షాకింగ్.. ఏటీఎంలలో దొంగనోట్లు

షాకింగ్.. ఏటీఎంలలో దొంగనోట్లు

దేశవ్యాప్తంగా నగదు కొరత ఏర్పడింది. చాలా రాష్ట్రాల్లో నగదు లభించక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు అరకొరగా పనిచేస్తున్న ఏటీఎంలలో నకిలీ నోట్ల హంగామా  వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది.  తాజాగా ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో నకిలీ రూ.500నోట్లు  ఆందోళనలో పడేశాయి. సుభాష్‌ నగర్‌లో  ఏర్పాటు చేసిన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఏటీఎంలో నకిలీ 500 రూపాయల  నోట్లు దర్శనమిచ్చాయి.  'చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా', 'భారతీయ మనోరంజన్‌ బ్యాంకు', 'చురాన్ లేబుల్' పేరుతో ఉ‍న్న ఈ నకిలీ కరెన్సీ నోట్లు   స్థానికుల్లో కలవరం పుట్టించాయి.
 
అశోక్‌ కుమార్‌  పాథక్‌ అనే  రిటైర్డ్‌ ఉద్యోగికి ఆదివారం ఉదయం ఈ షాకింగ్‌ ఘటన ఎదురైంది. ఏటీఎం నుంచి 4500 రూపాయలను విత్‌ డ్రా చేయగా  దాంట్లో ఒక నోటుపై 'చిల్డ్రన్ బ్యాంక్ అఫ్ ఇండియా'  రాసి వుండటాన్ని ఆయన గుర్తించారు.  ఈయనతో పాటు మరికొందరికికూడా ఇలాంటి  అనుభవమే ఎదురుకావడంతో టోల్‌ఫ్రీ నెంబర్‌ ద్వారా బ్యాంకు వారికి ఫిర్యాదు చేశారు.

అయితే తాము అన్ని ఏటీఎంలలో  కరెన్సీ నోట్లను తనిఖీ చేశామని, ఎలాంటి నకిలీ  నోట్లను  తాము గుర్తించలేదని  బ్యాంకు  మేనేజర్ బచన్ షా చెప్పారు.   సంబంధిత ఏజెన్సీపై  చర్య తీసుకోవాలని కలకత్తాలోని తమ  ప్రధాన కార్యాలయానికి ఒక నివేదికను పంపినట్టు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై సమాజ్‌వాద్‌ పార్టీ  బీజేపీ ప్రభుత్వంపై  విమర్శలు గుప్పించింది.. దేశంలోని  చాలా ఏటీఎంలు నకిలీ కరెన్సీ నోట్లను పంపిణీ చేస్తున్నాయని  ఎస్‌పీ జిల్లా కార్యదర్శి ప్రమోద్ యాదవ్  ఆరోపించారు

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos