బెంగళూరు: సీఏఏకు వ్యతిరేకంగా కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో అమూల్య లియోనా అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసింది. సభలో ఎంఐఐ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తున్న అమూల్యను ఆయన ఆపేశారు. ఆ సంఘటనను ఆయన ఖండించారు. 

గురువారం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో అమూల్య పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసింది. ఆమెను పోలీసులు అరెస్టు చేసారు. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి, జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. ఈ కేసు సోమవారం విచారణకు రానుంది.

 

అమూల్యపై సూమోటాగా కేసు నమోదు చేసినట్లు బెంగళూరు వెస్ట్ డీసీబీ బి. రమేష్ చెప్పారు. ఫిబ్రవరి 16వ తేదీన ఫేస్ బుక్ లో అమూల్య ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘనిస్తాన్... అన్ని దేశాలకు జిందాబాద్ అంటూ ఓ పోస్టు పెట్టింది. 

తమ చిన్నప్పుడు మాతృభూమిని గౌరవించాలని నేర్పించారని, చిన్నపిల్లగా ప్రజలు దేశాన్ని నిర్మిస్తారని, సంబంధిత ప్రజలు దేశాన్ని గౌరవించాలని అనుకునేదాన్నని ఆమె ఆ పోస్టులో రాసింది.

కర్ణాటకలోని చిక్ మంగళూరుకు చెందిన అమూల్య బెంగళూరులో జరిగిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె చర్యను తాము ఖండిస్తున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఆమె నినాదాలు చేసినప్పుడు హుటాహుటిన ఆమె వద్దకు వెళ్లి నాన్సెన్స్ ను సహించబోమని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని ఆయన చెప్పారు.