కుమారస్వామిపై ధ్వజమెత్తిన యడ్యూరప్ప: అసెంబ్లీ నుంచి బిజెపి వాకౌట్

yeddyurappa on Kumaraswamy trust vote in Vidhan Soudha
Highlights

కాంగ్రెసు, జెడిఎస్ లది అపవిత్ర పొత్తు అని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప విమర్శించారు.

బెంగళూరు: ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస పరీక్షపై ఓటింగు జరగకముందే బిజెపి సభ్యులు వాకౌట్ చేశారు. దాంతో కుమారస్వామి విశ్వాస పరీక్షలో నెగ్గడానికి ఏ విధమైన ఆటంకాలు కూడా లేకుండాపోయాయి.

కాంగ్రెసు, జెడిఎస్ లది అపవిత్ర పొత్తు అని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప విమర్శించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో ప్రతిపాదించిన విశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటూ ఆయన శుక్రవారం ఆ విమర్శ చేశారు. అధికారం కోసం కుమారస్వామి దిగజారారని అన్నారు.

గతంలో కుమారస్వామితో కలిసి పనిచేసినందుకు బాధపడుతున్నానని అన్నారు. కాంగ్రెసు, జెడిఎస్ లను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. కాంగ్రెసు, జెడిఎస్ ప్రజల తీర్పును అవహేళన చేశాయని అన్నారు. కాంగ్రెసు నేత డికె శివకుమార్ తాను చేసిన పనికి ఎప్పుడైనా పశ్చాత్తాప పడుతారని అన్నారు. 

గతంలో కుమారస్వామికి మద్దతు ఇచ్చినందుకు కర్ణాటక ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు. 37 సీట్లు వచ్చిన జెడిఎస్ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. కుమారస్వామి చరిత్ర అంతా తనకు తెలుసునని అన్నారు. కాంగ్రెసు అధిష్టానం కుమారస్వామిని చర్చలకు పిలిచి సిద్ధరామయ్యను అవమానించిందని ఆయన వ్యాఖ్యానించారు.

150 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన పార్టీకి ముఖ్యమంత్రి పదవి దక్కడం విచిత్రమని అన్నారు. అధికారం కోసం కాంగ్రెసు, జెడిఎస్ ఎంతకైనా తెగిస్తాయని అన్నారు. తన పోరాటం కాంగ్రెసుపై కాదని అవినీతిపరులైన దేవెగౌడ, కుమారస్వామిలపైనే అని చెప్పారు. కాంగ్రెసులో ఉన్నంత కాలం డికె శివకుమార్ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. యడ్యూరప్ప వ్యాఖ్యలపై రేవణ్ణ, శివకుమార్ అభ్యంతరం తెలిపారు. 

loader