న్యూఢిల్లీ: బిస్కట్లు, కార్లపై పన్ను రేటు తగ్గింపు డిమాండ్లను జీఎస్టీ ఫిట్‌మెంట్‌ కమిటీ తిరస్కరించింది. జీఎస్టీ కౌన్సిల్‌ కీలక భేటీ గోవాలో శుక్రవారం జరగనున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల రెవెన్యూ అధికారులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌ ఫిట్‌మెంట్‌ కమిటీ సమావేశమై పలు డిమాండ్లను పరిశీలించింది. 

ఆదాయం క్లిష్టంగా ఉన్న ఈ తరుణంలో వీటిపై రేట్లను తగ్గిస్తే కేంద్రం, రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. అన్ని రకాల వాహనాలు, వాహన విడిభాగాలపై జీఎస్టీ రేటు 28 శాతంగా అమలవుతుండగా, అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో 18 శాతానికి వెంటనే తగ్గించాలని పరిశ్రమ బలంగా డిమాండ్‌ చేస్తోంది. 

కానీ, ఆటోమొబైల్ పరిశ్రమ కోరినట్టు రేట్లను తగ్గిస్తే, ఆటోమొబైల్‌పై పన్ను ద్వారా జీఎస్టీ ఖజానాకు వచ్చే రూ.50,000–60,000 కోట్లపై ప్రభావం పడుతుందని ఫిట్‌మెంట్‌ కమిటీ అభిప్రాయపడింది. ఇంకా బిస్కట్లు, బేకరీ ఉత్పత్తులు, బ్రేక్‌ఫాస్ట్‌ సీరియల్స్, పండ్లు, కూరగాయలు, మినరల్‌ వాటర్, రెడీ టూ ఈట్‌ ప్యాకేజ్డ్‌ ఉత్పత్తులు సహా పలు ఇతర ఆహారోత్పత్తులపై జీఎస్టీ పన్ను యధాతథంగా కొనసాగించాలని అభిప్రాయపడింది. 

అయితే హోటల్‌ రంగం డిమాండ్‌ పట్ల మాత్రం జీఎస్టీ ఫిట్మెంట్ ప్యానెల్ సానుకూలంగా స్పందించింది. 18% జీఎస్టీ పరిధిలోకి రూ.12,000 వరకు టారిఫ్‌ను తేవాలని కమిటీ సిఫారసు చేసింది. 

జీఎస్టీ కౌన్సిల్‌ దీనికి ఆమోదం తెలిపితే ఒక రాత్రి విడిది కోసం వసూలు చేసే రూ.12,000 వరకు చార్జీపై 18 శాతమే పన్ను అమల్లోకి వస్తుంది. ప్రస్తుతానికి రూ.7,500 వరకు టారిఫ్‌పైనే 18% జీఎస్టీ రేటు అమల్లో ఉంది. 
ఇక టెలికం సేవలపై 18% రేటును 12%కి తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌కు సైతం ఫిట్‌మెంట్‌ కమిటీ నో చెప్పింది. క్రూయిజ్‌ టికెట్లపై 18 శాతంగా ఉన్న జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్‌ను సైతం తిరస్కరించింది. ఫిట్‌మెంట్‌ కమిటీ చేసిన సిఫారసులపై ఈ నెల 20న గోవాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులూ ఇందులో పాల్గొననున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్ల తగ్గింపు సాధ్యం కాదన్నది రాష్ట్రాల అభిప్రాయంగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే రేట్లను తగ్గిస్తే రాష్ట్రాలకు జీఎస్టీ పరిహార నిధిపై ప్రభావం పడుతుందని అవి భయపడుతున్నాయి. 

2017 నుంచి ఈ ఏడాది ఆగస్ట్‌ వరకు పరిహార నిధి రూ.1.9 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ఇందులో జూలై నాటికే రూ.1.7 లక్షల కోట్లను కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసింది. ఇక కిట్టీలో రూ.23,391 కోట్లే మిగిలి ఉన్నాయి. మరోవైపు జీఎస్టీ వసూళ్లు కూడా రూ.లక్ష కోట్ల స్థాయి దాటని పరిస్థితి నెలకొంది. దీంతో శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.