ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని తూర్పు తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఆఫ్రికా ఖండ తీర ప్రాంతాల మీదుగా వీస్తున్న ప్రచండ గాలులు ప్రభావంతో  బంగాళాఖాత సముద్ర తీర ప్రాంతంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో తూర్పు తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

అండబాన్ నికోబార్ దీవులు, తమిళనాడు ప్రాంతాల్లో ఈ అలలు 4 నుండి 5 మీటర్ల ఎత్తున ఎగిసి పడుతూ తీర ప్రాంత ప్రజలకు భయకంపితులను చేస్తున్నాయి. ఇంకా తూర్పున సముద్ర తీరాన్నికలిగి వున్న ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, కేరళలతో పాటు లక్ష ద్వీప్ లలో కూడా ఈ ప్రభావం ఉంటుందని భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం (ఇన్‌కాయిస్‌) తెలిపింది. ఈ రాకాసి అలల ప్రభావం ఈ నెల 25 వ తేదీ అర్థరాత్రి వరకు ఉంటుందని, అప్పటివరకు తీర ప్రాంత ప్రజలు,  మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఇప్పటికే పెనుగాలులతో ఎగిసిపడుతున్న అలల తాకిడికి కేరళలో తీర ప్రాంతంలోని మత్స్యకార నివాసాలు ద్వంసమయ్యాయి. ఇక ఈ అలల తాకిడి  మంగళ, బుధ వారాల్లో అండమాన్ ద్వీపంలో ఎక్కువగా ఉండనుందని ఇన్‌కాయిస్‌ తెలిపింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో సముద్ర జలాలు బాగా ముందుకు వచ్చాయి. దీంతో మత్స్య కారులు ఈ రెండు రోజులు వేటకు వెళ్లకూడదని  ఇన్‌కాయిస్‌ హెచ్చరించింది.