సినీ నటుడు సాయి కమార్.. బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.  ఆయన మంగళవారం బీజేపీ అభ్యర్ధిగా చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత బీజేపీ అధిష్టానం ఆయనకు బీ-ఫాం ఇవ్వకపోవడంతో ఆయనకు టికెట్ దక్కుతుందా లేదా అన్న సందిగ్ధం ఏర్పడింది.

ప్రధాని నరేంద్ర మోడీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సాయికుమార్ తప్పు పట్టారు. మోడీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకుని వేడుకుంటానని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారానికి బాలకృష్ణను ఆహ్వానించడం లేదని చెప్పారు.

ఓ దశలో సాయికుమార్ అనుచరులు ఆందోళనకు కూడా దిగారు. బెంగళూరులోని డాలర్స్ కాలనీలోగల యడ్యూరప్ప నివాసం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అంతేగాక యడ్యూరప్ప ఇంటిముందు ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసుకుని ఆయన ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉండగా సాయికుమార్ అనుచరులతో యడ్యూరప్ప చర్చలు జరిపారు.

సాయికుమార్‌కు టికెట్ కేటాయిస్తున్నామని, అయితే... కొన్ని కారణాల వల్ల ఆయన పేరు ప్రకటించలేక పోతున్నామని పేర్కొనడంతో అనుచరులు శాంతించారు. కాగా... స్థానికుడైన సి. కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు సాయికుమార్‌కే బీ-ఫాం ఇవ్వడంతో మంగళవారం ఆయన తన నామినేషన్‌ను దాఖలు చేశారు.