న్యూఢిల్లీ: క్విడ్ కార్ల ధరలను మూడు శాతం వరకు పెంచుతున్నట్లు ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట: ప్రకటించింది. మూలధన వ్యయం పెరుగడం వల్లే కారు ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. 

ఈ పెరిగిన ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సంస్థ రూ.2.66 లక్షల నుంచి మొదలై రూ.4.63 లక్షల లోపు ధర కలిగిన క్విడ్ మోడల్ కార్లను దేశవ్యాప్తంగా రెనాల్ట్ విక్రయిస్తున్నది. సంస్థ ఇటీవల క్విడ్ విభాగ కార్లను అప్‌గ్రేడ్ చేసింది.

ముఖ్యంగా భద్రత ప్రమాణాలను మెరుగుపరుచడానికి ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ వంటివి ఏర్పాటు చేసింది. గతవారంలో టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహనాల ధరను రూ.25 వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అంతకుముందు టయోటా కిర్లోస్కర్, జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థలు తమ కార్ల ధరలు పెంచేశాయి.

కవాసాకీ మోటార్ సైకిళ్లలో సెలెక్టెడ్ మోడల్స్ ధరలు కూడా

జపాన్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ కవాసాకీ కొన్ని సెలెక్టెడ్ మోటార్ సైకిళ్ల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. విదేశీ మారక ద్రవ్యంలో తరుచుగా మార్పులు, ముడి సరుకు ధర పెరిగిందని కవాసాకీ మోటార్స్ తెలిపింది. కనీసం ఏడు శాతం ధర పెరుగుతుందని అంచనా వేసింది. 

ధరలు పెరుగనున్న మోడల్ బైక్‌ల్లో కవాసాకీ నింజా 400, కవాసాకీ నింజా 650, కవాసాకి జడ్ 650, కవాసాకీ వెర్స్యేస్ 650, కవాసాకీ వుల్కాన్ ఎస్ మోడల్ ధరలు ఏడు శాతం పెరుగుతాయి. మరికొన్ని మోడళ్ల మోటారు సైకిళ్ల ధరలు ఐదు శాతం ధరలు తగ్గుతాయి.

 పేరొందిన కవాసాకీ నింజా 1000, కవాసాకీ నింజా జడ్ ఎక్స్ -10 ఆర్, కవాసాకీ వెర్స్యేస్ 1000 బైక్‌ల ధరలు ఐదు శాతం పెరుగుతాయని, కవాసాకీ నింజా 300 ధర కూడా పెరగనున్నదని తెలిపింది. రమారమీ కవాసాకి నింజా 650 బైక్ ధర రూ.5.49 లక్షల నుంచి రూ.5.87 లక్షలకు అంటే రూ.38 వేలు పెరుగుతుంది. 

కవాసాకీ వెర్స్యేస్ 1000 మోడల్ బైక్ ధర రూ.53 వేలు పెరిగి, రూ.10.69 లక్షల నుంచి రూ.11.22 లక్షలకు చేరనున్నట్లు తెలిపారు. ధరల పెంపుదల వివరాలు కవాసాకి వెబ్‌సైట్‌లో ప్రచురిస్తామని తెలిపింది.