ఒక ఎఎస్సై అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంఘటన హైదరాబాద్‌లోని రామంతాపూర్ లో చోటుచేసుకుంది. అయితే ఆయన ప్రమాదవశాత్తు మృతిచెందారా? లేక ఎవరైనా హత్య చేసి ప్రమాదంగా సృష్టించారా? లేదా అతడే ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్‌లో  హనుమంతప్ప  అనే వ్యక్తి ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఇతడు రామంతాపూర్ లోని వెంకటరెడ్డి నగర్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఇవాళ ఉదయం ఆయన ఇంటి‌ మొదటి‌ అంతస్తుపై నుంచి పడి చనిపోయాడు. ఆయన మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆయన కుటుంబసభ్యులను అడిగి ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు.

కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...హనుమంతప్ప గత కొంత కాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నాడు. ఈ క్రమంలో ఇలా జరిగిందని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం ఆయన మరణం ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా ఆత్మహత్య గానీ హత్య గానీ జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.