భువనేశ్వర్: దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఒడిశాలో హృదయం ద్రవించే సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి, ఆమె గొంతు నులిమాడు.ఒడిశాలోని కటక్ జిల్లాలోని ఓ గ్రామంలో ఆ దారుణ సంఘటన చోటు చేసుకుంది. బిస్కట్లు కొనుక్కోవడానికి వెళ్లిన బాలికను ఎత్తుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత పాఠశాల ఆవరణలో ఆమెను పడేసి వెళ్లిపోయాడు. 

తీవ్రమైన గాయాలతో పసిపాప ఆస్పత్రిలో కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటనకు సంబంధించి పాతికేళ్ల వ్యక్తి పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు.బాలిక బిస్కట్లు కొనుక్కోవడానికి దుకాణానికి వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు ఎదురు చూడసాగారు. ఆ సమయంలో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆమె ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు గాలింపు చేపట్టారు. 

ఓ గంట పాటు వెతికిన తర్వాత ఒంటిపై దుస్తులు లేకుండా, స్పృహ తప్పి పడిపోయి బాలిక పాఠశాల ఆవరణలో కనిపించింది. నోటి నుంచి, తల నుంచి రక్తం ధారలై పారుతూ ఉంది. చనిపోయిందని భావించి నిందితుడు ఆమెను వదిలేసి వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్నారు.బాలికను వెంటనే ప్రైవేట్ నర్సింగ్ హోంకు తరలించారు. ఆ తర్వాత కటక్ లోని ఎస్ సిబి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. తల, ముఖం, కంఠం, ఛాతీలపైనే కాకుండా ప్రైవేట్ పార్ట్స్ పై కూడా తీవ్రమైన గాయాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. బాలికకు చెందిన జగన్నాథపురం గ్రామానికే చెందినవాడే ఆ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రతాప్ జెనా ఆస్పత్రికి వచ్చి బాలికను చూశారు. 13 మంది వైద్యులతో కూడిన బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

వారాంతంలో ఒడిశాలో రెండు అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. మైనర్లపై అత్యాచారానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించడానికి వీలుగా ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ అఘాయిత్యాలు ఆగకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. 

ఒడిశాలోని కేంద్రపర జిల్లాలోని ఓ గ్రామంలో నాలుగేళ్ల బాలికపై పొరుగున ఉండే మైనర్ అత్యాచారం చేశాడు. పైకా నదీతీరంలో శుక్రవారం ఓ పాఠశాల విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

మరో సంఘటనలో ఆరో తరగతి విద్యార్థినిని 30 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం కలహండి జిల్లాలో చోటు చేసుకుంది.