తిరువనంతపురం: కేరళలో అత్యంత దారుణమైన, అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటన కూడా. పాతికేళ్ల వయస్సు గల మహిళపై తన మిత్రులతో కలిసి భర్త సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెతో మద్యం తాగించి, ఐదేళ్ల కుమారుడి ముందే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

నిందితులందరినీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పిల్లాడిని నిందితులు కొట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ అఘాయిత్యంపై కేరళ రాష్టర్ మహిళా కమిషన్ కూడా విడిగా కేసు నమోదు చేసింది. 

తన భర్త తననూ తన కుమారుడినీ గురువారంనాడు పుతుకురిచి సమీపంలోని బీచ్ కు తీసుకుని వెళ్లాడని, ఆ తర్వాత సమీపంలోని తన మిత్రుడికి ఇంటికి తీసుకుని వెళ్లాడని, అక్కడ తనతో బలవంతంగా మద్యం తాగించారని, ఆ తర్వాత తన కుమారుడి ఎదుటనే లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. 

వాస్తవాలను గుర్తించిన తర్వాత అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. పోలీసులు మహిళ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. మహిళను ఆస్పత్రిలో చేర్చి, ఆ తర్వాత డిశ్చార్జీ చేశారు. తన దేహంపై సిగరెట్ పీకలతో కాల్చారని కూడా మహిళ టీవీ చానెల్స్ కు చెప్పింది.