టీం ఇండియా క్రికెటర్ షమీకి బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ని షమీకి ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే..  షమీకి పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తనను హింసింస్తున్నాడంటూ ఆయన భార్య హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. షమీ మ్యాచ్ ఫిక్సింగ్ కి కూడా పాల్పడ్డాడంటూ ఆమె ఆరోపించింది. ఆమె ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ షమీ కాంట్రాక్టును రద్దు చేసింది. అంతేకాకుండా ఈ విషయంపై విచారణ కూడా చేపట్టింది. కాగా.. ఈ విచారణలో షమీ నిర్ధోషి అని తేలింది.  షమీ ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడలేదని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం తేల్చింది.

దీంతో.. తిరిగి షమీకి బీసీసీఐ కాంట్రాక్టు అప్పగించింది. ‘‘ఏసీయూ అధినేత నీరజ్‌ కుమార్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ)కి నివేదిక అందించాడు. ఆ నివేదిక ఆధారంగానే.. బీసీసీఐ అవినీతి నిరోధక నియమావళి కింద షమిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని సీఓఏ నిర్ణయించింది. బీసీసీఐ ఇక అతడికి ఇవ్వాల్సిన గ్రేడ్‌ ‘బి’ కాంట్రాక్టును ఇవ్వొచ్చు’’ అని ఓ ప్రకటనలో సీఓఏ చెప్పింది. షమి వ్యక్తిగత జీవితం జోలికి పోమని బోర్డు ముందు నుంచీ చెబుతూ వస్తోంది. ‘‘ఇది షమికి, భారత క్రికెట్‌కు శుభవార్త. అతడిపై అవినీతి మచ్చ తొలగింది. అతడు అంకితభావం ఉన్న ఆటగాడు. షమి ఎలాంటి తప్పూ చేయలేదని విచారణలో తేలడం బీసీసీఐకి సంతోషాన్నిస్తోంది’’ అని బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా అన్నాడు.