Asianet News TeluguAsianet News Telugu

నేల చూపులే: 2% తగ్గిన ప్యాసింజర్‌ వాహనాల సేల్స్

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి, నిధుల కొరత వంటి అంశాలు ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో వాహనాల విక్రయాలు రెండు శాతం తగ్గుదలకు కారణమని భావిస్తున్నారు. 

Auto sales sputter in April amid liquidity squeeze, poll worries
Author
new delhi, First Published May 9, 2019, 10:32 AM IST

న్యూఢిల్లీ: గత నెల ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) రిటైల్‌ విక్రయాలు 2,42,457 యూనిట్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. గతేడాది (2018) ఇదేకాలానికి నమోదైన పీవీ అమ్మకాలతో పోల్చితే రెండు శాతం తగ్గినట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఫాడా) పేర్కొంది.

ద్విచక్ర వాహన అమ్మకాలు 9% తగ్గి 12,85,470 యూనిట్లు నమోదయ్యాయి.  వాణిజ్య వాహనాల సేల్స్‌ 16 శాతం క్షీణించి 63,360 యూనిట్లుగా నిలిచాయి. 

గతనెలలో త్రిచక్ర వాహనాల సేల్స్ 13% తగ్గి 47,183 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం అమ్మకాలు 16,38,470 యూనిట్లుగా తెలిపింది. గతేడాదిలో నమోదైన 17,86,994 యూనిట్లతో పోల్చితే 8% తగ్గుదల రికార్డైంది.

దీనిపై ఫాడా అధ్యక్షుడు హర్షరాజ్‌ కాలే మాట్లాడుతూ ‘గతేడాది ఏప్రిల్‌లో హైబేస్‌ కారణంగా ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు ప్రతికూల వృద్ధిని నమోదుచేశాయి. సమీప కాలంలో సానుకూల అంశాలు లేనందున.. వచ్చే 8–12 వారాల్లో ప్రతికూలతకే అవకాశం ఉంది. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, ఆశాజనకంగా వర్షాలు పడే అవకాశాలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు ఆదుకోవచ్చు. పేరుకుపోయిన నిల్వలు మాత్రం డీలర్లకు భారం అనే చెప్పాలి’ అని అన్నారు. 

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ, అనిశ్చితి ఫలితంగా దేశీయంగా ఆటోమొబైల్ సేల్స్ 8% శాతం అంటే 16.4 లక్షల వాహనాల విక్రయాలు తగ్గాయి. శరవేగంగా కార్లు, మోటారు సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు పడిపోయాయి. మారుతి సుజుకి సేల్స్ 19 శాతం, హ్యుండాయ్ మోటార్స్ సేల్స్ 10, మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు 9 శాతం తగ్గుముఖం పట్టాయని ఫాడా నివేదించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios