార చట్టం అనుమతిస్తుంది. ఒకవేళ పన్నును తగ్గిస్తే రాష్ర్టాలు పరిహారాన్ని పొందడానికి అవకాశం ఉండదు.

జీఎస్టీ వల్ల రాష్రాలు కోల్పోయే రాబడిని కేంద్రం పరిహారం కింద అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇక జీఎస్టీని తగ్గించినా అమ్మకాలు పెరుగుతాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.11.89 లక్షల కోట్ల రాబడి సమకూరుతుందని బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. అంటే నెలకు సగటున రూ.99,000 కోట్ల రాబడి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు నెలవారీగా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు పై మాటే. అయితే జీఎస్టీని తగ్గిస్తే ఈ రాబడికి గండిపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

అంతేకాక అధిక జీఎస్టీని చెల్లిస్తున్న సిమెంట్‌ వంటి పరిశ్రమలు కూడా జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రంగంలో కూడా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. బిస్కెట్ల పరిశ్రమ కూడా జీఎస్టీ మూలంగా అమ్మకాలపై దెబ్బపడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.