టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ప్రజలను ఆకట్టుకోవడంలో,  ఎక్కడున్నా తనదయిన శైలిని ప్రదర్శించడంలో మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. జనంతో మమేకం కావడంలో తెలుగు నాట ఆయనకు మించిన రాజకీయ నేత మరొకరు లేరు. జనంలో కలిసేపోయేందుకు ఎన్నివేషాలు వేసే వారో లెక్కలేదు. బైక్‌పై జామ్మని దూసుకెళ్లాడు, పబ్లిక్‌లో సిగెరట్ విలాసంగా  కాల్చడం, చీర సింగారించుకోవడం, మీసాలు ప్రదర్శించడం...పాటలు పాడటం, డ్యాన్స్ వేయడం...ఇవన్నీ కొన్ని అవతారాలు మాత్రమే...
 

ఎవరినీ లెక్క చేయకపోవడం ఆయనకు మరొక నైజం. తిట్టడం మొదలుపెడితే కూడా అంతే, ఎవరూసాటిరారు. ఆయన కనిపించక పోతే, రాజకీయ సందడే ఉండదు. అలాంటి వివేకా.. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం.. రాజకీయాలకు పెద్ద లోటు అనే చెప్పవచ్చు. 

1950, డిసెంబర్‌ 25న ఆనం వివేకా జన్మించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయనాయకుడిగా ఆనం వివేకా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా, చైర్మన్‌గా అలాగే చైర్మన్ల సంఘం ఏపీ అధ్యక్షుగా ఆయన పనిచేశారు. ఏ పదవిని అలంకరించినా ఆ పదవికే వన్నెతెచ్చిన ఆనం ఇక లేరనే విషయాన్ని నెల్లూరు జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీనిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీరుస్తూ ప్రజల్లో ఒకరిగా కలిసిపోయిన వ్యక్తి ఆనం వివేకా.

 

ఆనం వివేకా అతి చిన్న వయసులోను రాజకీయాల్లోకి ప్రవేశించారు. సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన ఆనం వివేకా అంచెలంచెలుగా ఎదుగుతూ మూడు సార్లు ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఆనం ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డి పాటు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరారు.

ఇటీవల అనారోగ్యంతో ఆనం వివేకా హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, సోమిరెడ్డి కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కూడా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.