ఆశారాం: కుటీరంతో మొదలై రూ.10 వేల కోట్ల సామ్రాజ్యానికి...

ఆశారాం: కుటీరంతో మొదలై రూ.10 వేల కోట్ల సామ్రాజ్యానికి...

అహ్మదాబాద్: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు చిన్న కుటీరంతో మొదలై రూ.10 వేల కోట్ల మేర ఆస్తులను సమకూర్చుకున్నాడు. 

నాలుగు దశాబ్దాల వ్యవధిలో ఆయన ఓ ప్రముఖ వ్యాపారవేత్త స్థాయిలో సంపాదించారు. 1970 దశకం ప్రారంభంలో సాబర్మతి నదీ తీరాన చిన్న కుటీరంతో తన బోధనలు ప్రారంభించాడు. దేశ, విదేశాల్లో 400 ఆశ్రమాలను స్తాపించాడు. 

అత్యాచారం కేసులో 2013లో అరెస్టు చేసిన తర్వాత పోలీసులు మోతేరా ప్రాంతంలోని ఆశారాం ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. వారు స్వాధీనం చేసుకున్న పత్రాలను బట్టి 77 ఏళ్ల వయస్సు గల ఆశారాం పది వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఆయన స్వాధీనంలో ఉన్న భారీ స్థలాల మార్కెట్ విలువ లెక్కిస్తే అది మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. 

రేప్ కేసు నమోదైన తర్వాత ఆయనపై అక్రమ భూకబ్జా, చేతబడి వంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయన అధికార వెబ్ సైట్ ను బట్టి ఆశారాం  పాకిస్తాన్ లోని సింధు ప్రొవిన్స్ లో గల బేరానీ గ్రామంలో 1941లో జన్మించాడు. అతని అసలు పేరు అసుమాల్ శిరుమలానీ.

దేశ విభజన తర్వాత తల్లిదండ్రులతో పాటు అహ్మదాబాద్ కు తరలివచ్చాడు. మణినగర్ లోని పాఠశాలలో నాలుగో తరగతి వరకు చదువుకున్నాడు. తన పదేళ్ల వయస్సులో తండ్రిని పోగొట్టుకున్నాడు. దాంతో చదవుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. 

ఆ తర్వాత చిల్లరమల్లర పనులు చేస్తూ యవ్వన దశలో ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా హిమాలయాలకు చేరుకున్నాడు. అక్కడ తన గురువు లీలాషా బాపును కలులుకున్నాడు. 

ఆ గురువే ఆయనకు 1964లో ఆశారాం అనే పేరు పెట్టాడు. సొంత దారిలో పయనిస్తూ ప్రజలకు మార్గదర్శకత్వం వహించాలని సూచించాడు. ఆశారాం 1970 దశకం ప్రారంభంలో అహ్మదాబాద్ తిరిగి వచ్చి మొతేరా ప్రాంతంలోని సబర్మతీ తీరంలో కుటీరం ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక బోధనలు ప్రారంభించాడు. 

ఆధ్యాత్మిక గురువుగా ఆయన ప్రయాణం 1972లో మోక్ష కుటీరం ఏర్పాటుతో ప్రారంభమైంది. సంత్ ఆశారాం బాపునకు ప్రజాదరణ పెరగడంతో చిన్న కుటీరం కాస్తా ఆశ్రమంగా మారింది. 

ఆశారాం లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు నారాయణ సాయి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. కూతురు భారతి దేవి. ఆశారాం ఆశ్రమం గురుకులంలో ఉంటున్న ఇద్దరు బంధవులు దీపేష్, అభిషేక్ వాఘేలా 2008లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆశారాం కష్టాలు అక్కడి నుంచి మొదలయ్యాయి.  

ఈ హత్య కేసులో రాష్ట్ర సిఐడి 2009లో ఏడుగురు ఆశారాం శిష్యులపై కేసు నమోదు చేసింది. చేతబడి చేసి వారిద్దరని చంపేశారని సమీప బంధువుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. అసలు కష్టాలు 2013లో ప్రారంభమయ్యాయి. 

సూరత్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు లైంగిక దోపిడీకి చెందిన ఆరోపణలు చేయడంతో ఆశారాం, ఆయన కుమారుడు నారాయణ సాయి కష్టాల్లో పడ్డారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos