కథువా రేప్ పై కొత్త డిప్యూటీ సిఎం షాకింగ్ కామెంట్స్

కథువా రేప్ పై కొత్త డిప్యూటీ సిఎం షాకింగ్ కామెంట్స్

శ్రీనగర్: కథువా అత్యాచార ఘటనపై జమ్మూ కాశ్మీర్ కొత్త డిప్యూటీ ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్య చేశారు. మంత్రివర్గంలో చేరిన గంట వ్యవధిలోనే ఆయన ఆ వ్యాఖ్య చేశారు. దేశాన్ని కుదిపేసిన ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య సంఘటనను చాలా చిన్న సంఘటనగా అభివర్ణించారు. 

రసన చాలా చిన్న సంఘటన అని, అటువంటి సంఘటన మళ్లీ జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని, బాలికకు న్యాయం జరుగతుందని అన్నారు. ప్రభుత్వం అటువంటి చాలా సవాళ్లను ఎదుర్కుంటోందని అన్నారు. కథవా సంఘటనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదని అన్నారు. 

కథువలోని రసన గ్రామంలో బాలికను కిడ్నాప్ చేసి, ఆమెకు మత్తు మందు ఇచ్చి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసి చంపేసిన ఘటనలో అరెస్టయినవారికి మద్దతుగా జరిగిన ర్యాలీలో బిజెపి మాజీ మంత్రులు పాల్గొనడంపై ఇటీవల తీవ్ర నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సిఎం ఆ విధంగా మాట్లాడడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. 

కథువ కేసు నిందితులుగా మద్దతు నిర్వహించిన ఏక్తా మంచ్ ర్యాలీలో పాల్గొన్న కథువా బిజెపి శాసనసభ్యుడు రాజీవ్ జస్రోషియాకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఇది కూడా విమర్శలకు కారణమవుతోంది. 

నిందితులుగా మద్దతు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నందుకు లాల్ సింగ్, చంద్రప్రకాష్ తమ మంత్రిపదవులకు రాజీనామా చేశారు. అయితే వారిద్దరి మాదిరిగా ర్యాలీలో జస్రోషియా ర్యాలీలో ప్రసంగం చేయలేదు గానీ వారి పక్కన ఉన్నారు. 

మంత్రివర్గంలో మార్పులకు కథువా సంఘటనతో సంబంధం లేదని బిజెపి నేత రామ్ మాధవ్ అన్నారు. తమ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుందని, దాంతో మంత్రివర్గంలో మార్పులు చేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావించామని అన్నారు. 

రాష్ట్రీయ స్వయం సేవక్ లో కీలక పాత్ర పోషించిన కవీందర్ గుప్తా (59), నిర్మల్ సింగ్ స్థానంలో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంత్రివర్గంలో డిప్యూటీ సిఎంగా చేరారు. ఆయనతో పాటు బిజెపి చీఫ్ సత్ పాల్ శర్మ, మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page