అమృత కేసు: జయలలిత రక్తనమూనాలపై అపోలో ట్విస్ట్

Apollo says no blood samples of Jayalalithaa
Highlights

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రక్తనమూనాలపై అపోలో ఆస్పత్రి చేతులెత్తేసింది.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రక్తనమూనాలపై అపోలో ఆస్పత్రి చేతులెత్తేసింది. జయలలితకు సబంధించిన జీవసంబంధ నమూనాలు ఏవీ తమ వద్ద లేవని అపోలో మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. 

జయలలిత రక్తనమూనాలను సమర్పించాలని హైకోర్టు బుధవారంనాడు అపోలో ఆస్పత్రికి ఆదేశాలు జారీ చేసింది. బెంగుళూరుకు చెందిన అమృత సారథి అనే యువతి తాను జయలలిత కూతురిని అంటూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో భాగంగా న్యాయస్థానం ఆ ఆదేశాలు జారీ చేసింది. 

తాను జయలలిత కూతురినంటూ 37 ఏళ్ల అమృత మొదట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాను జయలలిత కూతురిని అవునో, కాదో తేల్చడానికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని ఆమె కోరింది. 

నిరుడు నవంబర్ లో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేస్తూ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జయలలిత రక్తనమూనాలను సమర్పించాలని హైకోర్టు అపోలో ఆస్పత్రిని ఆదేశించింది. అందుకు కొంత సమయం ఇవ్వాలనే అపోలో విజ్ఢప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. 

జయలలిత ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఆ వాదనను ముందుకు తెచ్చారని ఆరోపిస్తూ ఆ పిటిషన్ ను కొట్టేయాలని అన్నాడియంకె యువజన విభాగం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. వాదోపవాదాలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది.

తదుపరి విచారణను హైకోర్టు జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. జయలలిత 2016 సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆస్పత్రిలో చేరారు. అదే సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన ఆమె మరణించారు. 

loader