న్యూఢిల్లీ: భారత మార్కెట్లోకి లెక్ట్రో ఈ- సైకిల్‌ను తీసుకు వచ్చేందుకు జపాన్‌కు చెందిన యమహా మోటార్‌ కంపెనీతో హీరో సైకిల్స్‌ జత కట్టింది. యమహా భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను హీరో భారత విపణిలో ఆవిష్కరించింది.

యమహా ఇంజన్‌తో రూపొందించిన లెక్ట్రో ఈహెచ్‌ఎక్స్‌ 20 ధర రూ.1.30 లక్షలు. మెట్రో మార్కెట్లు, ఆరోగ్యకర జీవనం, దేహ ధారుడ్యం అధిక వ్యయం చేసే అధిక ఆదాయ వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ సైకిల్‌ను తెచ్చినట్లు హీరో సైకిల్స్‌ తెలిపింది.

గత ఏడాది హీరో సైకిల్స్‌, యమహా మోటార్‌, మిట్సుయ్‌ అండ్‌ కంపెనీ కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా లెక్ట్రో ఈహెచ్‌ఎక్స్‌20ను విడుదల చేసినట్లు పేర్కొంది. సెంటర్‌ మోటార్‌తో రూపొందించిన తొలి ఎలక్ట్రిక్‌ సైకిల్‌ ఇదని, 3.5 గంటల చార్జింగ్‌తో 60-70 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని తెలిపింది.

రానున్న రోజుల్లో యమహా సిరీస్‌లో లెక్ట్రో విభాగంలో మరిన్ని ఈ-సైకిల్స్‌ను తీసుకురానున్నట్లు హీరో వివరించింది. ట్రిపుల్ సెన్సార్ టార్చ్ టెక్నాలజీ, వేగం, పదునైన పెడలింగ్ ప్రతిస్పందన/సాయం, మెరుగైన శక్తి ఈ సైకిల్ సొంతం.

2023 నాటికి రెండు కోట్ల సైకిళ్లను విక్రయించాలని హీరో సైకిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఎలక్ట్రిక్ సైకిళ్లలో 10 శాతం వాటాను ఆక్రమించాలని తమ లక్ష్యమని హీరో సైకిల్స్ తెలిపింది. యమహా నుంచి ఈ ఎలక్ట్రిక్ బైస్కిల్‌ కోసం డిటాచబుల్ బ్యాటరీ, మిడ్ మౌంటెడ్ మోటార్‌ను అంది పుచ్చుకున్నది.

రెండు కిలోల లోపు బరువు మాత్రమే కల ఈ బ్యాటరీ మూడు నుంచి ఐదు గంటల్లో పూర్తిగా చార్జింగ్ చేసుకున్నది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగల సామర్థ్యం ఈ సైకిల్ సొంతం. హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లు, ఫ్రంట్‌లో హైడ్రాలిక్ సస్పెన్షన్ అమర్చారు.