కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, నటుడు అంబరీష్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మండ్యా నుంచి పోటీ చేసేందుకు కూడా ఆయన విముఖత చూపించారు. వయోభారం, అనారోగ్యమే కారణంగా ఎన్నికల ప్రచారంలోనూ తాను పాల్గొననని అంబరీష్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అంబరీష్ గుడ్‌బై చెప్పడటంతో చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని బరిలోకి దింపింది.
 
అభ్యర్థిగా పేరు ఖరారు చేసిన తర్వాత కూడా అంబరీష్ బీఫామ్ అందుకునేందుకు విముఖత చూపించారు. షరతులు విధిస్తూ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానంటేనే బీఫామ్ తీసుకుంటానని అంబరీష్ చెప్పారని కూడా ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ పెద్దలు వరుసగా సమావేశమైనా అంబరీష్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. రాజకీయాలకు గుబ్‌బై చెబుతూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే.. సిద్థారామయ్యతో అంబరీష్ కి పడటం లేదని అందుకే.. రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తన బదులు తన భార్య సుమలతకు టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన కోరారట. అందుకు అదిష్టానం అంగీకరించకపోవడంతో.. అంబరీష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.