Asianet News TeluguAsianet News Telugu

మాంద్యం గుప్పిట్లో ‘ఆటో’ విలవిల.. వరుసగా పదో నెలా నేల చూపులే!

దేశీయ ఆటోమొబైల్ రంగం ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆగస్టు నెలలోనూ ఆగస్టులోనూ వాహన విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా 23.55 శాతం క్షీణత నమోదైంది. గతేడాదితో పోల్చితే తగ్గిన 5.61 లక్షల యూనిట్ల అమ్మకాలు సాగాయి.
 

August auto sales down 23 Percentage across board
Author
New Delhi, First Published Sep 10, 2019, 11:21 AM IST

ఆర్థిక మాంద్యం దెబ్బకు ఆటో రంగం అతలాకుతలం అవుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమన పరిస్థితులు వాహన విక్రయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. 

మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఆగస్టు ఆటో అమ్మకాలు క్షీణించాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తెలిపింది. సియామ్ 1997-98 నుంచి దేశీయ హోల్‌సేల్ వాహన విక్రయాలను నమోదు చేస్తున్నది.

అప్పట్నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ లేనివిధంగా అమ్మకాలు గత నెల పతనమైనట్లు సోమవారం తెలిపింది. అన్ని విభాగాల్లోనూ సేల్స్ పడిపోయినట్లు స్పష్టం చేసింది. ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు కలిపి ఆగస్టు నెలలో జరిగిన అమ్మకాలు 18,21,490 యూనిట్లుగా నమోదయ్యాయి. 

గతేడాది ఆగస్టులో ఇవి 23,82,436 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో ఈసారి 23.55 శాతం దిగజారినైట్లెంది. ఈ ఏడాది జూలైలో మొత్తం దేశీయ ఆటో అమ్మకాలు దాదాపు 19 ఏండ్ల కనిష్ఠానికి పతనమైన విషయం తెలిసిందే.

నిరుడు జూలైతో చూస్తే 18.71 శాతం దిగజారి 22,45,223 యూనిట్ల నుంచి 18,25,148 యూనిట్లకు పరిమితమయ్యాయి. హోల్‌సేల్ విక్రయాల పరిస్థితి దారుణంగా ఉన్నా.. రిటైల్ అమ్మకాలు కాస్త మెరుగ్గా ఉండటం ఆటో రంగానికి ఊరటనిస్తున్నది.

గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టులో 16,00,376 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు 16,69,751 యూనిట్లుగా ఉన్నాయి. 4.15 శాతమే తక్కువగా నమోదయ్యాయి.

ప్యాసింజర్ వాహన విక్రయాలు సైతం 2,56,662 యూనిట్ల నుంచి 2,38,357 యూనిట్లకు తగ్గాయి. దీంతో 7.13 శాతం క్షీణించిరట్లయింది. టూవీలర్ అమ్మకాలు 3.4 శాతం పడిపోయాయి.

మందగమనం నేపథ్యంలో వాహన పరిశ్రమను ఆదుకునేందుకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ఆటో రంగం డిమాండ్ చేస్తున్నది.

ఈ నెల 20న గోవాలో జీఎస్టీ మండలి సమావేశం జరుగుతున్నది. దీంతో వాహనాలపై జీఎస్టీని కనీసం 10 శాతమైనా కోత పెట్టాలని ఆయా సంస్థలు, సియామ్ కోరుతున్నాయి.

విద్యుత్ ఆధారిత వాహన పరిశ్రమకు ఇచ్చినట్లుగానే ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై జీఎస్టీని 5 శాతానికి దించిన సంగతి విదితమే.

వాహనాలపై 12 నుంచి 5 శాతానికి, చార్జర్లపై 18 నుంచి 5 శాతానికి తగ్గించారు. స్థానిక సంస్థలు అద్దెకు తీసుకునే ఎలక్ట్రిక్ బస్సులపైనా పన్ను మినహాయింపులిచ్చారు.

ఆటో రంగం డిమాండ్‌ను జీఎస్టీ మండలిలోని జీఎస్టీ అధికారులతో ఏర్పడిన ఫిట్‌మెంట్ కమిటీ వ్యతిరేకిస్తున్నది. ఆటో పరిశ్రమ సంక్షోభానికి జీఎస్టీ కారణం కాదని, జీఎస్టీని తగ్గిస్తే.. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం పోతుందని అంటున్నది.

ఒకవేళ కేంద్రం తమ ఆదాయాన్ని వదులుకోవాలనుకున్నా.. తాము మాత్రం సిద్ధంగా లేమని రాష్ర్టాల తరఫున కేరళ ఆర్థిక మంత్రి థామస్ తేల్చిచెప్పారు. కాగా, జీఎస్టీని తగ్గిస్తే ఏటా రూ.50 వేల కోట్ల ఆదాయం పోనున్నది.

అయితే భారతీయ ఆటో పరిశ్రమ నుంచి మొత్తం ప్రతి సంవత్సరం రూ.3 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నది. దీంతో రాబోయే సమావేశంలో జీఎస్టీపై జీఎస్టీ కౌన్సిల్ ఆటో రంగానికి అనువైన నిర్ణయం తీసుకోవచ్చన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

ఆటోమోటివ్ రంగంలో వేలాది ఉద్యోగాలు పోతున్నాయని బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి, ఈ దుస్థితి నుంచి వాహన పరిశ్రమను కాపాడాలని కోరారు.

దేశీయ తయారీ రంగంలోని ఉద్యోగాల్లో 50 శాతం ఆటోమోటివ్ రంగానివేనన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆగస్టు నెల వాహన విక్రయాలు మునుపెన్నడూ లేనివిధంగా క్షీణించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను ఉద్దేశించి పైవిధంగా షా ట్వీట్ చేశారు.

ఆటోమొబైల్ తయారీ రంగంలో 15వేల కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున పడగా, దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో 2.8 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. మరోవైపు వాహన విక్రయాలు క్షీణించడం వరుసగా ఇది 10వ నెల.

గతేడాది నవంబర్ నుంచి ఈ పతనం కనిపిస్తున్నది. నెలనెలా పడిపోతూ.. ఆగస్టులో రికార్డు స్థాయికి దిగజారాయి. గత నెల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 31.57 శాతం క్షీణించాయి. నిరుడితో పోల్చితే 2,87,198 యూనిట్ల నుంచి 1,96,524 యూనిట్లకు తగ్గాయి. 

దీంతో అంతకుముందు నెల జూలైలో నమోదైన 30.98 శాతం కంటే ఎక్కువగా పడిపోయినైట్లెంది. మార్కెట్ లీడర్ మారుతి సుజుకీ అమ్మకాలు 36.14 శాతం పతనమై 93,173 యూనిట్లకు తగ్గాయి.

హ్యుందాయ్ 16.58 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 31.58 శాతం క్షీణతలను చవిచూశాయి. ద్విచక్ర వాహనాల విషయానికొస్తే.. ఈ ఆగస్టులో 22.24 శాతం పడిపోయాయి. 

నిరుడు 19,47,304 యూనిట్లుగా ఉంటే, ఈసారి 15,14,196 యూనిట్లుగా ఉన్నాయి. మోటర్‌సైకిల్ అమ్మకాలు 22.33 శాతం, స్కూటర్ విక్రయాలు 22.19 శాతం క్షీణించాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు సైతం 38.71 శాతం దిగజారి 84,668 యూనిట్ల నుంచి 51,897 యూనిట్లకు క్షీణించాయి.

ఇక డిమాండ్ లేకపోవడంతో వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్.. దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్లాంట్లలో ఈ నెల ఉత్పత్తికి విరామం ఇవ్వనున్నట్లు సోమవారం ప్రకటించింది. భారీ, తేలికపాటి వాణిజ్య వాహనాలను అశోక్ లేలాండ్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. 

అయితే మార్కెట్‌లో నెలకొన్న మందగమన పరిస్థితుల మధ్య వివిధ ప్లాంట్లలో వాహనాల తయారీని కొద్ది రోజులపాటు ఆపేస్తామని ఈ హిందుజా గ్రూప్ ప్రతిష్ఠాత్మక సంస్థ తెలియజేసింది.

ఎన్నోర్ కర్మాగారంలో 16 రోజులు, హోసూర్‌లో 5 రోజులు, అల్వార్, బాంద్రాల్లో 10 రోజుల చొప్పున, పంత్‌నగర్‌లో 18 రోజులు ప్లాంట్లను మూసేస్తున్నట్లు అశోక్ లేలాండ్ ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios