నెల్లూరు: ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనులను గాలికొదిలేసిందన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వ్యాఖ్యలపై నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. టిడిపి వాళ్లలా తమకు ఇరిగేషన్ పనుల్లో పర్సంటేజీల రూపంలో డబ్బులు దోచుకోవడం రాదని ఎద్దేవా  చేశారు.  అందువల్లే పోలవరం కోసం కేటాయించిన నిధులను రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేసి ప్రభుత్వంపై భారం తగ్గించినట్లు మంత్రి అనిల్ పేర్కొన్నారు. 

ఎట్టిపరిస్థితుల్లో 2021 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని  అన్నారు. టిడిపి హయాంలో కేవలం 30శాతం పనులు కూడా జరగలేదని... కానీ 70శాతానికి పైగా ఇప్పటికే పూర్తి చేశామని వారు చెప్పుకోవడం విడ్డూరంగా వుంటుందన్నారు. 

రాష్ట్ర విభజన తర్వాత టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లలో పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని మంత్రి నిలదీశారు. ఐదేళ్ల వారి పాలనలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పని ఒక్కటేనా ఉందా..? అని ప్రశ్నించారు. 

read more  వైసిపిపైనే కాదు వారిపైనా ప్రతీకారం తీర్చుకుంటా... లేదంటే రాజకీయ సన్యాసమే: చంద్రబాబు సవాల్

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్ట్స్ అన్ని గత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పుణ్యమే అని  ప్రతిఒక్కరికి తెలుసన్నారు. ఎక్కడ తన బండారం బయట పడుతుందో అన్న భయంతోనే ఉమా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని అన్నారు. ఇక మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఉత్తర కుమారుడు అనే పాత్రకు సరిగ్గా సరిపోతాడని మంత్రి ఎద్దేవా చేశారు. 

ఎవరిని చంపి ఉమా రాజకీయాల్లోకి వచ్చాడో విజయవాడ ప్రజలందరికి తెలుసన్నారు అనిల్ కుమార్.  దోపిడీకి పేటెంట్ రైట్స్ టీడీపీ వారికే సొంతమని...  వారిలాగా ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకోవడం తమకు రాదన్నారు. రాష్ట్ర అభివృద్ది, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.  

read more  రాజధాని మహిళలను గోళ్లతో రక్కి, గిచ్చి...పోలీసుల కర్కశత్వం...: వర్ల రామయ్య

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సుజల స్రవంతి ప్రాజెక్టుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు.