చిన్నారులను రేప్ చేస్తే ఇక ఉరిశిక్షే

చిన్నారులను రేప్ చేస్తే ఇక ఉరిశిక్షే

ప్రధాని నరేంద్రమోదీ అద్యక్షతన కేంద్ర ప్రభుత్వం శనివారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు వయస్సు కల్గిన చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణదండన విధించేలా కేంద్రం అత్యవసర ఆదేశం తీసుకొచ్చింది. 

కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై పెద్దఎత్తున దుమారం రేగుతోన్న వేళ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టం కింద కనిష్ఠంగా ఏడేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదును విధించే అవకాశం ఉంది. అయితే, లైంగిక చర్య తర్వాత బాధితురాలు మృతి చెందినా, అచేతనంగా మారినా ముద్దాయికి మరణదండన విధించేలా పోక్సో చట్టంలో నిబంధనలు మార్చనున్నారు.

వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. అప్పటివరకూ అమలులో ఉండేలా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి నేరతీవ్రత మేరకు మరణదండన విధించేలా శిక్షాస్మృతిలోని మార్పులు చేసేందుకు కేంద్ర న్యాయశాఖ యోచిస్తున్నట్టు ఓ కేసుకు సంబంధించి నిన్న సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది.

పోక్సో చట్టానికి సంబంధించిన పూర్తి సవరణలపై చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ అత్యవసర ఆర్డినెన్స్‌ను ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపించే అవకాశం ఉంది.అంతేకాకుండా.. సత్వర న్యాయం కోసం ఫాస్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos